మొండి మోడీకి శత్రువులెవరంటే...?

Update: 2018-06-11 15:30 GMT

నాలుగేళ్ల క్రితం నరేంద్రమోడీ హవా నడిచింది. ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. తమ ఆశల వారధిగా ఎంచుకున్నారు. అంతకుముందు మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా సింగిల్ పార్టీకి మెజార్టీ కట్టబెట్టారు. ఆయనలో భవిష్యత్ దార్శనికుని చూశారు. ప్రతిపక్షాలన్నీ కకావికలమైపోయాయి. ఈ నాలుగేళ్లలో మూడింట రెండు వంతుల రాష్ట్రాల్లోనూ కమలం వికసించింది. ఇదంతా తమ ఘనతేనని బీజేపీ, మోడీ భావిస్తే శుద్ధతప్పు. ప్రజలు మార్పు కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిణామం వికటించింది. బీజేపీ అంతర్గత సర్వేల పేరిట సాగుతున్న ప్రచారం అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 282 స్థానాలు తెచ్చుకున్న బీజేపీ 152 స్థానాల్లో పట్టు కోల్పోయిందన్న సమాచారం చిన్నవిషయం కాదు. అవినీతి పెచ్చరిల్లింది లేదు. పెద్ద కుంభకోణం బయటపడలేదు. అయినా ఎందుకిలా ఇమేజ్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. కారణాలేమిటన్న దానిపై సీరియస్ గా బీజేపీలో అంతర్మథనం సాగుతోంది.

సర్వే సాధికారమేనా..?..

దైనిక్ భాస్కర్ సంపాదించిన వివరాలు ఎనిమిది నెలల క్రితం నాటివి. అప్పటికి ఇంకా బీజేపీ బలంగానే ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో అసలు వాస్తవిక పరిస్థితులు తెలుసుకునేందుకు కమలం పార్టీ అంతర్గతంగా అంచనా వేయించుకుంది. కానీ వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడింది. గుజరాత్ లో సర్వశక్తులూ ఒడ్డి గెలుపు సాధించింది. ఉత్తరప్రదేశ్, బీహార్ , మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటే సర్వే ఫలితాలు చక్కగా అతికినట్లు సరిపోతున్నాయి. ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పలితాలు కూడా బీజేపీ గత వైభవం నిలబడే అవకాశాలు లేని విషయాన్ని స్పష్టం చేశాయి. రాజస్థాన్, గుజరాత్ లు తమ రాష్ట్రాల్లోని మొత్తం సీట్లను బీజేపీకి కట్టబెట్టాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేలలో 90 శాతం విజయాలు కమలం పరమయ్యాయి. బీహార్ నూ చిన్నిచితక మిత్రపక్షాలతో కలిపి దున్నేసింది. హస్తినలో అధికారానికి బాటలు వేసిన ఈ అయిదు రాష్ట్రాల్లోనూ ఎదురుగాలి వీస్తోందనేందుకు సర్వేలే అవసరం లేదు. జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమైపోతుంది. యూపీలో ప్రస్తుతం 71 స్థానాలుండగా కేవలం 23 మాత్రమే గెలిచే అవకాశాలున్నాయి. రాజస్థాన్లో 25 కిగాను 12, మధ్యప్రదేశ్ లో 26కి గాను 10, బిహార్ లో 22కిగాను 10, మహారాష్ట్రలో ప్రస్తుతమున్న 23 కి బదులు 5 స్థానాలు మాత్రమే గెలవనున్నట్లు పార్టీ సర్వే వెల్లడించడం దిగ్భ్రాంతికరమే. పంజాబ్ లో అయితే ఇప్పుడున్న రెండు స్థానాల్లోనూ ఓటమేనట.

ప్రజలే ప్రత్యర్థులు ...

దేశంలో కాంగ్రెసు ఓటు బ్యాంకు, ఇతర ప్రతిపక్షాల ఓటు బ్యాంకు బలపడిన దాఖలాలు లేవు. అయినా బీజేపీ ఘోరపరాజయం చవిచూడబోతోందన్న ప్రచారం పుంజుకొంటోంది. మోడీ తీసుకున్న కొన్ని మొండి నిర్ణయాలు ప్రజలనే బీజేపీకి ప్రత్యర్థులుగా మార్చేశాయి. నల్లధనం పేరిట చేసిన నోట్ల రద్దు ఇందులో మొదటిది. మొత్తం దేశప్రజలందరినీ రోడ్ల మీద నిలుచోబెట్టారు. సాధించిన ప్రయోజనం శూన్యం. స్థిరాస్తులు, బినామీల రూపంలోనే నల్లధనం ఎక్కువగా ఉంటుంది. వ్యవస్థలో పారదర్శకత కల్పించాలి. ఆస్తులు, ఖరీదైన వ్యవహారాలు, వాహనాలను, బ్యాంకు అకౌంట్లు ఆధార్, పాన్ లతో అనుసంధానిస్తూ పోతే కొంతకాలానికి నల్ల ధనం కట్టడి సాగుతుంది. కనీసపరిజ్ణానం ఉన్నవారికెవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. రాత్రికి రాత్రి నల్లధనం మాయం కాదు. కానీ తప్పుడు సలహాతో మోడీ తన ఇమేజ్ నే పెట్టుబడిగా పెట్టి నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ప్రజల్లో తన కరిష్మా కరిగిపోయింది. పెట్రో ధరల వంటివాటిని తగ్గించే అపూర్వ అవకాశం తన చేతుల్లోకి వచ్చినా సెస్సుల రూపంలో ప్రజలను దోపిడీ చేశారు. కాంట్రాక్టులు, సహజవనరుల విక్రయాల విషయంలో జరిగే దోపిడీ ప్రజలకు కనిపించదు. కానీ తాము నిత్యం ఎదుర్కొనే కష్టాలు, తమపై నేరుగా పడే భారం వారికి అనుభవం అవుతుంది. ఇక్కడ నోట్ల రద్దు కష్టాలు ప్రజలు స్వయంగా చవిచూడాల్సి వచ్చింది. పెట్ర్రోధరల భారాన్ని వారే ఎదుర్కోవాల్సి వచ్చింది. తద్వారా ప్రజలతోనే మోడీ నేరుగా యుద్దం చేసినట్లయింది.

ప్రతిపక్షాల పలాయనమే...

బొగ్గు, 2జీ కుంభకోణాల ఫలితాన్ని కాంగ్రెసు నేతృత్వంలోని యూపీఏ చవిచూడాల్సి వచ్చింది. బీజేపీ, మోడీ ఆయా కుంభకోణాలను బాగా ఎక్స్ ప్లాయిట్ చేయగలిగారు. నిజానికి ఆయా సహజవనరుల దోపిడీ ప్రభావం ప్రజలకు వెంటనే తెలియదు. ఇవి గాలి జనార్దనరెడ్డి మైనింగ్ తవ్వకాల వంటివే. ప్రజలు పెద్దగా గుర్తించరు. తమకేమిటి? అన్నదే ప్రత్యక్షంగా ఆలోచిస్తారు. కానీ నేరుగా తమపై పడుతున్న భారాల విషయంలో ప్రజలు వెంటనే అప్రమత్తమవుతారు. ఆవేదన చెందుతారు.1980లో జనతా కిచిడీ ప్రభుత్వం కూలిపోవడానికి అంతర్గత కలహాలకు తోడు ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడం కూడా ఒక కారణమని చెబుతారు. అటువంటి అంశాలను సరిగ్గా పట్టుకుని పకడ్బందీ ఉద్యమాలు చేయగలిగితే అధికారపక్షాన్ని ప్రతిపక్షాలు అదుపు చేయగలుగుతాయి. కానీ దేశంలోని ప్రతిపక్షాల్లో ఐక్యత లోపించింది. కాంగ్రెసుతో కలిసి వెళ్లాలా? మూడో ఫ్రంట్ కట్టాలా? అన్న తర్జనభర్జన ఒకవైపు తమలో తమకే ప్రధాని పదవిపై అత్యాశ మరోవైపు వేధిస్తున్నాయి. ఇంతటి సందిగ్ధంలో ప్రతిపక్షాలున్నప్పటికీ ప్రధాని గ్రాఫ్ పడిపోతోందంటే అది ఆయన స్వయంక్రుతాపరాధమే. మిత్రులు దూరమైనా, ప్రతిపక్షాలను పట్టించుకోకపోయినా ఆయనకు, బీజేపీకి పెద్దగా నష్టం లేదు. కానీ ప్రజలనే దూరం చేసుకునే చర్యలు తీసుకోవడమే తాజా అంచనాలకు కారణం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News