చిన్న మోడీ కూడ పొగిడారే…

ఓ వైపు బీజేపీ నేతలంతా జగన్ని ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. జగన్ కి అసలు పాలన తెలియదని కూడా ఆడిపోసుకుంటున్నారు. జగన్ కి ప్రజల [more]

Update: 2020-01-06 07:00 GMT

ఓ వైపు బీజేపీ నేతలంతా జగన్ని ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. జగన్ కి అసలు పాలన తెలియదని కూడా ఆడిపోసుకుంటున్నారు. జగన్ కి ప్రజల కష్టాలు తెలియవని, ఆయన ఎవరి మాటా వినరని తోచిన విధంగా హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. మరి కేంద్రంలో చూసుకుంటే జగన్ కి, బీజేపీ పెద్దలకు చెడిందన్న ప్రచారమూ జరుగుతోంది. జగన్ ఢిల్లీకి వెళ్ళినా కూడా ఎవరూ ఆయనకు కనీసం అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని కూడా టీడీపీ అనుకూల మీడియా తెగ‌ రాతలు రాస్తోంది. మోడీతో చెప్పి నీ సంగతి చూస్తామంటూ బీజేపీలో కొత్త పూజారి సుజనా చౌదరి వంటి వారు కూడా తరచూ జగన్ని బెదిరించడమూ అంతా చూస్తున్నారు.

కష్టం తెలిసిన వాడు :

మరి ఇవన్నీ ఇలా ఉంటే జగన్ పట్ల మోడీ వైఖరి ఎలా ఉందన్నది పక్కన పెడితే ఆయన తమ్ముడు ప్రహ్లాద్ మోడీ మాత్రం జగన్ని ప్రజల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి అంటున్నారు. జగన్ పేదల పక్షపాతి అని కూడా కీర్తిస్తున్నారు. ప్రహ్లాద్ మోడీ ఆంధ్రా పర్యటన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారాకా తిరుమలకు వచ్చారు. అక్కడ స్వామిని దర్శించుకున్న తరువాత తమ సొంత సామజికవర్గమైన దెవతిలకుల, గాండ్ల, తెలుకుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రహ్లాద్ మోడీ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాత్రమే తమ సామాజికవర్గం సమస్యలు తీర్చగల సమర్ధుడు అంటూ గట్టిగానే పొగిడారు. అంతే కాదు, తెలంగాణా, ఆంధ్రాల్లో ఉన్న తమ సామాజికవర్గం అంతా ఐక్యంగా ఉండాలని పిలుపు ఇచ్చారు.

ఎక్కడో ఉన్నా :

ఓ వైపు జగన్ మీద విపక్షాలు నిత్యం విరుచుకుపడుతూనే ఉంటాయి. ఆయన సీఎంగా రావడంతో ఏపీ ప్రతిష్ట మట్టికొట్టుకుపోయిందని, దేశంలో ఎక్కడ చూసినా ఏపీ గురించి చెడ్డగా చెప్పుకుంటున్నారని, రాష్ట్రం పరువు పోయిందని టీడీపీ తమ్ముళ్ళు వల్లెవేయడం తెలిసిందే. మరి అదే నిజం అనుకుంటే ఎక్కడో గుజరాత్ లో ఉన్న ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ కి జగన్ పాలన గురించి ఎలా తెలిసింది అన్నది కూడా చూడాలి. పైగా ఆయన రాజకీయ నాయకుడు కానే కాదు, మెరమెచ్చు కబుర్లు చెప్పి పబ్బం గడుపుకునే రొచ్చు రాజకీయాల్లో ఆయన అసలు లేరు. దీని బట్టి చూస్తే గుజరాత్ లో ఉన్నా కూడా ప్రహ్లాద్ మోడీ వంటి వారికి జగన్ సంక్షేమ పధకాల గురించి తెలిసిఉండాలి. ఆయన సుదీర్ఘ పాదయాత్రతో పాటు, బంపర్ మెజారిటీతో సాధించిన అధికారం, ఏడు నెలల్లో తీసుకున్న అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా ఆయన గమనించి ఉండాలి. లేకపోతే ఏ చుట్టరికం లేని జగన్ గురించి రెండు మంచి మాటలు ఆయన ఎందుకు చెప్పాలనుకుంటాడు.

మోడీ వైఖరి కూడా :

తమ్ముడు జగన్ని పొగిడారు, మరి ప్రధాని మోడీకి జగన్ మీద ఉన్న అభిప్రాయం ఏంటో అన్నది కూడా ఆసక్తికరమే. అయితే మోడీ జగన్ ఎపుడూ భేటీ అయినా వారి మధ్య మంచి ఆప్యాయత, అభిమానం కనిపిస్తాయని అంటారు. ఇక ఏపీకి సంబంధించి మోడీ కూడా జగన్ పాలనా తీరుని గమనిస్తున్నారని, అందుకే కేంద్రం కూడా పెద్దగా విమర్శల జోలికి పోవడమే లేదని అంటున్నారు. ఏపీ వంటి రాష్ట్రాలు ఇపుడు ఆర్ధిక సుడిగుండంలో ఉన్నాయి. ఖర్చు తగ్గించుకోవాలని అయిదేళ్ళ క్రితమే మోడీ నాటి సీఎంకి చెప్పేవారని అంటారు. ఇపుడు పొదుపు మంత్రం జపిస్తున్న జగన్ విషయంలో మోడీకి పెద్దగా తేడాలు ఎందుకుంటాయన్న ప్రశ్న కూడా వస్తోంది. అదే విధంగా ఏపీలో అమలవుతున్న సంక్షేమ పధకాలు, నిర్ణయాలు కూడా కేంద్రం వంక పెట్టలేనివేనని కూడా అంటున్నారు.

Tags:    

Similar News