యూపీతో బీపీ తప్పదా?

Update: 2018-06-08 16:30 GMT

దేశరాజకీయాలకు గుండెకాయ వంటిది ఉత్తరప్రదేశ్. అత్యధికంగా 80 లోక్ సభ స్థానాలతో విరాజిల్లుతున్న ఈ ఉత్తరాది రాష్ట్రంలో పట్టు సాధించిన పార్టీలే హస్తినను హస్తగతం చేసుకుంటున్నాయి. ఇక్కడ ఓడిపోయిన పార్టీలు ఢిల్లీ రాజకీయాల్లో విపక్షానికే పరిమితమవుతున్నాయి. చరిత్ర చెబుతున్న సత్యమిది. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 73 స్థానాలను గెలుచుకున్న బీజేపీ రాష్ట్రంలో తన బలాన్ని నిరూపించుకుంది. స్వయంగా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ జ్యోతిర్లింగ క్షేత్రమైన వారణాసి నగరంలో విజయం సాధించారు. ఇదే ఊపులో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాత నుంచే కమలం పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో గొరఖ్ పూర్, పూల్పూర్, తాజాగా జరిగిన కైరానా లోక్ సభ ఎన్నికల్లో ఓటమి కమలం పార్టీని కుంగదీసింది. అంతకు ముందు 2014 ఎన్నికల్లో జరిగిన మెయిన్ పురి లోక్ సభ ఉప ఎన్నికల్లో సైతం కమలనాధులు పరాజయం పాలవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో పాత సెంటిమెంట్ ప్రకారం పార్టీకి కష్టకాలం తప్పదేమోనన్న ఆందోళన, అనుమానం, భయం పార్టీకి పట్టుకుంది. గత రెండు దశాబ్దాల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే యూపీలో ఓటమి పాలయిన పార్టీలు ఢిల్లీలో డీలా పడుతున్నట్లు అర్థమవుతోంది.

ఉప ఎన్నికల్లో ఓటమితో.....

2014 లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అజంఘర్ ను ఉండచుకుని మెయిన్ పురి స్థానానికి రాజీనామా చేశారు. అనంతరం అదే ఏడాది ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ములాయం సింగ్ సమీప బంధువు తేజ్ పాల్ సింగ్ యాదవ్ మూడు లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో జరిగిన గోరఖ్ పూర్, పుల్పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి ఆదిత్యానాధ్ అయిదుసార్లు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్ పూర్ ను సమాజ్ వాదీ పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పవిన్ నిషాద్ 21,961 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 60వ దశకంలో ప్రధమ ప్రధాని పండిట్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన పుల్పూర్ నూ బీజేపీ కోల్పోయింది. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో మార్చిలో జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థఇ 59,613 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. తాజాగా పశ్చిమ యూపీలోని కైరానా నుంచి రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అభ్యర్థి 44 వేల ఓట్ల మెజారిటీ సాధించడం విశేషం. అంటే ఈ నాలుగేళ్లలో జరిగిన నాలుగు ఎన్నికల్లో కమలం పార్టీ ఓడిపోయింది. అదే సమయంలో ఈ నాలుగు స్థానాలూ ఆ పార్టీవే కావడం విశేషం.

యూపీ నుంచి ఎక్కువ స్థానాలు...

1996లో 161 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 13 రోజుల పాటు దేశాన్ని పాలించింది. ఈ 161లో 51 స్థానాలు యూపీ నుంచి గెలిచినవే కావడం గమనార్హం. అప్పట్లో వాజపేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1998 లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లో 182 సీట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో 58 యూపీ నుంచి గెలిచినవే కావడం విశేషం. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 141 స్థానాలు సాధించినా యూలపీలో ఒక్క చోట సైతం విజయం సాధించలేకపోయింది. 1999లో 182 స్థానాలతో వాజ్ పేయి మళ్లీ ప్రధాని అయ్యారు. ఈ ఎన్నికల్లో యూపీలో 29 సీట్లను పార్టీ సాధించింది. గతంలో కన్నా సీట్లు తగ్గినప్పటికీ ఎక్కువ సీట్లు బీజేపీకే ఇక్కడ వచ్చాయి. అప్పట్లో అయిదేళ్ల పాటు వాజ్ పేయి పాలించారు.

ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.....

యూపీలో తక్కువ స్థానాలను సాధించినప్పుడు బీజేపీ ఢిల్లీలో అధికారం చేపట్టలేకపోయింది. 2004 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం పది స్థానాలకే పరిమితమైంది. ఫలితంగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉండి పోవాల్సి వచ్చింది. నాటి ఎన్నికల్లో యూపీలో 20 లోక్ సభ స్థానాలు సాధించిన కాంగ్రెస్ హస్తినలో అధకారాన్ని కైవసం చేసుకుంది. 2009 లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. బీజపీ ఇక్కడ పది స్థానాలకే పరిమితం కావడంతో అధకారానికి ఆమడదూరంలో ఆగిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ యూపీలోని పాత స్థానాలను కాపాడుకోగలిగింది. 206 సీట్లతో మళ్లీ అధికారాన్ని అందుకుంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో 71 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మిత్రపక్షమైన అప్నాదళ్ కు రెండు సీట్లు లభించాయి. అదే సమయంలో సొంత మెజారిటీతో ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంది కమలం పార్టీ. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 39.7 శాతం, బీఎస్సీకి 22.2 శాతం, ఎస్సీకి 22 శాతం, కాంగ్రెస్ కు 6.2 శాతం ఓట్లు లభించాయి. అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు 50.4 శాతం ఓట్లు లభించాయన్న మాట. ఈ గణాంకాలు కమలనాధులను కలవరపెడుతున్నాయి. అదే సమయంలో గత మూడు ఉప ఎన్నికలు, తాజాగా కైరానా ఉప ఎన్నిక ఫలితం బీజేపీని భయపెడుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భవిష్యత్ ఎా ఉంటుందోనన్న టెన్షన్ ఇప్పటి నుంచే కమలనాధుల్లో మొదలయింది. దీంతో ఆ పార్టీ అధినాయకత్వం యూపీలో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News