వన్ నేషన్ – వన్ ఎలక్షన్ సాధిస్తా

అధికారంలోకి వచ్చిన పది వారాల్లోగానే కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా [more]

Update: 2019-08-15 03:17 GMT

అధికారంలోకి వచ్చిన పది వారాల్లోగానే కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. మోదీ ఎర్రకోటపై జెండా ఎగురవేయడం ఇది ఆరోసారి. దేశానికి మారే శక్తి ఉందని ప్రతి భారతీయుడు నమ్ముతున్నారన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచామన్నారు మోదీ. ట్రిపుల్ తలాక్ కారణంగా దశాబ్దాలుగా ముస్లిం మహిళలు ఎన్నో అవస్థలు పడ్డారన్నారు.

జమ్మూకాశ్మీర్ లో….

ఆర్టికల్ 370ని రద్దు చేసి సర్దార్ పటేల్ ఆశయాలు నెరవేర్చామని చెప్పారు. జమ్మూకాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛను కల్పించామని మోదీ చెప్పారు. జమ్మూకాశ్మీర్ ఇప్పుడు భారత్ లో అంతర్భాగమన్నారు. 35 ఎ రద్దు చేసి కాశ్మీరీలకు బహుమతినిచ్చామన్నారు. జమ్మూకాశ్మీర్ లోని అన్ని వర్గాల ప్రజలకు సమానహక్కులు దక్కాలన్నదే తమ ప్రభుత్వ థ్యేయమని మోదీ చెప్పారు.జమ్మూ కాశ్మీర్, లడఖ్ లో శాంతి స్థాపనే తమ లక్ష్యమని వివరించారు. అన్ని పార్టీలూ తమ నిర్ణయాన్ని సమర్థించాయని చెప్పారు. ఒక దేశం, ఒక రాజ్యాంగం అన్న పటేల్ కల నెరవేరిందన్నారు.

మెరుగైన భారత్ గా…..

వచ్చే ఐదేళ్లలో మెరుగైన భారత్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. 130 కోట్ల మంది భారతీయులు తనను ముందుండి నడుపుతున్నారన్నారు. తన భవిష్యత్తు గురించి దిగులు లేదని, దేశ భవిష్యత్తు తనకు ముఖ్యమని మోదీ చెప్పారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను కూడా అమలు చేస్తామని మోదీ చెప్పారు. దీనిపై దేశంలో విస్తృతంగా చర్చ జరగాలన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న చిత్తశుద్ధి విపక్షాల్లో లేదని మోదీ విమర్శించారు. గత ప్రభుత్వాలు పేదలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయన్నారు. దేశంలో ఇప్పటికీ ప్రజలకు తాగునీరు అందడం లేదని, దీనికోసం జల జీవన్ మిషన్ ను ఏర్పాటు చేశామని మోదీ తెలిపారు. దీనికి 3.5 లక్షల కోట్ల నిధులను కేటాయించామన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. స్వచ్ఛ్ భారత్ స్ఫూర్థితో మిషన్ వాటర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజకీయ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండకూడదన్నారు. ప్రజల ఆలోచన విధానం మారకుండా దేశం మారదన్నారు. తీవ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తుందని మోదీ చెప్పారు. మోదీ దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.వరదల్లో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు.

Tags:    

Similar News