ఎదురొడ్డే ధైర్యం ఉందా…?

వర్తమాన రాజకీయాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా జంట జగజెట్టీల మాదిరిగా బలంగా ఉంది. ఈ జంటకు ఎదురులేదన్నది దేశీయంగానూ, విదేశీయంగానూ రుజువు అవుతోంది. డెబ్బయ్యేళ్ళ కాశ్మీర్ [more]

Update: 2019-08-24 16:30 GMT

వర్తమాన రాజకీయాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా జంట జగజెట్టీల మాదిరిగా బలంగా ఉంది. ఈ జంటకు ఎదురులేదన్నది దేశీయంగానూ, విదేశీయంగానూ రుజువు అవుతోంది. డెబ్బయ్యేళ్ళ కాశ్మీర్ రావణ కాష్టాన్ని రెండు రోజుల వ్యవధిలో ఆర్పేసిన ఘనత ఈ ఇద్దరిదే. కాశ్మీర్ ను ముక్కలు చేయాలన్న ఆలోచనలోనే ఈ జోడీ రాజకీయ వ్యూహం ఎంతగా పదునెక్కిందో అర్ధమైపోతుంది. దెబ్బకు పాక్ దేశానికి దిమ్మ తిరిగిపోతే అంతర్జాతీయ సమాజం కిక్కురుమనలేదు. ఇలా అధికారంలోకి వచ్చి గట్టిగా మూడు నెలలు కాకుండానే బంతులను బౌండరీలు దాటిస్తూ చెడుగుడు ఆదేసుకుంటున్నారు. ఇంకా నాలుగేళ్ళ తొమ్మిది నెలల సమయం ఉంది. మోడీని తట్టుకుంటూ అంతవరకూ విపక్ష కూటమిలో ఎవరు ఉంటారో, ఎందరు తప్పుకుంటారో కూడా తెలియని పరిస్థితి. ఎన్నికల ముందు హడావిడి చేసిన విపక్ష శిబిరం ఇపుడు పూర్తిగా చప్పబడిపోయింది, పైగా కకావికలమైపోయింది. అతి పెద్ద ముత్తయిదువగా చెప్పుకునే కాంగ్రెస్ సైతం సీన్ లో నుంచి తప్పుకుని బిత్తర చూపులు చూస్తున్న వేళ మోడీ, షాలకు ఎదురొడ్డి నిలబడమంటే ఎవరు రెడీ అవుతారు.

వద్దు పొమ్మంటున్నారా…?

శతాధిక వృధ్ధ, అతి పెద్ద యోధ అయిన కాంగ్రెస్ పార్టీయే మోడీతో కుస్తీ పట్టలేనని మమస్కారం చేసిన సన్నివేశం ఎదురుగానే కనిపిస్తోంది. ఇలా ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో అలా రాహుల్ గాంధీ తన ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి మూలకు చేరిపోయారు. ఏ దిక్కూ లేక వంట్లో అసలు బాగా లేని సోనియమ్మనే పెద్ద దిక్కుగా చేసుకుని కాంగ్రెస్ బండి కుంటిగా నడుపుకుంటోంది. ఈ నేపధ్యంలో దేశంలో ప్రతిపక్షం దాదాపుగా నిర్వీర్యం అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూంటే ఆశ చావని ఒకరిద్దరు నేతలు మళ్ళీ కూటమి కడదామని అంటున్నారంటే వారి బాధను అర్ధం చేసుకోవాల్సిందే మరి. బీహార్ కి చెందిన ఆర్జేడీ ఎంపీ ఒకరు ఇదే విషయమై బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత అయిన నితీష్ కుమార్ ని కలసి సంప్రదించారట. మీరే మాకు దిక్కు, విపక్ష కూటమికి నాయకత్వం వహించమని కోరారట. అయితే ఈ తరహా ప్రతిపాదనకు నితీష్ నో అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. నిజమే నితీష్ తెలివైన రాజకీయ నాయకుడు. కళ్ళ ముందు బండ మెజారిటీతో మోడీ దూకుడు మీద ఉంటే ఎదురెళ్ళి బొక్క బోర్లా పడడానికి నితీష్ అమాయకుడు కాదు కదా. అందుకే ఆయన తెలివిగా చెప్పారట. తాను ఇంకా ఎన్డీయేలోనే ఉన్నానని. తనకు విపక్ష కూటమికి సారధ్యం వహించాలని ఆసక్తి ఏమీ లేదని కూడా అన్నారట.

ఇంతే సంగతులా…?

ఇప్పటికైతే విపక్ష కూటమి అన్నది ఓ వూహా చిత్రమే అవుతోందని అంటున్నారు. మోడీ మీద కాళికామాతలా రెచ్చిపోయిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం 2021 ఎన్నికలకు భయపడుతున్నారట. కాంగ్రెస్ తో దోస్తీకి సైతం ఆమె రెడీ అవుతున్నారన్న ప్రచారమూ ఉంది. మరో వైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లో కూడా సన్నని వణుకు మొదలైంది. మాయావతి, అఖిలేష్ యాదవ్ వంటి వారు స్తబ్దుగా ఉన్నారు. శరద్ పవార్ జాడ ఎక్కడా లేదు. ఏపే మాజీ సీఎం చంద్రబాబు అయిపూ అజా ఎవరికీ తెలియడంలేదు. మాజీ ప్రధాని దేవెగౌడ సైతం నీరసించిపోయారు. అవును ఇపుడు నడుస్తోంది మోడీ శకం, పరుగులు తీస్తోంది మోడీ రధం. దాన్ని పట్టి బంధించి అశ్వమేధ యాగం చేయమంటే క్షతగాత్రులతో పూర్తిగా నిండిన విపక్ష శిబిరానికి అయ్యే పనేనా. 2019 ఎన్నికల్లో ఎటూ నిండా మునిగారు. 2024 ఎన్నికలకు సైతం కూటమి కట్టేందుకు భయపడుతున్నారంటేనే ప్రతిపక్షానికి ఎంతటి దైన్యం ఆవరించిందో అర్ధమవుతోంది. చూడాలి మరి విపక్ష కూటమిలోనూ కళా కాంతులు వచ్చే రోజులు ఎపుడు ఉంటాయో.

Tags:    

Similar News