మోడీ కరెక్ట్ టైంలోనే....!!

Update: 2018-11-28 15:30 GMT

మోడీ పక్కా పొలిటీషియన్ అని మరోమారు నిరూపించుకున్నారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆరునెలల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పరిణతితో వ్యవహరిస్తున్నారని కితాబునిచ్చారు. చంద్రబాబు నాయుడికి ఆ మాత్రం మెచ్యూరిటీ లోపించిందని దుయ్యబట్టారు. అవిశ్వాసం సందర్భంగా పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతునిచ్చిన టీఆర్ఎస్ రుణం కేసీఆర్ ను ప్రశంసించడంతో తీర్చేసుకున్నారు. అవిశ్వాసంతో సర్కారు పరువు తీసేందుకు యత్నించిన చంద్రబాబు నాయుడి ని పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితో పోలుస్తూ చురకలంటించి చులకన చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని తన మాటల చమత్కారంతో కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను కడిగిపారేశారు. పార్లమెంటులో ఇచ్చిన ప్రశంసకు, ప్రజాక్షేత్రంలో విమర్శకు సంబంధం లేదని స్పష్టం చేసేశారు. రాజకీయంలో ఎక్కడి వాటా అక్కడే ... ఎక్కడి ఖాతా అక్కడే అని తన ప్రసంగాలతో క్లియర్ చేసేశారు. మోడీ మీన్స్ బిజినెస్ అని తేల్చేశారు.

సకుటుంబ సంక్షేమమా...?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాటల మాంత్రికునిగా పేరు. సూటిగా, పదునుగా విమర్శించడమే కాదు, ప్రత్యర్థిని ఊపిరి సలుపుకోని విధంగా సంకటంలోకి నెట్టగల సామర్ధ్యం అతని సొంతం. అంతవరకూ తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని సైతం మాటల చాతుర్యంతో మౌల్డ్ చేయగలరు. ప్రజలను ఆకట్టుకొనే కళలో ఆరితేరిన వ్యక్తి. ప్రసంగాల్లో కేసీఆర్ కు దీటుగా సమాధానం చెప్పగల ధీరుడు మోడీ అనే చెప్పాలి. లోపాయికారీగా బీజేపీ, టీఆర్ఎస్ అంటకాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ప్రతిష్ఠకు ఇది కొంత ఇబ్బందికరమే. పైపెచ్చు తమ అభ్యర్థులు బరిలో నిలిచిన చోట నైతికంగా బలహీనపడిపోతారు. ఎన్నికల తర్వాత సమీకరణలు ఎలా ఉన్నప్పటికీ తమ అభ్యర్థులకు అస్త్రాలు సమకూర్చాల్సిన బాధ్యత అగ్రనాయకత్వంపై ఉంటుంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నే ప్రధాన ప్రత్యర్థిగా చూపించాలి. అందుకే మోడీ కేసీఆర్ కుటుంబ పరిపాలనను ఎత్తి చూపారు. కాంగ్రెసుతో పాటే మీదీ కుటుంబ పాలనే అంటూ ఎద్దేవా చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా జాతీయంగా తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెసును విమర్శించడంతోపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నూ టార్గెట్ చేశారు. కమలం, కారుల పొత్తుపై రేగుతున్న ఆరోపణలకు కొంతమేరకు బహిరంగంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసినట్లే భావించాలి.

మంత్రాలకు చింతకాయలా...?

కేసీఆర్ సెంటిమెంట్లపైనా దాడి చేయడం మోడీలోని చమత్కారానికి దర్పణం పట్టింది. నిమ్మకాయలు, మిరపకాయలు పట్టుకుని పూజలు చేసుకుంటే సరిపోతుందా? అని నిలదీయడం సందర్భోచితమే. నాలుగన్నర సంవత్సరాల్లో చేసిందేమిటో చెప్పకుండా కాలక్షేపం చేస్తున్నారన్న కోణంలో కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ప్రధానంగా ఇంటింటికీ నీళ్లు ఇస్తానన్నారు. కనిపించడం లేదే? అంటూ వెటకారం చేశారు. తెలంగాణ నగరాలను ప్రపంచ ప్రఖ్యాత నగరాల తరహాలో తయారు చేస్తానన్న కేసీఆర్ మాటలపైనా సెటైర్లు విసిరారు. హెలికాప్టర్లో నిజామాబాద్ పై చక్కర్లు కొట్టించి ఎంతమారిందో చూద్దామనుకున్నానంటూ హాస్యం రంగరించారు. మొత్తమ్మీద కేసీఆర్ కు ఘాటు తగిలేలా సంభాషణలతో చక్కిలిగింతలు పెట్టించారు ప్రధాని. అమిత్ షా చాలాకాలంగానే టీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం లభించడం లేదు. అప్పుడప్పుడు కేసీఆర్ వంటి వారు తిప్పికొట్టడం మినహా ప్రచారంలోకి రావడం లేదు. మోడీ కరెక్టు టైమింగ్ లో చేసిన తాజా విమర్శలు మాత్రం ప్రజల్లో చర్చనీయాంశమే.

ఇద్దర్నీ కలగలిపి....

నిన్నామొన్నటి వరకూ మిత్రుడుగా కొనసాగిన చంద్రబాబునూ ఊరకే వదలలేదు. జాతీయంగా బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కడుతున్న చంద్రబాబుపై ఛలోక్తులు విసిరారు. ఆయనతోపాటు కేసీఆర్ నూ కలిపేశారు. వీరిద్దరిదీ ఒకే స్కూలంటూ ఎద్దేవా చేశారు. ఫెడరల్ ఫ్రంట్ కడతానంటున్న కేసీఆర్, కాంగ్రెసుతో కలిసి కూటమి అంటున్న చంద్రబాబు లిద్దరూ సోనియా శిష్యులే అన్నట్లుగా తేల్చేశారు. మొత్తమ్మీద మోడీ తెలంగాణ పర్యటన బీజేపీలో జోష్ నింపిందనే చెప్పాలి. గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రాన్ని సందర్శించిన కేంద్రమంత్రులందరూ ఇక్కడి ప్రభుత్వాన్ని , పథకాలను పొగడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో కాషాయదళంలో చాలా కన్ఫ్యూజన్ కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు మోడీ అటువంటి శషభిషలకు తెర వేసేశారు. మిత్రత్వం వేరు. పార్టీ రాజకీయంలో పోరు వేరు. దేని దారి దానిదే. యుద్దం చేయాల్సిందే అని స్పష్టమైన సంకేతాలిచ్చేశారు. భవిష్యత్ సమీకరణలనేవి ఎన్నికల తర్వాత సంగతే. దీనివల్ల టీఆర్ఎస్ కు కూడా ఒక మేలు జరిగింది. కారు, కమలం ఒకటే అని సాగుతున్న ప్రచారానికి తెరపడితే, మైనారిటీ ఓట్లను మచ్చిక చేసుకోవచ్చు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News