మోడీ స్కెచ్ మామూలుగా లేదు..!

Update: 2018-06-14 15:30 GMT

విభజించి పాలించు బ్రిటిషు వాళ్లు వంట పట్టించి పోయిన పాలక సూత్రం. మన నల్లదొరలు దానిని పక్కాగా అమలు చేస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభజన రేఖలు గీచి సంఘర్షణలు రేకెత్తించి అధికారాన్ని దక్కించుకుంటున్నారు. అదే ప్రధాన పరిపాలన సూత్రంగా మార్చుకుంటున్నారు. తాజాగా ప్రతిపక్షాల ఐక్యతతో ఇబ్బందుల్లో పడుతున్న బీజేపీ పాతపాచికను బయటికి తీస్తోంది. పార్టీలు, నాయకుల మధ్య విభేదాల వ్యూహాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. దేశంలోనే పెద్ద రాష్ట్రం, అత్యధిక సంఖ్యలో బీజేపీకి సీట్లు కట్టబెట్టిన యూపీ నుంచే ఈ ఎత్తుగడను అమలు చేసేందుకు పథక రచన చేస్తోంది. తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర వంటి వాటిపై దృష్టి పెడుతోంది. ఇప్పటికే ఏపీలో ఈ వ్యూహం అమలు ఫలితంగానే జనసేన టీడీపీకి దూరమైందని ప్రచారం సాగుతోంది. కాంగ్రెసుకు అండగా నిలవకుండా ఫ్రంటుగా ప్రతిపక్షాల చీలిక, పార్టీల వారీగా చీలిక వంటి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఏపీలో ఏం జరిగింది...?

నాలుగైదు నెలల క్రితం వరకూ జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య సుహృద్భావ సంబంధాలు బలంగా ఉండేవి. రాష్ట్రంలోని అనేక సమస్యలపై జనసేన ఆందోళన తెలిపిన ప్రతిసందర్బంలోనూ టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఉద్దానం, రాజధాని రైతులు, ఆక్వా వంటి విషయాలపై జనసేనాని సూచనలు పరిగణనలోకి తీసుకుంటున్నామంటూ బహిరంగంగానే ప్రకటనలు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి పవన్ వైఖరి మారింది. వైసీపీ,ఇతర పార్టీలకు తోడు పార్టీలోనూ అంతర్గతంగా వెల్లువెత్తుతున్న విమర్శల కారణంగా టీడీపీకి దూరం కావాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పవన్ కల్యాణ్ ను తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నించారు. పవన్ ససేమిరా అంటూ తెగేసి చెప్పేశాడు. దాంతో టీడీపీతో కలిసి నడవడం వల్ల జనసేన శాశ్వతంగా తోక పార్టీగానే మిగిలిపోవాల్సి వస్తుంది. పైపెచ్చు తెలుగుదేశం ప్రభుత్వం చేసే తప్పిదాలకు తాను కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని పవన్ కు సన్నిహితంగా ఉండే బీజేపీ నాయకులు చెవినిల్లు కట్టుకుని పోరు పెట్టారు. టీడీపీకి దూరమైతే మాత్రమే జనసేన ఒక పార్టీగా నిలదొక్కుకోగలుగుతుందని నూరిపోశారు. వాస్తవాన్ని గుర్తించిన పవన్ టీడీపీ ప్రభుత్వంపై, లోకేశ్ పై ఆరోపణలను బయటికి తీసి తాను దూరమయ్యారు. ఈ రకంగా బలమైన కాంబినేషన్ తో కూడిన రెండు పార్టీలు దూరం కావడానికి బీజేపీ నాయకులు తెరవెనక చాలా ప్రయత్నాలు చేశారు.

ఉచ్చులో...యూపీ నేతలు

ఉత్తరప్రదేశ్ పేరు చెబితే కమలనాథులు ఉలికులికి పడుతున్నారు. 71 స్థానాలు సొంతంగా, 2 స్థానాలు మిత్రపక్షంతో కలిపి 73 చోట్ల సాగిన విజయయాత్ర 2019లో 23 స్థానాలకే పరిమితమవుతుందన్న సమాచారం వారిలో భయాందోళనలు రేకెత్తిస్తోంది. సమాజ్ వాదీ, బహుజనసమాజ్ ల కలయిక వారిలో కంపరం కలిగిస్తోంది. ప్రతిపక్ష ఐక్యతకు బ్రాండ్ గా మారేందుకు ఎస్సీ నాయకుడు అఖిలేశ్ ప్రయత్నిస్తున్నారు. చంచల స్వభావం కలిగిన మాయావతిని సైతం రాజకీయ నైపుణ్యంతో మేనత్త వరస కలిపేసి దారిలో పెట్టేశారు. ఆ తర్వాత వరస విజయాలు మొదలయ్యాయి. ఈ క్రెడిట్ ఎక్కువగా అఖిలేశ్ ఖాతాలోనే పడిపోతోంది. మాయావతి ప్రాభవం మరుగునపడిపోతోందంటూ బీజేపీ నాయకులు ప్రచారం మొదలు పెట్టారు. ఈ ఐక్యతకు చిచ్చు పెట్టాలనేది వారి ఎత్తుగడ. ప్రభుత్వ బంగ్లాల విషయంలో మాజీ ముఖ్యమంత్రుల కోటా పై వివాదం చెలరేగింది. ఈ విషయంలో అఖిలేశ్ ను ఇరుకునపెడుతూ మాయావతిపై ఉదారత కనబరుస్తున్నారు. ఎస్పీకి వ్యతిరేకంగా మాయావతిని రెచ్చగొట్టడం, బీజేపీ పట్ల వ్యతిరేకతను మార్చుకునే దిశలో ఆమెను ఆకట్టుకోవడం అనే ద్విముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇగో సెంట్రిక్ లీడర్ గా పేరు పడిన మాయావతి ఈ ఉచ్చులో పడితే 2019లో తమ పంట పండినట్లే అనేది బీజేపీ నాయకుల భావన. ఎస్పీ, బీఎస్సీ విడిగా పోటీ చేస్తే చాలు తమ 73 స్థానాలకు ఢోకా ఉండదని కమలనాథులు అంచనా వేసుకుంటున్నారు.

కేసీఆర్ పాచిక?...

సెక్యులర్, ఫెడరల్ ఫ్రంట్ పేరిట హడావిడి చేసిన కేసీఆర్ గడచిన నాలుగు నెలలుగా ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతకాలం వాయిదా వేస్తూ వచ్చిన ప్రధాని కార్యాలయం తాజాగా అందుకు అంగీకరించింది. కేసీఆర్ ప్రారంభించిన రైతు బంధు, బీమా పథకాలపై ప్రధాని ప్రశంసలు కురిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ ను బీజేపీ శత్రువుగా చూడటం లేదు. సానుకూల ప్రత్యర్థిగా భావిస్తోంది. అందులోనూ మోడీకి, కేసీఆర్ కు మద్య మంచి పొలిటికల్ కెమిస్ట్రీ ఉంది. దీనిని రంగరించి కేసీఆర్ ను బుట్టలో వేసేందుకు సైతం మోడీ పావులు కదపవచ్చని అంచనా. టీఆర్ఎస్ తమతో చేతులు కలపకపోయినా విపక్షాల ఐక్యతను దెబ్బతీసేలా దేశవ్యాప్తంగా కొంత ప్రయత్నం చేసినా అది బీజేపీకి లాభిస్తుంది.ఇటువంటి విషయాలలో నేరుగా ఒప్పందాలు ఉండవు. కానీ జరుగుతున్న పరిణామాలే అందుకు దారి తీస్తుంటాయి. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ యత్నాలను సాధ్యమైనంతవరకూ చూసీ చూడనట్లు వదిలేస్తే చాలు బీజేపీ పని జరిగిపోతుంది. విపక్షాల కుమ్ములాటల్లో కమల వికాసం హ్యాపీగా జరిగిపోతుంది. అధికార రథం మరోసారి సాపీగా నడిచిపోతుంది. ఇదీ బీజేపీ నాయకుల వ్యూహం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News