మోడీ మార్క్ చూపించేస్తారా?

Update: 2018-06-15 15:30 GMT

ఎన్నికల ఏడాదిలో చివరిసారిగా సమావేశమవుతున్న అత్యున్నత రాజకీయ కార్యనిర్వాహక వేదిక నితి అయోగ్ చెప్పే సందేశమేమిటి? ఇచ్చే సంకేతమేమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. పార్టీల వారీగా దీనిని ఎవరెలా వినియోగించుకుంటారనేది ఉత్కంఠభరితమే. సందర్బాన్ని తన చుట్టూ తిప్పుకునే నరేంద్రమోడి. సమయోచితంగా అవకాశాలను అందిపుచ్చుకునే చంద్రబాబు, కీలెరిగి తన మాట నెగ్గించుకునే కేసీఆర్ ఈ విడత వేదికను తమ రాజకీయ ప్రయోజనాల సాధనలో ఎంతమేరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్సఫర్మేషన్ ఆఫ్ ఇండియా(నితి) అయోగ్ పెద్ద లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. ప్రణాళిక సంఘం స్థానంలో మరిన్ని బాధ్యతలను గుదిగుచ్చి ఈ సంస్థకు రూపకల్పన చేశారు. ఇదే సందర్బంలో టీమ్ ఇండియా నినాదం ఇచ్చేశారు ప్రధాని నరేంద్ర మోడి. ముఖ్యమంత్రులతో దిగిన ఛాయాచిత్రాలు, ఆనాటి జోష్ చూస్తే భారత్ మరో కొత్త యుగంలో ప్రవేశించబోతోందన్న భావన కలిగింది. కానీ ఆ తర్వాత క్రమేపీ ఆ జోరు పోయింది. హుషారు వసివాడిపోయింది. కేంద్రం పెత్తనమే అన్నిటా కనిపించడంతో విపక్ష ముఖ్యమంత్రులు పెద్దగా ఆసక్తి చూపడం మానేశారు. దేశంలోని 29 రాష్ట్రాలకు గాను 21 రాష్ట్రాల్లో బీజేపీ,మిత్రపక్షాలు పాగా వేయడంతో మిగిలిన ముఖ్యమంత్రుల సంఖ్య నామమాత్రమైపోయింది. విస్తరించిన ఎన్డీఏ కూటమి సీఎంల చర్చావేదికగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రశంసలే తప్ప విమర్శలు, దిద్దుబాటు సూచనల వంటివి కొరవడ్డాయి. ఆశల వారధి నితి అయోగ్ భజనల సందడిగా రూపు దాల్చింది. అసలు లక్ష్యం గాడి తప్పింది. గతంలో ఉన్న ప్రణాళిక సంఘమే కాసింత గట్టిగా కసరత్తు చేస్తుండేదనే విమర్శలు మొదలయ్యాయి. ఇది ఎన్నికల ఏడాది. ఇకపై అంతా రాజకీయమే. ఇప్పటికే వాతావరణం వేడెక్కింది. విపక్షాలన్నీ మోడీని రాజకీయంగా ఆడుకోవాలని చూస్తున్నాయి. నితి అయోగ్ వేదికను కూడా ఇందుకు వినియోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్రాలకు ప్రాధాన్యం తగ్గడం వంటి వాటిపై ధ్వజమెత్తే సూచనలున్నాయి.

రిజర్వేషన్లు కీలకం...

నితి అయోగ్ లో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కీలకం కాబోతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ప్రధానిని నేరుగా కలిసి డిమాండ్ల చిట్టా అందించారు. అందులో సమాఖ్య పరిష్కరించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. రిజర్వేషన్ల కేటాయింపుల విషయం రాష్ట్రాలకు వదిలేయాలని ఆయన కోరుతున్నారు. తెలంగాణలో 12 శాతం వరకూ ఉన్న ముస్లిం లను దృష్టిలో పెట్టుకుని శాసనసభ ఆమోదించిన తీర్మానం కేంద్రం వద్ద పెండింగులో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సైతం కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని కోరుతూ శాసనసభ ఆమోదించిన తీర్మానం కూడా కేంద్రం వద్దనే ఉంది. ఈ రెండు అంశాలు ఆంధ్ర,తెలంగాణల్లో రాజకీయంగా ఓట్లు కురిపించే వరాలు. అధికారపార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో చేర్చిన అంశాలు. ఇంతవరకూ కేంద్రం వీటిపై పెద్దగా స్పందించలేదు. మిగిలిన సీఎంలను కూడా ఈ విషయంలో కలుపుకుని ఒత్తిడి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నితి అయోగ్ అజెండాను నిర్దేశించేది కేంద్రమే. అధికారిక చర్చనీయాంశాల్లో అది ఉండకపోవచ్చు. కానీ ముఖ్యమంత్రుల ప్రసంగాల్లో వాటిని లేవనెత్తితే ఎవరూ అభ్యంతర పెట్టలేరు. కనీసం ఒక డజను మంది ముఖ్యమంత్రులు దీనిపై దృష్టి పెడితే కేంద్రం కూడా ప్రధాన అజెండాలోకి తేవాల్సి రావచ్చు. కానీ అంత సంఖ్యలో విపక్షాలకు బలం లేదు. అదే ప్రధాన బలహీనత. దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు తమ స్థానిక అవసరాలను అనుసరించి రిజర్వేషన్ల అధికారాన్ని తమకు ఇస్తే బాగుంటుందని ఆంతరంగికంగా అభిప్రాయపడుతున్నారు. కానీ బీజేపీ పెద్దల ముందు చెప్పే సాహసం చేయడం లేదు. దాంతో కేంద్రం స్పందించాల్సిన అవసరం ఏర్పడటం లేదు. బీజేపీ ముఖ్యమంత్రుల సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండటంతో కేంద్రం మాటే నెగ్గుతోంది.

బాబు అజెండా...

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించి అనేక అంశాలు పెండింగులో ఉన్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్ సహా విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల పంపిణీ ఇంకా పూర్తికాలేదు. హైకోర్టు విభజన వంటి కీలకాంశాలపైనా ముందడుగు పడలేదు. పోలవరం, రైల్వేజోన్, ప్రత్యేక హోదా , రాజధాని నిర్మాణం వంటి చంద్రబాబు అజెండా ఎలానూ ఉంది. ఇప్పటి వాతావరణంలో రాజకీయంగా వివాదం లేవనెత్తాలంటే నితి అయోగ్ ను మించిన వేదిక లేదు. దీనిని ఏపీ సీఎం ఎలా వాడుకుంటారో చూడాలి. తన రాజకీయ చతురతను , రాష్ట్ర అవసరాలను , భవిష్యత్ ఎన్నికల అజెండాను ఇక్కడ రంగరించేందుకు ప్రయత్నిస్తారంటున్నారు. మీడియాలో చంద్రబాబు తాడోపేడో తేల్చుకుంటారన్న స్థాయి కథనాలు వండివార్చారు. కానీ అక్కడ 29 మందిలో ఏపీ సీఎం ఒకరు. 29 రాష్ట్రాల అంశాల్లో ఏపీ అంశాలు కూడా ఒకటి. అందువల్ల సమయం, సందర్బం అందుకు అనుకూలించవనే వాదనలూ ఉన్నాయి. ప్రసంగంలో పేర్కొనేందుకు మాత్రమే వీలుంటుంది తప్ప చర్చకు తావుండదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అంటే లెవనెత్తడమే తప్ప పరిష్కారం దొరకని ప్రశ్నలుగానే మిగులుతాయి. అయితే రాజకీయంగా చంద్రబాబుకు లాభించే సూచనలున్నాయి. ఒకవేళ రాష్ట్రం అంశాలపై గొంతెత్తి మీడియాలో వాటికి ప్రాధాన్యం తెచ్చుకోగలిగితే పొలిటికల్ మైలేజీ దొరుకుతుంది. వాటిని టీడీపీ ప్రచారం చేసుకునే వెసులుబాటు చిక్కుతుంది. ఏపీలో పుంజుకోవాలని చూస్తున్న బీజేపీకి సంకటపరిస్థితి ఏర్పడుతుంది.

కేసీఆర్ కు దండ...

మాటలు చెప్పడంలోనే కాదు, సందర్భానికి తగిన విధంగా పెద్దలను ప్రసన్నం చేసుకోవడంలోనూ కేసీఆర్ దిట్ట. నితి అయోగ్ సమావేశానికి ముందుగానే ప్రధానిని కలిశారు. తెలంగాణ అభివృద్ధి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతుబంధు, బీమా పథకాల ప్రాధాన్యం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. నితి అయోగ్ లో పరస్పర ప్రయోజనదాయక అంశాలపైనా నేతలు మనసు విప్పి మాట్లాడుకున్నారనేది టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ప్రధాని హృదయపూర్వకంగా కేసీఆర్ ను ప్రశంసించారని చెబుతున్నారు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలోని అంశం. పంటల ధరల నిర్ణయం , రుణాల పంపిణీ వంటివి కేంద్రప్రభుత్వం , బ్యాంకుల అధీనంలో ఉన్నాయి. వాటి విషయంలో కేంద్రం చూపే చొరవను, అదనపు మద్దతును ప్రధాని ప్రకటించవచ్చంటున్నారు. అదే సమయంలో తెలంగాణ చేపట్టిన తరహాలో రైతు బంధు వంటి పథకాలు రాష్ట్రాలు చేపట్టాలని ప్రధాని కోరే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే కేసీఆర్ కృషికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించినట్లే. దానిని రాజకీయంగా ఎలా మలచుకుంటారనేది వేచి చూడాలి. తెలంగాణలో బీజేపీకి మాత్రం కొంత ఇబ్బంది ఎదురవుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సి వచ్చే సందర్బంలో వేడి తగ్గిపోతుంది. అయితే మోడీ,షాలకు భవిష్యత్ వ్యూహాల్లో దక్షిణాదిన ఒక ఆపద్భందును నిలిపి ఉంచుతుంది. రాజకీయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ టీమ్ ఇండియా నినాదానికి నితి అయోగ్ దర్పణం పడితే దేశ సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పడుతుంది.

 

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News