ఎవరు...ఏంటో...? తెలిసిపోయిందా?

Update: 2018-07-23 16:30 GMT

నరేంద్ర మోదీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినప్పటికీ తాజా రాజకీయ ముఖచిత్రం అవిష్కృతమైంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వివిధ ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అనుసరించే వ్యూహంపై ఒకింత స్పష్టత ఏర్పడింది. జాతీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం ప్రాంతీయ పార్టీలతో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని హడావిడి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు అది అసాధ్యమని ఈపాటికే స్పష్టంగా అర్థమై ఉంటుంది. కాంగ్రెస్ లేకుండా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడం అంత తేలిక కాదన్న సంగతి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కూడా స్పష్టంగా బోధపడింది. ఎన్డీఏ మిత్రపక్షాల్లో ఒక్క తెలుగుదేశం దూరమైనప్పటికీ మిగిలిన పార్టీలు సంతృప్తికరంగా లేవన్న విషయం బీజేపీ పెద్దలకు బోధపడింది. అదే విధంగా ఎంత అసంతృప్తి ఉన్నప్పటికీ బీజేపీ ను వీడిపోవడం కష్టమేనన్న సంగతి చిరకాల మిత్రపక్షం శివసేనకూ స్పష్టమైంది. మొత్తం మీద తనకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదిక పైకి వచ్చే పరిస్థితి లేదన్నది బీజేపీకి తెలిసిపోయింది. అదే సమయంలో ఎన్డీయే మిత్రపక్షాలు తనపట్ల సంతృప్తిగా లేవన్న విషయం కూడా తెలిసింది. మొత్తం మీద 2019 సార్వత్రిక ఎన్నికలకు వివిధ పార్టీలు అనుసరించే వైఖరి స్థూలంగా తెలిసిపోయింది.

ఏకమయ్యే పరిస్థితి లేదా?

ఇక బీజేపీ పరంగా చూస్తే ప్రాంతీయ పార్టీలను ఏకం కాకుండా చేయడంలో విజయవంతమైనట్లే. వాటి మధ్యగల ప్రాంతీయ తగవులను వాడుకుని ఒకరకంగా వాటి మధ్య చిచ్చు పెట్టింది. ఉదాహరణకు తెలుగురాష్ట్రాల పరంగా చూస్తే ఆగర్భ శత్రువులుగా మారిన కేసీఆర్, చంద్రబాబు ఇటీవల కాలంలో ఒకింత దగ్గరయ్యారు. వారిమధ్య గల ప్రాంతీయ గొడవలు ప్రాతిపదికగా వారిని చీల్చడంలో బీజేపీ విజయవంతమైంది. నిన్న మొన్నటి దాకా తృతీయ ఫ్రంట్ అంటూ హడావిడి చేసిన కేసీఆర్ ను ఓటింగ్ సమయంలో తటస్థంగా ఉంచడంలో బీజేపీ వ్యూహం ఫలించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు కలసి పనిచేసే అవకాశం లేదని తేలిపోయింది. దీనివల్ల ఇద్దరిలో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న సంగతిని పక్కన పెడితే ఖచ్చితంగా బీజేపీకే లాభమన్న విషయం బోధపడుతుంది.

విభేదాలను సద్వనియోగం చేసుకుని.....

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్యగల విభేదాలను కమలం పార్టీ సద్వినియోగం చేసుకుంది. 19 మంది సభ్యులున్న బిజూ జనతాదళ్ ఓటింగ్ సందర్భంగా వాకౌట్ చేయడం కమలం పార్టీకి మేలుకలిగించే పరిణామమే. టీడీపీ కోసం బీజేపీతో తగవు పెట్టుకోవడానికి బీజేడీ ఎంత మాత్రం సిద్ధంగా లేదు. సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ కన్నా బీజేపీ ప్రధాన శక్తిగా అవతరిస్తున్న బీజేపీతో వైరం మొదటికే మోసమన్నది బీజేడీ అంతరంగం. 18 మంది ఎంపీలున్న మహారాష్ట్రకు చెందిన శివసేన కూడా అవిశ్వాసాన్ని బహిష్కరించాలని నిర్ణయించడం కమలం పార్టీకి సానుకూల పరిణామమే. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వంలో భాగస్వామి అయిన శివసేన కమలాన్ని కాదనలేక, అవునని అనలేక సతమతమవుతోంది. మహారాష్ట్రంలో శివసేన, కమలం పార్టీల ఓటు బ్యాంకు ఒక్కటే. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే ఓటు బ్యాంకు చీలి అసలుకే మోసం వస్తుందన్నది శివసేన భయం. అలాచేస్తే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 18 స్థానాల్లో సగం కూడారావన్నది దాని అనుమానం. మిత్రపక్షాలైన కాంగ్రెస్, శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఉమ్మడిగా, తాను బీజేపీ విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి తాము నష్టపోతామన్నది శివసేన భయం. అందువల్లే ఎంత అసంతృప్తిగా ఉన్నా ఎన్డీఏ నుంచి బయటకు రావడానికి సందేహిస్తోంది.

అదే దాని భయం.....

37 మంది సభ్యులున్న అన్నాడీఎంకే మొదటి నుంచి కమలం వైపు మొగ్గు చూపుతోంది. అవిశ్వాసానికి దూరంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ చివరికి ఓటింగ్ లో పాల్గొంది. తాను కాదనకుంటే కమలం పార్టీ తన ప్రత్యర్థి డీఎంకేను కౌగిలించుకుంటుందన్న భయం దానికి ఉంది. గతంలో ప్రధాని మోదీ చెన్నై పర్యటన సందర్భంగా కరుణానిధిని పరామర్శించడం, ఢిల్లీలో తన ఇంట్లో ఉండమని కోరడం తెలిసిందే. అదే విధంగా 2జీ కుంభకోణంలో కనిమొళి, రాజాలను రక్షించారన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో ముందు జాగ్రత్తగా మోదీకి అండగా నిలిచింది. టీఆర్ఎస్, శివసేన, అన్నాడీఎంకే, బిజూ జనతాదళ్ పార్టీలు ఓటింగ్ లో పాల్గొనడమో, లేక తటస్థంగా ఉండటానికి వాటి కారణాలు వాటికి ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ కొంత బలహీనపడినప్పటికీ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అదేవిధంగా కాంగ్రెస్ కొంత పుంజుకున్నప్పటికీ అధికారాన్ని చేజిక్కించుకునేంత పరిస్థితి లేదు. అందువల్ల ప్రభుత్వ పరంగా రాష్ట్రాల్లో తమ అవసరాలు తీరడానికి, రాజకీయంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి పైన పేర్కొన్న పార్టీలు బీజేపీ వైపు మొగ్గు చూపాయి. ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల్లోని ప్రాంతీయ పార్టీలకు బీజేపీ శత్రువు కాదు. వాటి అవకాశాలను దెబ్బతీసే పరిస్థితిలో బీజేపీ లేదు. ఒక్క తమిళనాడు తప్ప ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధమ శత్రువు. ఇంతటి ముందుచూపుతోనే అవి కమలనాధులకు దగ్గరయ్యాయి. ఎన్నికల నాటికి ఎన్ని వ్యూహాలు మారతాయో? పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News