అసలు వ్యూహం అదేనా?

Update: 2018-07-15 16:30 GMT

రాజకీయావకాశాలను అందిపుచ్చుకోవడంలో మోడీ మొనగాడు. ప్రత్యర్థిపై సందర్బానుసారంగా అస్త్రాలను ప్రయోగించడంలో చంద్రబాబు దిట్ట. వీరిరువురి వ్యూహాలు ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేస్తాయంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికిగాను ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వివిధ పక్షాల మద్దతును కూడగట్టే యత్నాలు ప్రారంభించింది. వచ్చే వారం మొదలు కాబోతున్న పార్లమెంటు సమావేశాల్లో ఇదే హాట్ టాపిక్ కాబోతుంది. విపక్షాలను ఒకేతాటిపైకి తెచ్చే ఆయుధంగా ఈ అవిశ్వాసం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. కొంతకాలంగా మోడీ వ్యతిరేక రాజకీయాలకు కేంద్రంగా నిలవాలని చూస్తున్న చంద్రబాబునాయుడు ఈ విషయంలో ఎంతవరకూ విజయం సాధించగలరనే సందేహాలున్నాయి. అసలు చర్చకు వస్తుందా? స్పీకర్ సహకరిస్తారా? అంటే అనుమానమే. ఇతర పార్టీలు సానుకూలంగా స్పందిస్తే సభ స్తంభించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు ధోరణి ఎలా ఉండబోతోంది? సంఖ్యాపరంగా చూస్తే చిన్న పార్టీ అయిన తెలుగుదేశానికి ప్రాముఖ్యమిచ్చేందుకు ఇతర పార్టీలు అంగీకరిస్తాయా? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈసారి సెషన్ తమదే అన్నంత ధీమాలో ఉంది టీడీపీ. దీనిని ఒక రాజకీయ అవకాశంగా మలచుకోవడంపై దృష్టి పెడుతోంది బీజేపీ.

వైసీపీకి చాన్సు మిస్ ...

చంద్రబాబునాయుడు రాజకీయ చతురతతో ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చడం వల్ల తీవ్రంగా నష్టపోయింది వైసీపీ. బడ్జెట్ సెషన్ సందర్బంగా కేంద్రంపై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలని వైసీపీ ముందుగా నిర్ణయం తీసుకుంది. తొలిదశలో దీనిని తోసిపుచ్చిన టీడీపీ తర్వాత తన స్టాండ్ మార్చుకుంది. వైసీపీకి మద్దతు నిస్తానంది. దానివల్ల తమ పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని గ్రహించి మళ్లీ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. తామే సొంతంగా అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ముందుగా స్పందించిన వైసీపీని వెనక్కి నెట్టేశారు. అవిశ్వాసం ప్రవేశపెడుతోంది తామేనన్నంతగా టీడీపీ సీన్ మార్చేసింది. అప్పట్లో తొమ్మిది పార్టీలు మద్దతు పలికాయి. అందులో ఒక పార్టీగా వైసీపీ మిగిలిపోయింది. కేంద్రస్థానంలో టీడీపీ నిలిచింది. కాంగ్రెసు కూడా మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ చర్చకు రాకుండా బీజేపీ తగిన జాగ్రత్తలు తీసుకుంది. వైసీపీ ఎంపీలందరూ రాజీనామాలు చేసి ఇటీవలనే ఆమోదింప చేసుకున్నారు. అవిశ్వాసం ప్రవేశపెట్టి పార్లమెంటులో హల్చల్ చేసే అవకాశాన్ని వారు కోల్పోయారు. ఉప ఎన్నికలు వచ్చేదీ లేదు, పోయేదీ లేదు. లోక్ సభలో వాయిస్ వినిపించే అవకాశాన్ని వైసీపీ కోల్పోయింది. బీజేపీతో వ్యూహాత్మక అంగీకారంతోనే ఈ ఎంపీలు రాజీనామా చేశారని, తద్వారా లోపాయికారీగా బీజేపీకి లోక్సభలో సొంతంగా మెజార్టీ లభించే అవకాశాన్ని కల్పించారని టీడీపీ ఆరోపిస్తోంది.

బాబుకు బ్రహ్మాస్త్రం...

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ ను చంద్రబాబు పతాకస్థాయికి తీసుకెళ్లిపోయారు. రాజకీయ చదరంగంలో ఆయన వేసే ప్రతి అడుగూ ఎత్తుగడే. అవిశ్వాసాన్ని జాతీయ స్థాయిలో తన ప్రాబల్యానికి కొలబద్దగా వాడుకోవాలని చూస్తున్నారు. తీర్మానం ప్రవేశపెట్టడానికి అవసరమైన సభ్యుల మద్దతును ఇప్పటికే టీడీపీ కూడగట్టగలిగింది. పార్టీ ఎంపీలను కొన్ని బృందాలుగా విభజించి మిగిలిన పార్టీలతో సంప్రతింపులకు కేటాయించారు. మోడీకి వ్యతిరేకంగా ఇతర పక్షాలు గళమెత్తేలా చేయడమే వీరి బాధ్యత. అవిశ్వాసానికి అనుగుణంగా కనీసం 10 పార్టీల మద్దతు సమీకరించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఢిల్లీలో హడావిడి చేయడం ద్వారా నేషనల్ పాలిటిక్స్ లో తనకున్న ప్రాముఖ్యాన్ని ఏపీలో చాటిచెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. హస్తినలో సాగుతున్న రాజకీయ ప్రకంపనలు ఆంధ్రలో ప్రతిధ్వనిస్తే 2019 సార్వత్రిక ఎన్నికలకు ఉపకరిస్తాయనేది టీడీపీ భావన. ప్రధానిని నిర్ణయించేది చంద్రబాబు నాయుడే అని తెలుగుదేశం నాయకులు ప్రచారం మొదలు పెట్టారు. అవిశ్వాస తీర్మానం విషయంలో కదలిక తెచ్చి, విపక్షాలను కూడగట్టగలిగితే టీడీపీకి పొలిటికల్ మైలేజీ లభిస్తుంది. ఈ అంశాన్ని ఎన్నికల్లో విస్తృతంగా ఉపయోగించుకోవచ్చని నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు.

కమలానికి కావాల్సిందదే....

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉంది బీజేపీ. టీడీపీ ప్రవేశపెట్టే అవిశ్వాసం తమకు ఈ దిశలో ఏమైనా ఉపయోగపడుతుందేమోనని కమలనాథులు ఎదురు చూస్తున్నారు. పదికిపైగా పార్టీలు మద్దతు ఇస్తే గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. లోక్ సభ కార్యకలాపాలు సాగడం కష్టమే. అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపి చర్చిస్తే బీజేపీకి లాభదాయకంగా ఉంటుందని కొందరు సీనియర్లు పేర్కొంటున్నారు. తద్వారా ఈ నాలుగేళ్లలో బీజేపీ సాధించిన విజయాలను ప్రజల ముందు పెట్టే అవకాశం లభిస్తుందంటున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేంత బలం విపక్షాలకు ఎటూ లేదు. చర్చ తర్వాత ఓటింగుకు అంగీకరించినా వచ్చే ప్రమాదమేమీ లేదు. అయితే దీనిని సాకుగా చేసుకుంటూ విపక్షాలపై ధ్వజమెత్తవచ్చు. అవిశ్వాసానికి ప్రతిగా..ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామంటూ లోక్ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళితే సానుభూతి లభిస్తుందనే ఆలోచన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ వర్షాకాల సమావేశాలు దేశరాజకీయాలను మరింత వేడెక్కించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News