మోడీ మెడకు చుట్టుకుందా.....!

Update: 2018-07-30 16:30 GMT

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రోజురోజుకూ సరికొత్త సమాచారం, ఆరోపణలతో విపక్ష కాంగ్రెస్ ఈ విషయంలో చెలరేగిపోతుండగా అటే అధికార భారతీయ జనతా పార్టీ, ఇటు ప్రభుత్వం ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఎ.ఎల్) ను పక్కన పెట్టి, పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ కు కాంట్రాక్టును కట్టబెట్టిన తీరు చూస్తే కాంగ్రెస్ ఆరోపణలను అంత తేలిగ్గా కొట్టిపారేయలేమని అర్థమవుతోంది. ధరల విషయం రహస్యమన్న వాదన తప్ప ప్రభుత్వం నుంచి మరో వాదన వినపడక పోవడాన్ని చూస్తే అనుమానాలకు ఆస్కారం ఏర్పడుతుంది. యూపీఏ హయాంలో అప్పటి రక్షణ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఏకే ఆంటోనీలు కూడా ధరల విషయాన్ని రహస్యంగా ఉంచాలని చెప్పడం తప్ప ప్రభుత్వం అంతకు మించి మాట్లాడలేకపోతోంది.

అసలు విషయమేంటంటే.....

ఒక్కసారి పూర్వాపరల్లోకి వెళితే.... వాస్తవం అర్థమవుతుంది. 2014 ఎన్నికలకు ముందు అంటే మార్చి 13న యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందానికి నాందీ వాచకం పలికారు. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారీ భాగస్వామ్య ఒప్పందం పేరుతోరూ.36 వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్టుపై రాఫెల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ ఈ ఒప్పందాన్ని తిరగదోడారు. 2015 ఏప్రిల్ 10వ తేదీన 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాంట్రాక్టును హిందూస్థాన్ ఏరోనాటిక్స్ కు బదులు అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ కు అప్పగించారు. దీనిని ‘‘ఆఫ్ సెట్’’ కాంట్రాక్టు అని వ్యవహరిస్తారు. అంటే ప్రభుత్వ మధ్యవర్తిత్వంలో కుదిరే భాగస్వామ్య ఒప్పందంగా దీనిని పేర్కొనవచ్చు. అనిల్ అంబానీతో బీజేపీకి, వ్యక్తిగతంగా నరేంద్ర మోదీకి గల సాన్నిహిత్యమే ఇందుకు కారణమన్నది కాంగ్రెస్ వాదన. లేనట్లయితే ప్రభుత్వ రంగ సంస్థను కాదని ఒక ప్రయివేటు సంస్థకు కాంట్రాక్టును ఎలా కట్టబెడతారన్న ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి. ప్రభుత్వ రంగ సంస్థను ప్రోత్సహిస్తే అందులో పనిచేసే ఉద్యోగులకు చేతినిండా పనిదొరుకుతుంది. తక్కువ ధరకు నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలు నానాటికీ బలహీనపడుతున్న తరుణంలో ఇటువంటి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు వాటిని నిలబెడతాయి. అదే ప్రయివేటు సంస్థలయితే ఎంతోకొంత కమీషన్లు ప్రభుత్వ పెద్దలకు ముట్టజెప్పక తప్పదు. పార్టీ అవసరాలు, ఎన్నికల అవసరాలకు నిధుల అవసరమూ తప్పదు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో కార్పొరేట్ సంస్థల విరాళాలు అన్ని పార్టీలకూ అంది ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అనుభవం శూన్యమే అయినా.....

ఇక రిలయన్స్ సంస్థకు రక్షణ రంగ ప్రాజెక్టుల్లో గల అనుభవం దాదాపు శూన్యం. పేరుకు అది దిగ్గజ పారిశ్రామిక సంస్థ అయినప్పటికీ రక్షణ రంగ ప్రాజెక్టులను గతంలో అది ఎన్నడూ చేయలేదు. రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తామన్న ప్రధాని ప్రకటనకు కొద్ది రోజుల ముందే అంటే 2015 మార్చి 28న రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ ఏర్పాటయింది. అప్పటికి యుద్ధవిమానాల తయారీకి సంబంధించిన అనుమతులు (లైసెన్స్) కూడా దానికి రాలేదు. అనంతరం దాని అనుబంధ సంస్థ అయిన ‘‘రిలయన్స్ ఏరో స్ట్రక్చర్ లిమిటెడ్’’కు యుద్ధవిమానాల తయారీ లైసెన్స్ ను రక్షణ మంత్రిత్వ శాఖ మంజూరు చేయడం గమనార్హం. 2016 ఫిబ్రవరి 22న లైసెన్స్ ఇవ్వగా అప్పటికి ఆ సంస్థకు స్థలంగానీ, భవనం గానీ లేకపోవడం చూస్తే కాంగ్రెస్ ఆరోపణలను కొట్టిపారేయలేమని అర్థమవుతోంది.

రెచ్చిపోతున్న రాహుల్.....

రాఫెల్ విమనాలను తయారు చేసే ‘‘డసో ఏవియేషన్ ’’ కంపెనీ నుంచి రూ. 30 వేల కోట్ల ఆఫ్ సెట్ కాంట్రాక్టు సంపాదించామని రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ పేర్కొంటోంది. దీనికి కొనసాగింపుగానే రూ.లక్ష కోట్లకు లైఫ్ సైకిల్ కాస్ట్ కాంట్రాక్టును కూడా పొందామని అది చెబుతోంది. డసో ఏవియేషన్ కూడా తన 2016-2017 నివేదికలో ఈవిషయాన్ని ధృవీకరించింది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను భుజానికెత్తుకున్న రాహుల్ గాంధీకి ‘‘రాఫిల్’’ అంశం మంచి అవకాశంగా మారింది. ఇది ఏకంగా 1.30 లక్షల కోట్ల కుంభకోణమని ఆయన ఆరోపిస్తున్నారు. నాలుగు బిలియన్ల డాలర్ల ఆఫ్ సెట్ కాంట్రాక్టు, 16బిలియన్ డాలర్ల రాఫెల్ లైఫ్ సైకిల్ కాంట్రాక్టు ఉంది. అంటే మొత్తం కుంభకోణం విలువ 20 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే ఇది రూ.1.30లక్షల కోట్లు అని రాహుల్ విశదీకరిస్తున్నారు.

పేలవమైన స్పందన.....

కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందన పేలవంగా ఉంది. యూపీఏ ప్రభుత్వం ఒక్కో విమానధర 100.85 మిలియన్ యూరోలుగా నిర్ణయించగా, తాము 91.75 మిలియన్ యూరోలకు తగ్గించామని చెబుతున్నారు. యూపీఏ హయాంలోరక్షణ మంత్రులుగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ, ఏకే ఆంటోనీ లు రక్షణ కొనుగోళ్లకు సంబంధించి జాతీయ భద్రత దృష్ట్యా ధరల విషయాన్ని వెల్లడించలేమని చెప్పారని గుర్తు చేస్తున్నారు రవిశంకర్ ప్రసాద్. ఇక రాజకీయ రాద్ధాంతాలను పక్కన పెడితే స్వయంగా ఈ ఆరోపణలపై స్పందించారు రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ. నేరుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాశారు. గాంధీల కుటుంబంతో తనకు తరాల అనుబంధం ఉందంటూ ఆరోపణలను తోసిపుచ్చారు. రక్షణ ఉత్పత్తుల తయారీలోతగిన అనుభవమే కాకుండా నాయకత్వ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఫ్రాన్స్ సంస్థ తమను తన స్థానిక భాగస్వామిగా ఎంపిక చేసుకుందని స్పష్టం చేశారు. ఇది రెండు సంస్థల మధ్య ఒప్పందమే తప్ప ప్రభుత్వ ప్రమేయం లేదని వివరించారు. ఎందరు ఎన్ని వివరణలు ఇచ్చినప్పటికీ వాస్తవాలు ఏదో ఒకరోజు వెలుగులోకి రాకమానవు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News