సీన్ రివర్స్ …మోడీకి డ్యామేజ్…..కాంగ్రెసుకు కాసింత ఊపిరి

కరోనా కారణంగా పెల్లుబుకిన దేశభక్తితో బీజేపీకి మరో దశాబ్దం పాటు తిరుగులేని స్థితి ఏర్పడిందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అందులోనూ ప్రధాని నరేంద్రమోడీ ఏకైక జాతీయ నేతగా [more]

Update: 2020-05-08 16:30 GMT

కరోనా కారణంగా పెల్లుబుకిన దేశభక్తితో బీజేపీకి మరో దశాబ్దం పాటు తిరుగులేని స్థితి ఏర్పడిందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అందులోనూ ప్రధాని నరేంద్రమోడీ ఏకైక జాతీయ నేతగా ఆవిర్భవించారనే చెప్పాలి. రాష్ట్రాలు, కేంద్రం అన్న తేడా లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ సంఘీభావం ప్రకటించారు. ఆయన పిలుపిస్తే చాలు జాతి మొత్తం స్పందించింది. సంక్షోభంలో సమర్థ నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వెల్లువెత్తిన ప్రశంసలకైతే కొదవే లేదు. కానీ తాజాగా పరిస్థితులు క్రమేపీ మారుతున్నాయి. పూర్తిగా రివర్స్ అయ్యాయని చెప్పలేం. కానీ కేంద్రం బలహీనతలు, విచక్షణ రహిత నిర్ణయాలతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఇది కచ్చితంగా కొన్ని వర్గాలను బీజేపీకి దూరం చేసే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే గంపగుత్తగా మద్దతునిచ్చిన రాష్ట్రాలు ఒక్కటొక్కటిగా దూరం జరుగుతున్నాయి. కేంద్రంతో విభేదిస్తున్నాయి. ఇదే అదనుగా కాంగ్రెసు తన ప్రధాన ప్రతిపక్ష పాత్రకు సిద్ధమవుతోంది. బలం పుంజుకుంటోంది. మోడీ చాణక్యం, వాక్చాతుర్యం, నాయకత్వ పటిమను ఢీకొనలేక నలిగిపోతున్న కాంగ్రెసు పార్టీ కాసింత ఊపిరి పోసుకునే వెసులుబాటు దొరుకుతోంది.

నేరం మాది కాదు…

ప్రజలందర్నీ 45 రోజులకు పైగా ఇళ్లల్లో బందీలను చేసిన లాక్ డౌన్ ఫలితం ఒక్కసారిగా నిష్ప్రయోజనమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రం అనాలోచితంగా మద్యానికి అనుమతులిస్తున్నట్లుగా రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించింది. ఆర్థిక వనరుల కోసం ఆవురావురుమంటున్న రాష్ట్రాలు ఆబగా అందిపుచ్చుకున్నాయి. దేశంలో మద్యం రూపేణా రాష్ట్రాలకు ఏటా రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తున్న మాట వాస్తవం. ఈ యాభై రోజుల్లోనూ 35 వేల కోట్ల రూపాయల వరకూ నష్టపోయి ఉండవచ్చు. ప్రజారోగ్యం కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయము, 40 కోట్ల మంది ఉపాధి పణంగా పెట్టిన స్థితిలో మద్యం ఆదాయం పెద్ద లెక్క కాదు. అవసరమైతే కేంద్రం ఈ సొమ్మును కాంపన్సేట్ చేసేందుకు ప్రయత్నించాల్సింది. కానీ తప్పు చేసింది. లాకు లెత్తేసింది. ప్రజలు, మహిళలు, ఆరోగ్య నిపుణులు, ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో రాష్ట్రాలు సున్నితంగా తప్పుకుంటున్నాయి. నేరం మాది కాదు, కేంద్రానిదే అంటూ తప్పు మొత్తం దానిమీదకే రుద్దేస్తున్నాయి. నిజానికి మద్యం అమ్మకాల వల్ల కేంద్రానికి కలిసొచ్చేదేమీ లేదు. మొత్తం ఆదాయమంతా రాష్ట్రాల ఖజానాకే చేరుతుంది. కానీ తనపై డబ్బుల కోసం రాష్ట్రాల నుంచి ఒత్తిడి తగ్గుతుందని భావించింది. సీన్ రివర్స్ అయ్యింది. పొలిటికల్ డామేజీ జరిగింది. ఈ అవకాశాన్నే ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు, కాంగ్రెసు వినియోగించుకోవాలని చూస్తున్నాయి.

ఆర్థిక కసరత్తు…

ప్రజల ఉపాధి, ఆర్థికాస్త్రంతో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కోవాలని కాంగ్రెసు పార్టీ చూస్తోంది. రాహుల్ గాంధీ ఆర్థిక వేత్తలతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. అంతర్జాతీయంగా కరోనా సమయంలో వివిధ దేశాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను చర్చ రూపంలో ఆర్థిక వేత్తలనుంచి సేకరిస్తున్నారు. మన ప్రభుత్వ వైఫల్యాన్ని వారి చేతనే చెప్పిస్తున్నారు. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. ప్రజాజీవనాన్ని సరిదిద్దడానికి అభివృద్ధి చెందిన దేశాలు నిధులు గుమ్మరిస్తున్నాయి. ప్రజల చేతిలోకి సొమ్ములు చేరుస్తున్నాయి. ఇక్కడ అటువంటి విధానం కనిపించడం లేదు. ఈ విషయాన్నే ప్రశ్నల రూపంలో రాహుల్ రాబడుతున్నారు. మరోవైపు మన్ మోహన్ సింగ్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ ఆర్థిక అంశాలపై అధ్యయనం చేస్తోంది. లాక్ డౌన్ తర్వాత ఏం చేస్తారో చెప్పమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సోనియా గాంధీ నిలదీస్తున్నారు. మొత్తమ్మీద దేశ ప్రజల జీవన స్థితిగతులతో ముడిపడిన అంశం కావడంతో కాంగ్రెసు కొంత పుంజుకునేందుకు నిజమైన ప్రతిపక్షంగా తన పాత్ర పోషించేందుకు ఇదొక అద్బుతమైన అవకాశంగానే చెప్పాలి.

స్వయంకృతాపరాధాలు…

నరేంద్రమోడీ మాటను ప్రతి సందర్భంలోనూ భారతదేశం విశ్వసించింది. నోట్ల రద్దు వంటి నిర్ణయాలు ప్రతికూల ఫలితాన్ని ఇచ్చినా నిస్వార్థంతోనే ప్రధాని ఆ నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రజలు నమ్మారు. నోట్ల రద్దుతో అవినీతికి అడ్డుకట్ట, నల్లధనం వెలికి తీత అంటూ చెప్పినప్పటికీ అవేమీ నిజంకాదని తేలిపోయింది. మోడీ కలలు నెరవేరలేదు. అయినప్పటికీ మరోసారి అధికారం ఇచ్చారు. దేశంలో లాక్ డౌన్ నోట్ల రద్దును మించిన తీవ్రమైన చర్య. ప్రజా జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వం నుంచి ప్రజలకు లభిస్తున్న ఆర్థిక సాయం అంతంతమాత్రమే. తమ జీవితాలను ఇంతగా కట్టడి చేసుకుంటున్నది దేశం కోసం, తమ కోసం అని ప్రజలు భావించారు. మద్యానికి అనుమతులు ఇవ్వడంతోనే ప్రభుత్వాల చిత్తశుద్ధి తేటతెల్లమైపోయింది. ఇప్పటికే పనులు లేక అల్లకల్లోలంగా ఉన్న కోట్ల కుటుంబాలలో మద్యం చిచ్చు పెట్టడం మొదలైంది. నిత్యావసరాలకు, పిల్లల అవసరాలకు దాచిన చిన్నాచితక మొత్తాలను భార్యలను బెదిరించి వ్యసనపరులు మద్యానికి తగలేస్తున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. కష్టపడే సమయంలో పదో పరకో ఇంట్లో ఇచ్చి మిగిలినది తాగేవారు. ఇప్పుడు పనులు లేవు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి మొత్తాలను తీసుకెళ్లి తాగేస్తున్నారు. ఈ పాపం ఎవరిది? ఈ నేరం ఎవరిది? అంటే సమాధానం దొరకదు. కేంద్రం కచ్చితంగా ఈ స్వయంకృతాపరాధానికి భారీగానే రాజకీయ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News