మోడీ ఆ మూడు మీద…?

మోడీ ఇపుడు ఏపీలో రాజకీయానికి ముడి సరుకు అయిపోతున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మోడీని ఏపీ జనాలకు విలన్ గా పరిచయం చేసిన టీడీపీకి ఇపుడు [more]

Update: 2019-12-31 14:30 GMT

మోడీ ఇపుడు ఏపీలో రాజకీయానికి ముడి సరుకు అయిపోతున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మోడీని ఏపీ జనాలకు విలన్ గా పరిచయం చేసిన టీడీపీకి ఇపుడు మోడీ పెద్ద దేవుడిగా కనిపిస్తున్నారు. మోడీ బొమ్మలు పెట్టుకుని ఓ వైపు రాజధాని రైతులు దీక్షలు చేస్తూంటే మోడీకి చెప్పి జగన్ ని అడ్డుకుంటామని తమ్ముళ్ళు ఎక్కడికక్కడ బెదిరించేస్తున్నారు. చంద్రబాబు అయితే మోడీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి అంటూ కీర్తిస్తున్నారు. నిన్నటి వరకూ ఇదే బాబు మోడీ అమరావతికి ఏమిచ్చారు. మట్టి, నీళ్ళు తప్ప అంటూ ఎకసెక్కం ఆడిన వారే.

మోడీ ఒప్పుకోరుట…

మరో వైపు అచ్చం టీడీపీ భాషలోనే మాట్లాడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం అమరావతి రాజధాని మోడీ ఎంపిక చేసిందన్నంతవరకూ పోయారు. అక్కడ నుంచి తరలిస్తే మోడీకి జవాబు చెప్పుకోవాల్సివస్తుందని జగన్ ని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. మోడీ రాజధానిగా అమరావతి ఉంటుందనే నమ్ముతున్నారట. ఇవన్నీ టీడీపీ, జనసేన చెబుతున్న కబుర్లు. ఇక ఏపీ బీజేపీ నేతల విషయం అయితే అలాగే ఉంది మరి. మోడీ మెచ్చిన అమరావతిని కదిలిస్తే ఊరుకోమని కన్నా లక్ష్మీనారాయణ అంటూంటే, అంగుళం కదిలించినా యుద్ధాలే అయిపోతాయని సుజనా చౌదరి వార్నింగులే ఇస్తున్నారు.

అవి మరచారా…?

నిజానికి ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసిందనేగా 2019 ఎన్నికల్లో జనం గుస్సా అయి నోటా కంటే తక్కువ ఓట్లు ఇచ్చారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం డిపాజిట్ కోల్పోయారు. ప్రత్యేక హోదా ఇప్పటికీ ఇవ్వలేదు. ప్యాకేజి ఊసు కూడా ఎవరికీ తెలియదు, విశాఖకు రైల్వే జోన్ ఇలా ఇచ్చేసి 150 ఏళ్ళ చరిత్ర ఉన్న వాల్తేర్ డివిజన్ని మరోవైపు లాగేశారు. రాజధానికి లక్ష కోట్లు నిధులు అని చంద్రబాబు లెక్కలు వేస్తే కేంద్రం నికరంగా ఇచ్చింది 1600 కోట్ల రూపాయలు. విభజన హామీలు తీర్చలేదు, ఉదారంగా సాయం అన్న మాట కూడా మరచిపోయారు. ఇపుడు మాత్రం జగన్ మీద విరుచుకుపడే రాజకీయ పక్షాలకు మోడీ ఒక్కసారిగా దేవుడైపోయారని అంటున్నారు.

రాజకీయమేనా…

రాష్ట్రం వద్దు, ప్రజల ప్రయోజనాలు అంతకంటే వద్దు, ఎలాగైనా మోడీతో కలసిపోయి ఏపీలో జగన్ సర్కార్ ని ఇరుకున పెట్టడమే ఇపుడు విపక్ష రాజకీయ పార్టీల అజెండాగా ఉంది. చంద్రబాబు అయితే రైతులతో కలసి మోడీ వద్దకు వెళ్ళాలనుకుంటున్నారు. ఆ విధంగా రాజకీయ బంధం వేసుకోవాలన్నది బాబు హిడెన్ అజెండా. మరో వైపు మోడీ గొప్పవారు అంటున్నారు పవన్. ఆయనదీ అదే రూట్. అంటే కేంద్రం పైసా సాయం ఏపీకి చేయకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపొయినా కేంద్రంలో అధికార వాటా కోరుకుంటూ ఏపీ సర్కార్ని కార్నర్ చేయాలన్న రాజకీయమే తప్ప నిఖార్సుగా ఏపీ అభివ్రుధ్ధి విషయంలో నిలిచే నాయకుడు ఎవరూ లేరన్నది వర్తమాన రాజకీయ చిత్రం మరో మారు నిరూపిస్తోంది.

Tags:    

Similar News