Modi : మోదీని మూడోసారి కూడా ఆపలేరా?

దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ పై అసంతృప్తి చెలరేగుతుంది. పెట్రోలు ధరల పెంపుదల, నిత్యావసరాలు నింగికంటడం, ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించడం, పారిశ్రామిక వేత్తలకు కొమ్ముకాయడం వంటివి మోదీ ప్రభుత్వానికి [more]

Update: 2021-10-23 16:30 GMT

దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ పై అసంతృప్తి చెలరేగుతుంది. పెట్రోలు ధరల పెంపుదల, నిత్యావసరాలు నింగికంటడం, ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించడం, పారిశ్రామిక వేత్తలకు కొమ్ముకాయడం వంటివి మోదీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారనున్నాయి. సాధారణ, మధ్యతరగతి ప్రజలలో అసహనం మొదలయింది. దీంతో వచ్చే ఎన్నికలలో బీజేపీకి కష్టకాలమే నన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే మోదీ మూడోసారి అధికారంలోకి రావడానికి ఆయనకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాబోవని అంటున్నారు.

బలహీనంగా కాంగ్రెస్….

ఇందుకు అనేక కారణాలున్నాయి. కాంగ్రెస్ బలంగా లేకపోవడం ఒక కారణం. గత ఎన్నికల్లో బీజేపీకి మూడువందలకు పైగా స్థానాలను సాధించి బలమైన అధికార పక్షంగా నిలిచింది. కానీ మోదీ లెక్కల ప్రకారం ఎంత వ్యతిరేకత ఉన్నా కనీసం రెండు వందల స్థానాలకు పైగా పార్లమెంటు స్థానాలను సాధిస్తామన్న నమ్మకంతో ఉన్నారు. ఉత్తరాదిన గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు తమకు అండగా నిలుస్తాయని భావిస్తున్నారు.

దక్షిణాదిలో….

ఇక దక్షిణాదిలో కాంగ్రెస్ బలంగా లేదు. తమిళనాడులో డీఎంకే సహకారంతో ఎక్కువ స్థానాలను సాధించుకోవచ్చు కాని, మిగిలిన రాష్ట్రాల్లో కనీస స్థానాలను కూడా కాంగ్రెస్ సాధించలేని పరిస్థితి. కర్ణాటకలో కొంత కాంగ్రెస్ ప్రభావం చూపే అవకాశముంది. కానీ అదే సమయంలో అదే కర్ణాటకలో బీజేపీ కూడా అత్యధిక స్థానాలను సాధించే అవకాశాలున్నాయి. కేరళ, తమిళనాడులో తప్ప కాంగ్రెస్ కు మిత్రులెవ్వరూ లేరు.

కాంగ్రెస్ కు బద్ధ శత్రువులుగా….

రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు అధికార పార్టీలు కాంగ్రెస్ కు ఆగర్భ శత్రువులే. తెలంగాణలో కేసీఆర్ చివరి నిమిషంలో కాంగ్రెస్ కూటమి కంటే బీజేపీనే ఎంచుకునే వీలుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సయితం మోదీ వైపే మొగ్గు చూపే అవకాశముంది. కాంగ్రెస్ కు మద్దతిచ్చే అవకాశమే లేదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సయితం బీజేపీ వైపు చూసే ఛాన్స్ ఉంది. ఇలా ఎలా చూసినా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల సహకారంతో మోదీ పార్టీ మూడోసారి అధికారంలోకి మళ్లీ వస్తుందన్న నమ్మకంతో కమలనాధులు ఉన్నారు.

Tags:    

Similar News