ఇక చూసుకుందామా....?

Update: 2018-08-12 16:30 GMT

కాంగ్రెసు, బీజేపీలు కార్యాచరణకు దిగిపోయాయి. పార్లమెంటు సమావేశాలు ముగిసి ఒకరోజు కూడా కాకుండానే రాజకీయయాత్రలకు అగ్రనాయకులు శ్రీకారం చుట్టారు. డిసెంబరులో ఎన్నికలు జరపాల్సి ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ , మిజోరాంలపై దృష్టిసారించారు. కాంగ్రెసు అధినేత రాహుల్ గాంధీ రాజస్థాన్లో 13 కిలోమీటర్ల రోడ్డు షోతో ఎన్నికల నగారా మోగించారు. మధ్యప్రదేశ్ లో 32 మందితో పోల్ కమిటీని నియమించారు. మరోవైపు న్యాయపోరాటం, ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి పెంచడం , ప్రజల్లో విస్తృతంగా పర్యటనలు నిర్వహించడం వంటి బహుముఖ విధానాలను అవలంబించబోతున్నారు. మరోవైపు అమిత్ షా నేతృత్వంలో బీజేపీ పాలిత ఎన్నికల రాష్ట్రాల కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్దమవుతోంది. ప్రజాక్షేత్రంలో బాహాబాహీ తలపడేందుకు రానున్న మూడు నెలల కార్యాచరణను ఈ రెండు పార్టీల అగ్రనేతలు ఇప్పటికే ఖరారు చేసుకున్నారు. అమిత్ షా క్షేత్రస్థాయి పర్యటనలతో క్యాడర్ కు సంబంధించి ముందస్తు కసరత్తు మొదలుపెట్టేశారు. ప్రజల్ని కలిసే కార్యక్రమాలు, బహిరంగ సభల నిమిత్తం ప్రధాని షెడ్యూలుపైనా ప్రాథమిక మైన యాక్షన్ ప్లాన్ తయారైంది. తుదిమెరుగులు దిద్దుతున్నారు.

న్యాయపోరాటంలో నైతిక విజయం.....

ఓటర్ల లిస్టులో అక్రమాలపై కాంగ్రెసు పార్టీ పోరాటం మొదలు పెట్టింది. మూడు దఫాలుగా వరసగా విజయాలు సాధిస్తూ వస్తున్న మధ్యప్రదేశ్ ను లక్ష్యంగా చేసుకుంది. కాంగ్రెసు పార్టీకి కమలనాథ్ వంటి సీనియర్ నాయకులు ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియా వంటి యువతరం నేతలకూ కరవు లేదు. అయినప్పటికీ సంఘటితమైన బలంతో బీజేపీ అనాయాస విజయాలు సాధిస్తోంది. ఇక్కడ లక్షల సంఖ్యలో నమోదైన అక్రమ ఓట్లు ఇందుకు కారణమని కాంగ్రెసు అనుమానిస్తోంది. ముందుగా వాటిపై దృష్టి పెట్టింది. దాదాపు 60 లక్షల మేరకు రెండేసి చోట్ల నమోదైన ఓట్లు, దొంగ ఓట్లు, అనామతు పేర్లతో కూడిన ఓట్లు చెల్లుబాటవుతున్నాయి. వీటన్నిటినీ ఏరిపారేయాలని హస్తం పార్టీ పట్టుపడుతోంది. ఎన్నికల కమిషన్ మీనమేషాలు లెక్కిస్తోంది. రాజకీయ కారణాలే ఇందుకు కారణమనేది కాంగ్రెసు అనుమానం. అక్రమ ఓట్ల అంతుచూసే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. మరోనాలుగు నెలల్లో ఎన్నికలు జరపనుండగా , ఇప్పటికీ దొంగ ఓట్లు యథాతథంగా ఉండటాన్ని ప్రమాద సంకేతంగా కాంగ్రెసు భావిస్తోంది. వీటిపై న్యాయపోరాటానికి దిగింది. సుప్రీం కోర్టులో కేసు వేసింది. న్యాయస్థానం కూడా వేగంగా స్పందించి వీటిపై ఆరా తీస్తూ విచారణ మొదలుపెట్టడం తొలి నైతిక విజయంగా కాంగ్రెసు భావిస్తోంది.

ఎన్నికల కమిషన్ పై ఎదురుదాడి...

జనవరి నెలలోనే ఎన్నికల కమిషన్ కు దొంగ ఓట్లపై వివరాలు అందాయి. కానీ చాలా నెమ్మదిగా స్పందించింది సీఈసీ. 24 లక్షల ఓట్లు అక్రమమని ఎట్టకేలకు నిర్ధరించింది. అంటే మధ్యప్రదేశ్ లో భారీ ఎత్తున అక్రమ ఓట్లు గతంలో చెలామణి అయినట్లు పరోక్షంగా అంగీకరించినట్లే. ఈ 24 లక్షల ఓట్ల తొలగింపును పక్కనపెట్టి మిగిలిన దొంగ ఓట్ల సంగతేమిటని కాంగ్రెసు నిలదీస్తోంది. కనీసం మరో 35 , 36 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయనేది హస్తం పార్టీ వాదన. ఎన్నికల కమిషన్ ఈవాదనతో ఏకీభవించడం లేదు. అందుకే సుప్రీం కోర్టులో కేసు వేసి ఎన్నికల సంఘాన్ని న్యాయస్థానం బోను ఎక్కించింది కాంగ్రెసు. ఈసారి ఎన్నికలు ఓటర్లకు నమ్మకం కలిగించే వోటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ విధానంలో పెట్టాలని డిమాండు చేస్తోంది. కానీ అందుకు తగినన్ని పేపర్ మిషన్లు అందుబాటులో లేవు. 16.15 లక్షల యూనిట్లు అవసరమని అంచనా వేయగా, ఇంతవరకూ 5.88 లక్షలు మాత్రమే తయారయ్యాయి. వీటన్నిటినీ సాకుగా చూపుతూ వీవీపీఏటీలతో ఎన్నికలు సాధ్యం కాదని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. దీనివల్ల అక్రమాలు చోటు చేసుకుంటాయి. ఎన్నికల సంఘం నిర్లక్ష్యం, ఉదాసీనత కారణమవుతోందని కాంగ్రెసు ఆరోపిస్తోంది. దీనిని న్యాయస్తానంలో తేల్చుకునేందుకు , ఎన్నికల సంఘాన్ని దోషిగా నిలిపేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తోంది.

దక్షిణాది దండయాత్ర...

దక్షిణాది లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే సూచనలున్నట్లుగా కాంగ్రెసు అనుమానం. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య ఇటీవల పెరిగిన సాన్నిహిత్యం ఇందుకు కారణం. అసెంబ్లీకి ముందస్తుగా ఎన్నికలకు వెడితే లోక్ సభ పై దాని ప్రభావం పడదనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయం మోడీతో సైతం చర్చించారని మీడియాలో కొన్నివర్గాలు పేర్కొంటున్నాయి. ఇది సాధికారికం కాకపోయినా నడుస్తున్న పరిస్థితులను బట్టి వేస్తున్న అంచనా. రాహుల్ గాంధీ రంగంలోకి దిగి తెలంగాణ కాంగ్రెసులో జోష్ నింపబోతున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకునేందుకు అవసరమైన సహాయసహకారాలు అందించబోతున్నారు. నెలాఖరులోగా ఏపీలో కూడా రాహుల్ పర్యటనను ఖరారు చేస్తున్నారు. సెప్టెంబరు నెలలో అమిత్ షా సైతం ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఏతావాతా ఎక్కడ అవకాశం ఉన్నా వదలకుండా తమ బలాన్ని పరీక్షించుకునేందుకు ఇరుపక్షాలు రంగంలోకి దిగుతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News