మోదీ గెటప్ ఛేంజ్ వెనక కధ అదేనా?

కూటి కోసం కోటి విద్యలు… అన్నది పాత తెలుగు సామెత. ఇది ప్రతి వ్యక్తికి వర్తించే సామెత. ప్రతి ఒక్కరూ జీవన గమనంలో బతుకు పోరాటంలో భాగంగా [more]

Update: 2021-04-04 16:30 GMT

కూటి కోసం కోటి విద్యలు… అన్నది పాత తెలుగు సామెత. ఇది ప్రతి వ్యక్తికి వర్తించే సామెత. ప్రతి ఒక్కరూ జీవన గమనంలో బతుకు పోరాటంలో భాగంగా ఏదో ఒక పనిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక పని చేయడం తప్పనిసరన్నది ఈ సామెత సారాంశం. మరో కోణంలో చిన్న మార్పుతో రాజకీయ నాయకులకూ ఇది వర్తిస్తుంది. ఓట్ల కోసం వేయి విద్యలు … అన్నది తాజా పరిస్థితుల్లో రాజకీయ నాయకులకు వర్తించే సామెత. ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజకీయ నాయకులు ఈ విద్యను ప్రదర్శిస్తుంటారు. ఈ విషయంలో కొంతమంది నాటకీయతను ప్రదర్శిస్తారు. మరి కొంతమంది ఏకంగా ఆయా పాత్రల్లో జీవిస్తారు. ఇంకొంతమంది పరకాయ ప్రవేశం చేస్తారు.

ఠాగూర్ ను తలపిస్తూ…..

తాజాగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల్లో దాదాపు అన్ని పార్టీల నాయకులు ‘ఓట్ల కోసం వేయి విద్యలు’ అన్న సామెతను నిజం చేయడంలో పోటీలు పడుతున్నారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారని చెప్పక తప్పదు. ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళపై మోదీకి ఎలాంటి ఆశలు లేవు. పశ్చిమ బెంగాల్, అసోం లపై ఆయనకు కొద్దిపాటి ఆశ ఉంది. అందుకే అక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన కొంతకాలంగా గడ్డం పెంచుతున్నారు. ఈ ఆహార్యంతో ఆయన విఖ్యాత బెంగాలీ కవి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్ర నాధ్ ఠాగూర్ ను తలపిస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కాషాయ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. బెంగాలీలకు ప్రాంతీయ అభిమానం ఎక్కువ. తమకు తాము బుద్ధిజీవులమని (మేధావులు) వారు భావిస్తుంటారు. బెంగాల్ కు చెందిన ఠాగూర్ తో పాటు అమర్త్యసేన్, అభిజిత్ బెనర్జీ ఈ ప్రతిష్టాత్మక బహుమతులు గెలుచుకున్నారు.

గమోసాను మెడలో వేసుకుని…..

మొదటి నుంచీ నరేంద్ర మోదీ గడ్డంతోనే ఉంటారు. కానీ బెంగాలో ఎన్నికల కోసమే తెల్లటి గడ్డాన్ని పెంచారన్న అభిప్రాయం బెంగాల్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనిని తోసిపుచ్చడం కష్టమే. ఎన్నికలు జరుగుతున్న ఈశాన్య రాష్టమైన అసోం ఓటర్లను ఆకట్టుకునేందుకు నరేంద్ర మోదీ ఇదే రకమైన విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అస్సామీ పురుషులు దరించే సంప్రదాయ వస్త్రమైన ‘గమోసా’ ను మోదీ గత కొంతకాలంగా మెడలో వేసుకుంటున్నారు. ఇది దీర్ఘచతురస్రాకార వస్ర్తం. మూడు వైపులా ఎరుపు అంచులు, మధ్యలో తెల్లటి రంగు కలిగి ఉంటుంది. దీన్ని ధరించడాన్ని అస్సామీలు గౌరవంగా, గర్వంగా భావిస్తుంటారు. ఇటీవల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునే సమయంలోనూ మోదీ దీనిని ధరించడం గమనార్హం. ఈ సందర్భంగా అసోం వైద్య ఆరోగ్య, ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మ మోదీకి కతజతలు తెలిపారు. మోదీ ఇటీవల మహిళలు తయారుచేససిన ‘గమోసా’ను కొనుగోలు చేశారు. అయితే ఎన్నికల జిమ్మిక్ అని కొందరు విమర్శించారు.

మోదీ ఒక్కరే కాదు….

బిహార్ ఎన్నికల సమయంలోనూ అక్కడి రుచికరమైన వంట ‘లిట్టి చోఖా’ గురించి ఇలానే ప్రచారం చేశారని వారు గుర్తు చేశారు. ఈ విషయంలో ఇతర నాయకులూ ఏమీ వెనకబడి లేరు. కాంగ్రెస్ అగ్రనేత రాజీవ్ గాంధీ ఇటీవల కేరళ పర్యటనకు వెళ్లి అనూహ్యంగా సముద్రంలోకి దూకి మత్స్యకారులతో కలిసి ఈదారు. నాస్తికత్వానికి నిఖార్సై న ప్రతినిధినని చెప్పుకునే డీఎంకే సైతం తన ఎన్నికల ప్రణాళికలో గుళ్లు, గోపురాల గురించి హామీలు ఇవ్వడం గమనార్హం. గతంలో ఏ రాష్రానికి ప్రచారానికి వెళితే అక్కడి ప్రాంతీయ భాషలో వందనాలు చెప్పే రాజకీయ నాయకులు తాజా విన్యాసాల ద్వార మరో ముందడగు వేశారనే చెప్పాలి. అయితే ఈ విన్యాసాలు ఎంతవరకు ఓట్లను కురిపిస్తాయన్నది ప్రశ్నార్థకమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News