మోడీ టైమింగ్ అదిరిపోయింది....!

Update: 2018-06-20 15:30 GMT

భారతీయ జనతాపార్టీ తన సంప్రదాయక ఆయుధాలను సిద్దం చేస్తోంది. యుద్ధానికి తయారవుతోంది. దేశ ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు పక్కనున్న పాకిస్తాన్, కుంపటిగా మారిన కశ్మీర్ ఉపయోగపడతాయి. జమ్ముకశ్మీర్లో మిణుకుమిణుకు మంటున్న పీడీపీ,బీజేపీ సంకీర్ణ సర్కారుకు ఆయువు చెల్లిపోయింది. భారతీయ జనతాపార్టీ బయటకు రావడం వింతేమీ కాదు. కానీ టైమింగ్ విషయంలోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది లోపు కాలవ్యవధిలో దేశ సార్వ త్రిక ఎన్నికలు రాబోతున్నాయి. డిసెంబరులో కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మోడీ గ్రాఫ్ పడిపోతోందని దేశంలోని అనేక సర్వే సంస్థలు కోడై కూస్తున్నాయి. ఈ మూడింటినీ లింక్ చేసుకుంటూ బీజేపీ ఏదో వ్యూహం పన్నుతోందనే సందేహాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గడ్, జమ్ము అండ్ కశ్మీర్ లకు ఇక ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. దీంతో పాటు లోక్ సభకూ కలిపేస్తే పొలిటికల్ ఈక్వేషన్లు ఏమైనా మార్పు చెందుతాయా? అన్న కోణంలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీనికి రకరకాల లాభనష్టాల ప్రాతిపదికలను చూపిస్తున్నారు.

జే అండ్ కేతో జయహో....

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదం, హింస పెచ్చరిల్లుతున్నాయి. విప్లవాత్మక ధోరణులు ప్రబలుతున్నాయి. పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయంటూ సర్కారు నుంచి బయటికి రావడానికి బీజేపీ ఒక సాకును చూపింది. కేంద్రంలో తమ ప్రభుత్వమే. సంకీర్ణంలో తామే. గవర్నర్ తమ పరిధిలోని వ్యక్తే. అటువంటప్పుడు ప్రజాప్రభుత్వాన్ని పక్కన పెట్టడం లో ని ఉద్దేశమేమిటన్నది ఎవరికీ అర్థం కాదు. మెహబూబా ముప్తీ మొండి ఘటమన్న విషయాన్ని ఎవరూ కాదనరు. కానీ ఆ పార్టీతో జత కట్టినప్పుడు ఆ మాత్రం విషయం తెలియదనుకోలేం. కేవలం నేషనల్ కాన్ఫరెన్సు, కాంగ్రెసు, పీడీపీ వంటి ప్రత్యర్థులు చేతులు కలపకుండా చూడటానికే బీజేపీ అవకాశవాద పొత్తు కట్టింది. కశ్మీర్ లోని అతివాద ముస్లిం వర్గాలకు పీడీపీ ప్రతినిధిగా గుర్తింపు తెచ్చుకుంది. స్వయం పాలన ఆ పార్టీ ప్రధాన డిమాండు. జమ్ములోని హిందూ జాతీయవాదానికి ప్రతినిధిగా బీజేపీ 25 సీట్లు గెలుచుకోగలిగింది. స్వయం ప్రతిపత్తి కావాలని పీడీపీ కోరుతుంటే అసలు ప్రత్యేకప్రతిపత్తినే రద్దు చేయాలనేది బీజేపీ డిమాండు. భిన్న సిద్ధాంతాలు, భిన్న ఆలోచనలు, విభిన్న కార్యాచరణ కలిగిన ఈరెండు పార్టీలు కలవడమే విచిత్రం. పక్కా అవకాశ వాదం. ఇప్పుడు విడిపోవడమూ రాజకీయమే. జేఅండ్ కే ఇష్యూను ఫోకస్ చేస్తూ దేశవ్యాప్తంగా ఎన్నికలకు వెళితే బీజేపీ దే విజయమనే వాదనలు వినవస్తున్నాయి.

బ్రేకప్ ..వేకప్ కాల్...

సర్కారు అధికారంలోకి వచ్చినప్పట్నుంచే సంఘర్షణాత్మక వాతావరణం కొనసాగుతోంది. నిరంతరం డిల్లీ జోక్యం చేసుకుంటూ పరిస్థితిని సర్దుబాటు చేస్తోంది. ప్రధాని సైతం మధ్యవర్తి పాత్ర పోషించిన సందర్భాలున్నాయి. కలవని కాపురంగానే ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. ఏడాదిలో ఎన్నికలు రానున్న తరుణంలో విడిపోవడానికి ఒక హేతువును ఆపాదిస్తున్నారు. జమ్ము కశ్మీర్ లో ఏర్పడే సున్నితమైన మతపరమైన వాతావరణం బీజేపీకి దేశవ్యాప్తంగా పోలరైజేషన్ కు ఉపకరిస్తుందనే అంచనాలున్నాయి. గతంలో పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జే అండ్ కే లో ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో సైన్యం తనవంతు బిజీగా ఉంది. కానీ అక్కడ స్థానికంగా ఉన్న యువత దేశంపై తిరుగుబాటు చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అంశమిది. ప్రజాప్రభుత్వం కూడా లేని పరిస్థితుల్లో దీనిని అదుపు చేయడం ఎలా సాధ్యమవుతుందో కేంద్రమే ఆలోచించుకోవాలి. బల ప్రయోగం ద్వారానే అన్నిటినీ సాధించగలమనే భావనతో ఉంటే కట్టు తప్పి పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వేర్పాటు వాదులకు ఇక్కడ బలమైన మద్దతు లభిస్తోంది. ఇంతవరకూ ప్రభుత్వాన్ని నడిపిన పీడీపీ కూడా ఇప్పుడు వారి చేతిలో మరో అస్త్రంగా మారుతుంది. నేషనల్ కాన్ఫరెన్సు, కాంగ్రెసు పార్టీలు చోద్యం చూడటానికే పరిమితమవుతాయి. ఇదంతా అక్కడ ఎన్నికల్లో పాల్గొంటున్న 30 శాతం లోపు ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. అదే జరిగితే భవిష్యత్తులో జేఅండ్ కే ఎన్నికలనేవి పరిహాసాస్పదంగా, ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేసే విధంగా మారిపోవచ్చు.

ముందస్తుకూ ముహూర్తం..?

డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పుడు ఎదురీదుతోంది. ఆ రాష్ట్రాల్లో తిరిగి కమలవికాసం గగనకుసుమం అని రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు తేల్చేస్తున్నారు. సర్వేలు సైతం అదే విషయాన్ని చాటి చెబుతున్నాయి. మార్చి, ఏప్రిల్ మాసాల్లో లోక్ సభ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. డిసెంబరులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లలో పరాభవం ఎదురైతే దాని ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడుతుంది. నరేంద్రమోడీ కరిష్మాను పెట్టుబడిగా పెట్టి ఆయా రాష్ట్రాలతో పాటే జాతీయ ఎన్నికలకు వెళితే కొంత సేఫ్ గేమ్ ఆడినట్లవుతుందని బీజేపీ అధిష్ఠానం యోచిస్తోందంటున్నారు. మోడీ ప్రాభవం పూర్తిగా తగ్గని కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను సైతం ఆయన భుజస్కంధాలపైనే పెట్టేస్తే కొంతలో కొంత మేలనేది బీజేపీలోని మేధోవర్గం అంచనా. అందులోనూ జమ్ము కశ్మీర్ వంటి సెన్సిటివ్ ఇష్యూ రగులుతున్నప్పుడు బీజేపీ కి లాభిస్తుందనేది ఒక వాదన. అదే జరగాలంటే లోక్ సభ ఎన్నికలు ముందుకు జరపాలి. జేఅండ్ కే ఎలక్షన్లనూ దానికి ముడి వేయాలి. ఈ కోణంలోనే ప్రస్తుతం కమలం పార్టీలో చర్చలు జోరందుకుంటున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News