గుదిబండ కాబోతోందా..?

ప్రధాని నరేంద్రమోడీది ఒక విలక్షణ శైలి. ఎవరేమనుకున్నా లెక్క చేయని ధోరణి. ముఖ్యమంత్రిగా గుజరాత్ ను అదే విధంగా పరిపాలించారు. సక్సెస్ సాధించారు. ప్రధానిగా భారత్ నూ [more]

Update: 2021-06-07 16:30 GMT

ప్రధాని నరేంద్రమోడీది ఒక విలక్షణ శైలి. ఎవరేమనుకున్నా లెక్క చేయని ధోరణి. ముఖ్యమంత్రిగా గుజరాత్ ను అదే విధంగా పరిపాలించారు. సక్సెస్ సాధించారు. ప్రధానిగా భారత్ నూ అదే తరహా పాలనతో ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. తొలి అయిదేళ్ల కాలంలో అనుకున్నది సాధించారు. ప్రజలు మరోమారు పట్టం గట్టారు. పరిపాలన వైఫల్యాలు, తాము ఎదుర్కొన్న కష్టాలు అన్నిటినీ పక్కన పెట్టారు. ప్రధానిలో కనిపించిన నిజాయతీ, కుటుంబ వారసత్వం లేకపోవడంతో భవిష్యత్తులో తమకు మంచి జరుగుతుందని విశ్వసించారు. కష్టాలు తాత్కాలికమేనని సర్దుకుపోయారు. అయితే ఆ భ్రమలు తొలగిపోతున్నాయి. కళ్లెదుల కఠినమైన నిజాలు నివ్వెరపరుస్తున్నాయి. గత కాలంలో ప్రధానులెవరిలోనూ పెద్దగా కనిపించని ప్రాంతీయ తత్వం పై ప్రధాని పీఠంపైనే విమర్శల జడివాన కురుస్తోంది. ఆయన గుజరాత్ కు ముఖ్యమంత్రి కాదు, దేశానికి ప్రధాని. ఇంకా ఆ రాష్ట్రం పట్ల ప్రత్యేకాసక్తి చూపిస్తూ మిగిలిన రాష్ట్రాలకు అన్యాయం చేస్తే సహించేది లేదంటూ స్వరాలు పెరుగుతున్నాయి. సొంత రాష్ట్రంపై అభిమానం తప్పు కాదు. కానీ అధి పరిధులు దాట కూడదు. అన్ని రాష్ట్రాలకు కుటుంబ పెద్ద తరహాలోనే ప్రధాని వ్యవహరించాలి. తాజాగా లక్ష ద్వీప్ లో ప్రపుల్ పటేల్ అనే గుజరాతీ మాజీ రాజకీయవేత్త సృష్టిస్తున్న అలజడి పీఎం నరేంద్రమోడీపై విపక్షాల విమర్శలకు మరో అస్త్రాన్ని సమకూర్చి పెట్టింది.

ఇంకా రాష్ట్రమేనా..?

ఒక ఇంట్లో అమ్మానాన్న కూడా పిల్లలందరిపై సమానమైన ప్రేమాభిమానాలు కనబరచ లేరు. కొందరు ఫేవరెట్ కిడ్స్ ఉంటారు. వారి ప్రవర్తన , చెప్పిన మాట వినేతీరు, క్రమశిక్షణ కారణంగా కొందరు అభిమాన పాత్రులైన ప్రియమైన బిడ్డలు ఉంటుంటారు. అయినా సహజంగా తల్లిదండ్రులు సౌకర్యాలు, విద్య విషయాల్లో అందరికీ సమన్యాయం చేసేందుకే చూస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీలో అదే లోపిస్తుందనే విమర్శలు పెరిగిపోతున్నాయి. తన రాజకీయ జీవితానికి ఆలంబన, ఎదుగుదలకు మూలం గుజరాత్ రాష్ట్రమే. అందులో ఎటువంటి సందేహం లేదు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ వంటి నేతలను అందించిన రాష్టమది. నరేంద్రమోడీ సొంత రాష్ట్రంపై మక్కువ చూపడాన్ని పెద్దగా తప్పు పట్ట లేం. కానీ ప్రాంతీయ పార్టీల నేతల స్థాయిలో ప్రాధాన్యమివ్వడమే ఆరోపణలకు తావిస్తోంది. గతంలో లాలూ ప్రసాద్, మమత బెనర్జీ వంటి నాయకులు రైల్వేశాఖను నిర్వహించినప్పుడు తమ రాష్ట్రాలకు పెద్ద పీట వేసేవారు. విమర్శలు వచ్చినా లెక్క చేసేవారు కాదు. అవసరమైతే అప్పటి ప్రధానులను సైతం ధిక్కరించేవారు. వారికి అలా చెల్లుబాటయ్యింది. అదే తీరులో వారు అపప్రధలను కూడా మూటగట్టుకున్నారు. దేశానికి ఎక్కువ మంది ప్రధానులను అందించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. జనాభాలోనూ పెద్దది. అయినా గతంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రధానులెవరూ ఉత్తరప్రదేశ్ కు మాత్రమే ఎక్కువ చేస్తున్నారనే విమర్శలు తెచ్చుకోలేదు. నిజానికి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉత్తరప్రదేశ్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అంతా అక్కడి వారేనా..?

ప్రధాని నరేంద్రమోడీ అందర్నీ విశ్వసించరు. తన రాష్ట్రానికి చెందిన , తనతో కలిసి పనిచేసిన వారి పట్లనే ఆయనకు నమ్మకం మెండు. అందుకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జాతీయంగా కీలక పదవుల్లో గుజరాతీలకు పెద్ద పీట వేస్తూ వచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయంలోనూ వారి మాటే చెల్లుబాటవుతుంది. ఆర్థిక, రాజకీయ సలహాలు, సూచనలు అన్నిటా వారి మాటే వేదంగా ప్రధాని భావిస్తారనేది బీజేపీలోనూ కొందరు చేసే వాదన. అంతవరకూ ఫర్వాలేదు. కానీ సొంత రాష్ట్రానికి అధికంగా ప్రయోజనం కల్పించి ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేస్తే మాత్రం రాజకీయ నేతలు చూస్తూ ఊరుకోరు కదా. తాజాగా అదే జరుగుతోంది. కరోనా వంటి విపత్కర పరిస్తితుల్లో గుజరాత్ కు వాక్సిన్లు, సహాయం కేంద్రం నుంచి ఎక్కువగా లభించిందంటూ ప్రత్యర్థి రాజకీయ నేతలు ఆరోపణలు గుప్పించారు. అంతటితో అయిపోలేదు. ఇటీవలి తుపానుల్లోనూ ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ కు ఎక్కువ మొత్తం కేటాయించి అధికంగా దెబ్బతిన్న ఇతర రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపించారంటూ మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఈ విమర్శలకు బీజేపీ దీటుగా బదులివ్వలేకపోయింది. జాతీయ నాయకుడిగా ప్రాంతీయ పక్షపాతాలకు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. అయితే నరేంద్రమోడీపై పడుతున్న ముద్ర కచ్చితంగా రాజకీయంగా నష్టం తెచ్చి పెడుతుంది. ప్రత్యర్థి పార్టీల పోలరైజేషన్ కు , ఇతర రాష్ట్రాల్లో మోడీ వ్యతిరేకత ప్రబలేందుకు ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది.

లక్ష ద్వీప్ లక్ష్యం ఏమిటి?

అతి తక్కువ జనాభాతో ఆహ్లదకరమైన పర్యాటకానికి పేరెన్నిక గన్న ప్రాంతం లక్షద్వీప్. గుజరాత్ కు చెందిన రాజకీయ వేత్తను తెచ్చి పాలకునిగా నియమించేసింది కేంద్రం. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉండాల్సిన అధికారాలన్నిటినీ ఆయన క్రమేపీ ఆక్రమించేశారు. పర్యాటకానికి ప్రోత్సాహం పేరిట మద్యం ఏరులై పారేలా విధానం తెచ్చి పెట్టారు. మౌలిక వసతుల పేరిట స్తానికుల ఆస్తులను అడ్డగోలుగా ఆక్రమించుకునే విధానాలకూ తెర తీశారు. ఇవన్నీ ప్రజల్లో ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఈ దీవులతో సంబంధ బాంధవ్యాలు నెరిపే కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. అసెంబ్లీలో తీర్మానమే చేసింది. ఇప్పుడు తమిళనాడు సైతం దానికి జత కూడింది. మరోవైపు వందమందికి పైగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అడ్మినిస్ట్రేటర్ విధానాలను తప్పుపడుతూ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. గుజరాతీ పాలకుడిని వెంటనే వెనక్కి పిలిపించాలని రాజకీయ పార్టీలు రాష్ట్రపతిని కోరుతున్నాయి. చినికి చినికి గాలివానగా తయారైన లక్షద్వీప్ ఉదంతం మరోసారి ప్రధాని పక్షపాతాన్ని వెలికి తీస్తూ ప్రశ్నలు రేకెత్తి స్తోంది. రాజకీయవేత్తలను పాలకులుగా నియమించడం కంటే పరిపాలన అనుభవం ఉన్న రిటైర్డ్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తే బాగుండేదనేది కొందరి సూచన. అసలు గుజరాత్ నాయకులు తప్ప దేశంలో సమర్థులెవరూ లేరన్నట్లు కీలక బాధ్యతలు వారికి మాత్రమే ఎందుకు అప్పగించాలనేది రాజకీయంగా ఎదురవుతున్న సవాల్. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలా స్పందించి, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News