కాలు దువ్వినా…?

ఇప్పటికే అంతర్జాతీయ రాజనీతిలో అగ్రస్థానానికి చేరుకున్న భారత్ కు ఐక్యరాజ్యసమితిలో పాక్ చేసిన హెచ్చరికలు పిల్లికూతలే. పాకిస్తాన్ విషయాన్నే పెద్దగా పట్టించుకోనట్లు ప్రధాని మోడీ హుందాతనం కనబరచగా, [more]

Update: 2019-09-29 16:30 GMT

ఇప్పటికే అంతర్జాతీయ రాజనీతిలో అగ్రస్థానానికి చేరుకున్న భారత్ కు ఐక్యరాజ్యసమితిలో పాక్ చేసిన హెచ్చరికలు పిల్లికూతలే. పాకిస్తాన్ విషయాన్నే పెద్దగా పట్టించుకోనట్లు ప్రధాని మోడీ హుందాతనం కనబరచగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం వ్యక్తిగత దూషణలతో తన ప్రతిష్టనే కొంత దిగజార్చుకున్నారు. ఒకరిది ఆత్మవిశ్వాసం. మరొకరిది బెదిరింపు . ఒకరిది శాంతిసందేశం. మరొకరిది హింసా వాదం. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్, పాక్ ప్రధానులు తమ ధోరణులను, వైఖరిని చాటిచెప్పారు. భారత ప్రధాని దేశ మౌలిక సిద్దాంతాలను ప్రాతిపదికగా చేసుకుంటూ ప్రపంచాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ ప్రధాని తన అసహాయతను, ఆక్రోశాన్ని వెల్లడిస్తూ అంతర్గత సంక్షోభం నుంచి గట్టెక్కే ప్రయత్నం చేశారు. ప్రధానుల మాటల్లోని ఆంతర్యం, వ్యక్తిగతంగా, దేశాలకు ప్రతినిధులుగా వారికి లభించిన గుర్తింపును పక్కనపెడితే ప్రపంచదేశాలపై వారిరువురు ఎటువంటి ముద్ర వేశారనేదే ప్రధానం. వారి ప్రసంగాలు అంతర్జాతీయ సమాజానికి ఎటువంటి సందేశాన్నిచ్చాయి?. ఎటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఏర్పడిందన్నదే ముఖ్యం. భారత ప్రధాని వ్యూహాత్మకంగా విస్త్రుత లక్ష్యాలను ఆశిస్తూ ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్ ప్రధాని తన దేశంలో ఏర్పడుతున్న ఒత్తిడులతో ప్రపంచానికి ఒక బెదిరింపు సంకేతాలను ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఆత్మవిశ్వాసం…

భారత ప్రధాని నరేంద్రమోడీ పక్కా రాజకీయ వేత్త. సందర్బాన్ని అనుగుణంగా మలచుకోవడంలో దిట్ట. అంతర్జాతీయ వేదికలను వినియోగించుకోవడంలోనూ చక్కని సమయస్ఫూర్తి కనబరుస్తుంటారు. గడచిన అయిదు సంవత్సరాల కాలంలో 100కు పైగా విదేశీ పర్యటనల్లో 60 దేశాలను ఆయన సందర్శించారు. ప్రతి పర్యటననూ ఆయా దేశాలతో సత్సంబంధాలకు, ఆయా దేశాధినేతలతో వ్యక్తిగత సంబంధాలకు పునాదిరాళ్లుగా మలచుకున్నారు. అదే ఆత్మ విశ్వాసం ఐక్యరాజ్యసమితిలోనూ కనబరిచారు. భారత దేశంలో ఎన్నికల వంటి సందర్భాల్లో పొరుగున ఉన్న పాకిస్తాన్ పై విరుచుకుపడే నరేంద్రమోడీ ఐక్యరాజ్యసమితిలో చాలా సంయమనం పాటించారు. రాజకీయ లౌక్యం పాటించారు. ఉగ్రవాదం భారత సమస్య మాత్రమే కాదు, ప్రపంచమంతా దీనిపై పోరాటం చేయాలన్న సంకేతంతో మొత్తం అంతర్జాతీయ సమాజం ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పైకి చెప్పకుండానే పాకిస్తాన్ ను ఏకాకిని చేసే వైఖరిని అనుసరించారు. అంతేకాకుండా భారత దేశం అనాదిగా అనుసరిస్తూ వస్తున్న విశ్వ శాంతి, సమత, సౌభ్రాతృత్వ భావనలను చాటి చెప్పడానికి ఈ వేదికను చక్కగా వినియోగించుకున్నారు. ఈ రకమైన ఎత్తుగడతో తెలివిగా తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు.

కమల వాదం..అంతర్జాతీయ నాదం…

ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తున్న నినాదం‘సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్ కా వికాస్ ’. అదే వాదంతో భారతీయ ఓటర్ల ను మెప్పించగలిగింది. దేశంలో అత్యంత బలమైన శక్తిగా నిలదొక్కుకోగలిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా రికార్డు సృష్టించింది. అదే నినాదాన్ని మరింత బలంగా ఐక్యరాజ్యసమితిలో వినిపించారు ప్రధాని మోడీ. ఇటీవల హోం మంత్రి అమిత్ షా హిందీ ని జాతీయ భాషగా అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అభ్యసించాలనే కోణంలో వ్యాఖ్యలు చేశారు. అవి పెద్ద ఎత్తున దుమారానికి దారి తీశాయి. ప్రధానంగా తమిళనాడు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనికి ప్రధాని అంతర్జాతీయ వేదిక నుంచి సమాధానం ఇవ్వడం విశేషం. అందరికోసం త్రికరణ శుద్ధితో ఆలోచిద్దామంటూ తమిళ తత్వవేత్త కన్యన్ పుండున్ ద్రవన్ సూక్తులను ప్రస్తావించారు. దీనిద్వారా భాషాపరమైన అంశానికీ చరమ గీతం పాడినట్లయ్యింది. బుద్ధుడు, వివేకానందుని ప్రస్తావనలతో శాంతి సామరస్యాలను భారత్ ప్రబోధిస్తోందని భారత ప్రధాని సమయోచితంగా చెప్పగలిగారు. దీనివల్ల రెండు ప్రయోజనాలు సాధించారు. ఒకటి దేశీయ పార్టీ నినాదాన్ని అంతర్జాతీయం చేయగలిగారు నరేంద్ర మోడీ. దేశంలో విపక్షాలకూ తాను ప్రపంచ నేతగా ఎంత బలంగా స్థిరపడ్డారో వెల్లడించగలిగారాయన.

ఆక్రోశం..అంతర్గత సంక్షోభం…

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ది ముందు నుయ్యి వెనకగొయ్యి వంటి పరిస్థితి. ప్రజాస్వామ్యపరంగా పాకిస్తాన్ నేటికీ పరీక్ష ఎదుర్కొంటోంది. ఆ దేశంలో డెమొక్రసీనే ఒక విఫలప్రయోగంగా చెబుతుంటారు. అయితే పాకిస్తాన్ లో ప్రజాదరణ కలిగిన నేత ఇమ్రాన్. అయినప్పటికీ సైన్యం కబంధ హస్తాల నుంచి ఇంకా పూర్తిగా విముక్తం కాలేదు. మరోవైపు మత చాందసవాదుల సవాళ్లు ఉండనే ఉన్నాయి. అందువల్లనే పాక్ పాలకులు తమ మనసులో ఉండే భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేరు. సైన్యం, మత శక్తుల ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తించాల్సిందే. కశ్మీర్ విషయంలో భారత్ ను దోషిగా నిలిపేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. అయినప్పటికీ తగినంత మద్దతు లభించలేదు. ఆ ఆక్రోశం ఒకవైపు , దేశీయంగా ఎదురవుతున్న ఒత్తిడి మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ప్రసంగంలో తొంగి చూసింది. భారత్ పైన ప్రత్యేకించి ప్రధాని మోడీపైన అక్కసు వెళ్లగక్కారు. ఇస్లామిక్ ఉగ్రవాదం, యుద్ధం వంటి తీవ్ర పదజాలంతో ఇమ్రాన్ ప్రసంగం గాడి తప్పిందనే చెప్పాలి. భారత్ ను బెదిరించడం సాధ్యం కాదు కాబట్టి ప్రపంచ దేశాలను యుద్ధోన్మాదంతో భయపెట్టాలని చూశారు. ఇది పాకిస్తాన్ బలహీనతను బయటపెట్టిందే తప్ప భారత్ కు నష్టం చేస్తుందని ఎవరూ భావించడం లేదు. ఏదేమైనప్పటికీ భారత బూచిని చూపించడం ద్వారా అన్ని రకాల సమస్యల నుంచి గట్టెక్కవచ్చని పాకిస్తాన్ తలపోస్తే ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినట్లే. ఇప్పటికే దౌత్యరంగంలో పాకిస్తాన్ కు అందనంత ఎత్తుకు ఎదిగిన భారత్ కే ఈ పరిణామం లబ్ధి చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News