గడ్డం మీద చేయ్యేస్తే ….ఇక అడ్డం లేనంతగా?

చప్పట్లు కొట్టండి …అంటే అంతా కొట్టాలిసిందే. దీపాలు వెలిగించండి … అంటే వెలిగించాలిసిందే. ఆయన మన లీడర్. ఎవరి రాజకీయ అభిప్రాయాలు ఎలా ఉన్నా సంక్షోభ సమయంలో [more]

Update: 2020-04-06 14:30 GMT

చప్పట్లు కొట్టండి …అంటే అంతా కొట్టాలిసిందే. దీపాలు వెలిగించండి … అంటే వెలిగించాలిసిందే. ఆయన మన లీడర్. ఎవరి రాజకీయ అభిప్రాయాలు ఎలా ఉన్నా సంక్షోభ సమయంలో లీడర్ చెప్పింది పాటించడం దేశంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. వారానికో కొత్త స్లోగన్ తో దేశ ప్రధాని ఇస్తున్న పిలుపులు భారతీయుల్లో ఐక్యత ను మేల్కొల్పుతున్నాయి.

అవకాశంగా మలచుకుంటూ…

సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్న వాడే నేటి రాజకీయాల్లో రాణించగలరు. ఇది మోడీకి వెన్నతో పెట్టిన విద్య అంటారు విశ్లేషకులు. మోడీ రాజకీయ జీవితంలో అడుగడుగునా సంక్షోభాలు, సమస్యలే. గోద్రాలో అల్లర్లు మొదలు కొని నోట్ల రద్దు వరకు మోడీ సంక్షోభాలను ఎదుర్కొన్నారు, అలాగే సమస్యలు సృష్ట్టించి వాటిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు అన్నది మేధావుల అభిప్రాయం. ఈ సంక్షోభాలనే ఆయన మెట్లుగా మలుచుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రధాని పీఠం అధిరోహించారు నరేంద్ర మోడీ.

విపక్షానికి సౌండ్ లేకుండా …

ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభంలో విపక్షానికి నోరు లేవకుండా తన రాజకీయ చతురతతో ముందుకెళుతున్నారు మోడీ. దేశంలోని అన్ని వర్గాలతో వీడియో కాన్ఫరెన్స్ లతో ఒక పక్క, దేశ విదేశాల్లోని నేతలతో మరోపక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రులతో అనుసంధానం అవుతూ ఆల్ రౌండ్ పెరఫార్మెన్స్ చూపిస్తున్నారు ప్రధాని మోడీ. అక్కడితో ఆగలేదు ఆయన దేశంలోని మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్ సింగ్ వంటివారితో టచ్ లో ఉంటూ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ , విపక్ష నేత సోనియాగాంధీ వంటి వారి సలహాలు స్వీకరిస్తూ కొత్త ఒరవడిని సృష్టించారు మోడీ.

ప్రపంచ నేతలతో సహా…..

అలాగే తాజాగా ఈనెల 8వ తేదీన అఖిలపక్షం ను పిలవడం ద్వారా తన నిర్ణయాలను సర్వజనామోదం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేశారు. ఇలా లాక్ డౌన్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకుని అందులో ప్రపంచ నేతలతో కూడా ప్రశంసలు అందుకున్న మోడీ ఇక దేశంలో అన్ని రాజకీయ పక్షాలను దగ్గర చేసుకుని ఈ సమయంలో విమర్శలు, ఆరోపణలు కాదు మీ విలువైన సలహాలు సూచనలు అంటూ జనం హృదయాలను దోచేశారు. ఇప్పుడు దేశంలో మోడీ ఏం చెబితే అదే. ఆయన పిలుపుకు అలాంటి రెస్పాన్స్ వస్తుంది. 130 కోట్ల మందిని మెస్మరైజ్ చేయడంలో మోడీకి మించిన వారు మరొక లేరు. ఇది వాస్తవం.

Tags:    

Similar News