మనసు మాట వినదు…!!

అటు తాను నమ్ముకున్న సిద్ధాంతానికి, ఇటు రాజకీయ అవసరాలకు మధ్య నలిగిపోతున్నారు ప్రధాని నరేంద్రమోడి. నూతన సంవత్సర సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సందిగ్ధతే స్పష్టంగా కనిపించింది. [more]

Update: 2019-01-02 15:30 GMT

అటు తాను నమ్ముకున్న సిద్ధాంతానికి, ఇటు రాజకీయ అవసరాలకు మధ్య నలిగిపోతున్నారు ప్రధాని నరేంద్రమోడి. నూతన సంవత్సర సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సందిగ్ధతే స్పష్టంగా కనిపించింది. ఒకవైపు రైతు రుణమాఫీ వంటి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాఫీ మంత్రాన్ని జపిస్తున్నారు. తనకు ఆమాటే గిట్టదు. ఉచితంగా ఇవ్వడమంటే సహించదు. గుజరాత్ లో తాను పాలించిన పన్నెండు సంవత్సరాల్లో మౌలిక వసతుల కల్పనకే అధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రజామద్దతు పొందగలిగారు. మతపరమైన అంశాలు వీటికి తోడయ్యాయి. దేశ ప్రజలను సైతం అదే కోణంలో ఆలోచింపచేసి మార్పులు తీసుకురావాలని భావించారు. కానీ గుజరాత్ మోడల్ దేశానికి విస్తరించడం సాధ్యం కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. దీంతో తన మనోభావాలకు , రాజకీయ డిమాండ్లకు మధ్య సతమతమవుతున్నారు. విజయపరంపర కొనసాగినంత కాలం పెద్దగా వ్యతిరేకించేవారుండరు. కానీ మోడీని ఎదురించవచ్చు. ఓడించవచ్చు. రాజకీయంగా ఇబ్బంది పెట్టవచ్చన్న నిజం ఇటీవలి ఎన్నికలలో నిరూపితమవుతూ వస్తోంది. దాంతో అసమ్మతి వాదుల వాయిస్ పెరుగుతోంది. కొంతమేరకైనా పార్టీ నేతల మాటలకు విలువ ఇవ్వక తప్పని అనివార్యత ఏర్పడుతోంది.

మాఫీ పై మారాం…

దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఏక్ తారా మొదలుపెట్టాయి. రుణమాఫీ హోరెత్తిస్తున్నాయి. రైతు కష్టాలతో ముడిపెట్టి రాజకీయ ప్రయోజనాలు ఒడిసిపట్టాలనే యావలో పడిపోయాయి. నిజంగానే కర్షకులపై కారుణ్యంతోనో, లేకపోతే వ్యవసాయరంగాన్ని ఉద్ధరించాలనో లక్ష్యం కాదు. అన్నదాతలను ఆకట్టుకుంటే ఓట్ల పంట పండుతుందనే ఏకైక ఆలోచనతో ఆ దిశలో కదులుతున్నారు. దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా రుణమాఫీ , రైతులకు ఆర్థిక సాయం వంటి అంశాలను పార్టీలు ప్రస్తావిస్తున్నాయి. నిజానికి గిట్టుబాటు ధర కల్పిస్తే ఆయా పథకాలతో అవసరమే ఉండదు. తాను సాగు చేసిన పంటకు సరైన రేటు వస్తే రైతు దైన్యమూ సమసిపోతుంది. వ్యవసాయరంగం బాగు పడుతుంది. రైతు లో ఆత్మాభిమానం పెరుగుతుంది. ఎవరి మీదా తాను ఆధారపడాల్సిన అవసరం లేదని భావిస్తాడు. తలెత్తుకుని తిరుగుతాడు. రాజకీయ పార్టీలు తమ దయాదాక్షిణ్యాలపై రైతాంగం ఆధారపడాలని కోరుకుంటాయి. అందువల్లనే సబ్సిడీ, సహాయ కార్యక్రమాలపై చూపిన శ్రద్ధ గిట్టుబాటు ధరపై పెట్టడం లేదు. మోడీ సైతం రాయితీ పథకాలకు వ్యతిరేకం. మాఫీలకూ దూరం. అందువల్లనే తాజా ఇంటర్వ్యూలో కూడా రుణమాఫీ గిమ్మిక్కు అంటూ తేల్చేశారు. కానీ గిట్టుబాటు ధర కల్పిస్తానని హామీ ఇవ్వలేకపోయారు.

‘ఫెడ్’ సరం లేదు…

తమకు పోటీగా ఒక పార్టీ, ఫ్రంట్ పుట్టిందంటే అధికారపక్షం దూకుడుగా స్పందించాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెసుతో కూడిన ఫ్రంట్ పై స్పందిస్తున్న తీరు విమర్శనాత్మకంగా ఉంది. అదే ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నంపై మోడీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అసలు అటువంటి ఫ్రంట్ సంగతే తనకు తెలియదన్నట్లుగా మోడీ మాట్లాడుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో నంబర్ టూ గా గుర్తింపు పొందిన అరుణ్ జైట్లీ మాత్రం టీడీపీ కాంగ్రెసు ఫ్రంట్ లో ఉంటుంది. కేసీఆర్ పెట్టబోయే ఫ్రంట్ లో మమత చేరతారంటూ జోస్యం చెబుతున్నారు. నిజానికి మమత మోడీ పట్ల తీవ్రమైన వ్యతిరేక భావంతో ఉన్నారు. అలాగే ఒడిసాలో నవీన్ పట్నాయక్ ను పదవి నుంచి దించి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ చూస్తోంది. అలాగే ఎస్పీ, బీఎస్పీలు సైతం యూపీలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థులే. మొత్తం ఫెడరల్ ఫ్రంట్ సెటప్ అంతా ఈ పార్టీల ఈక్వేషన్ పైనే ఆధారపడి ఉంది. బలమైన ప్రత్యర్థులు జట్టు కడతున్నారని తెలిసినా ఉదాసీనత కనబరచడంలో బీజేపీ వ్యూహం దాగి ఉందనే చెప్పుకోవచ్చు. ఫెడరల్ ఫ్రంట్ విపక్షాల ఐక్యతను దెబ్బతీస్తుంది. అది కేంద్రంలో అధికారపార్టీకి ఆసరానిస్తుంది. అదే ఆలోచనతో ఫ్రంట్ ను ప్రధాన టార్గెట్ గా చేసుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది.

క్లారిటీ కావాలి….

భారతీయ జనతాపార్టీ శ్రేణులు స్పష్టత కోరుకుంటున్నాయి. చివరిక్షణాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. రైతు రుణమాఫీ, రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించే రైతు బంధు తరహా పథకం, వేసిన పంటకు నష్టపరిహారం చెల్లించే పథకం…మూడింటిలో ఏదైనా తక్షణం అమలు చేయాలని కోరుతున్నారు. ఫిబ్రవరి చివరికే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రజల్లోకి కొత్త పథకాల అమలును తీసుకెళ్లడం సాధ్యం కాదు. గరిష్ఠంగా ప్రజలను ఆకట్టుకొనేలా ప్రచారం సాగించాలంటే కేంద్రం అందచేసే సాయంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ పార్టీలో పెరుగుతోంది. రైతులు అసలు బ్యాంకుల వద్ద అప్పులు చేయాల్సిన అవసరం లేని స్థితిని కల్పిస్తాం. రాయితీలపై ఆధారపడాల్సిన దుస్థితి నుంచి తప్పిస్తామని మోడీ చెబుతున్నారు. ఆ మార్గమేమిటో మాత్రం వెల్లడించడం లేదు. కేసీఆర్ మమతా బెనర్జీతో భేటీ సందర్భంగా రైతు బంధు, ఇన్సూరెన్సు పథకాలు తమ పార్టీకి ఏరకంగా అనుకూలించిందీ వివరించి చెప్పారు. వారం రోజులు తిరగకుండానే మమతా బెనర్జీ పశ్చిమబంగలో ఆయా పథకాల అమలుకు చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్ నెలలోనే మోడీకి రైతు బంధు పథకం గురించి కేసీఆర్ వివరించారు. కానీ కేంద్రం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. మోడీ, అమిత్ షా లు ఈ విషయంలో స్పష్టంగా, సత్వరం స్పందించాలనేది పార్టీ డిమాండ్.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News