మోదీని దెబ్బేసేది ఈ ముగ్గురే....!

Update: 2018-08-20 16:30 GMT

మరో మూడు నెలల్లో జరగనున్న మూడు ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ పార్టీల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మొత్తం మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకునేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తుండగా, అధికారాన్ని కైవసం చేసుకునేందుకు హస్తం పార్టీ ఎత్తుగడలు వేస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలకూ అగ్నిపరీక్షగా మారనున్నాయి. అన్ని చోట్లా జాతీయ పార్టీల మధ్య పోరు నెలకొనడం ఆసక్తికర పరిణామం. కొన్ని ప్రాంతాల్లో బీఎస్పీ స్థానికంగా ఓటు బ్యాంకు కలిగి ఉండటం తప్ప ప్రాంతీయ పార్టీలకు ఎంతమాత్రం పట్టులేదు. మూడు రాష్ట్రాల్లో హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధిస్తుందన్న పోల్ సర్వేలు ఆ పార్టీల్లో ఉత్సాహాన్ని నింపుతుండగా కమలం పార్టీలో కలకలం రేపుతోంది. మూడు రాష్ట్రాలు కలిపి మొత్తం 520 అసెంబ్లీ స్థానాలు, 65 లోక్ సభ స్థానాలున్నాయి.

15 ఏళ్లుగా అధికారంలో.....

ముందుగా మధ్యప్రదేశ్ కు వస్తే దేశంలో పెద్ద రాష్ట్రమైన ఇక్కడ పదిహేనేళ్లుగా కమలం పార్టీ అధికారాన్ని అనుభవిస్తోంది. దశాబ్దానికిపైగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చక్రం తిప్పుతున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాలకు గాను 165 స్థానాలను తమ ఖాతాలో బీజేపీ వేసుకుంది. కాంగ్రెస్ కేవలం 58 స్థానాలతో సరిపెట్టుకుంది. కానీ ఈ సారి ఫలితాలు తారుమారవుతాయని ఎన్నికల సర్వేలు వెల్లడిస్తున్నాయి. 117 స్థానాలతో హస్తం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, 106 స్థానాలతో బీజేపీ ద్వితీయ స్థానంలో నిలుస్తుందని సీ ఓటర్, ఏబీపీ న్యూస్ ఎన్నికల సర్వేలు ఘోషిస్తున్నాయి. 28 వేల మంది ఓటర్ల మనోగతాలతో సర్వే నిర్వహించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ 29, హస్తం పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా ఫలితాలు తిరగబడతాయన్నది సర్వేల సారాంశం. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై వ్యక్తిగతంగా ఆరోపణలు లేనప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గుణ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా, పీసీసీ అధ్యక్షుడు, బింద్వారా ఎంపీ కమల్ నాథ్, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాష్ట్రంలో పార్టీ అగ్రనేతలు. ఈ ముగ్గురికీ ప్రజా బాహుళ్యంలో గట్టిపట్టుంది. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోలు,డీజిల్ ధరల పెంపు అంశాలు ఓటర్లపై ప్రభావాన్ని చూపనున్నాయి. బీజేపీకి సంబంధించి ముఖ్యమంత్రి చౌహాన్ తప్ప ధీటైన నాయకుడు లేరు. కాంగ్రెస్ కు 42, బీజేపీకి 40 శాతం ఓట్లు వస్తాయని ముందస్తు సర్వేలు చెబుతున్నాయి.

ఒకసారి గెలిస్తే.....

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మరో పెద్ద రాష్ట్రం రాజస్థాన్. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 25 లోక్ సభ స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుని విజయపతాకాన్ని ఎగురవేసింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాలకు బీజేపీ 163, కాంగ్రెస్ కు 21 స్థానాలను గెలుచుకున్నాయి. ఇటీవల జరిగిన ఆరు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు స్థానాలను కైవసం చేసుకుని ఉత్సాహంతో ఉంది. అదే విధంగా రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసింది. పీసీసీ చీఫ్ సచిన్ పైలెట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ పట్టుదలతో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి వసుంధర రాజే సింథియాపై సొంత పార్టీలో వ్యక్తమవుతోంది. అంతర్గత కలహాలు పార్టీని రోడ్డున పడేస్తున్నాయి. రాజస్థాన్ చరిత్రలో అధికార పార్టీ రెండోసారి గెలవకపోవడమన్నది సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి గెలుపుపై కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ముందస్తు సర్వేలు కూడా కాంగ్రెస్ ఆశలకు తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తం 200 స్థానాలకు గాను కాంగ్రెస్ 130 స్థానాలను, బీజేపీ 57 స్థానాలను సాధిస్తాయని సీ ఓటర్, ఏబీపీ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. హస్తం పార్టీ 51 శాతం, బీజేపీ 37 శాతం ఓట్లు సాధిస్తాయని సర్వే అంచనా వేసింది. సర్వే ఫలితాలు కాంగ్రెస్ కు కనువిందు చేస్తుండగా కమలనాధులకు కన్నీరు తెప్పిస్తున్నాయి.

తిరగబడుతుందా?

ఎన్నికలు జరగనున్న మరోరాష్ట్రం ఛత్తీస్ ఘడ్ లో కూడా కాంగ్రెస్ కు సానుకూల పరిస్థితులున్నాయి. మొత్తం 90 స్థానాలకు గాను కాంగ్రెస్ 51 స్థానాలతో అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని సర్వే సూచిస్తోంది. కమలం పార్టీ కేవలం 33 స్థానాలకే పరిమితం అవుతుందని కూడా సర్వే పేర్కొంది. 2013 ఎన్నికల్లో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన 55 స్థానాలను సాధించింది. విపక్ష కాంగ్రెస్ 39 స్థానాలతో సరిపెట్టుకుంది. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క లోక్ సభ స్థానానికే పరిమితమయినప్పటికీ ఈసారి బాగా పుంజుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో పది స్థానాలను గెలుచుకున్న కమలం పార్టీ ఈ దఫా పరిస్థితి ఆశాజనకంగా లేదు. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పై పెద్దగా ఆరోపణలు లేనప్పటికీ సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం ఉంది. వరుసగా మూడు దఫాలుగా అధికారంలో ఉండటం, కేంద్రంలో మోదీ ప్రభావం మసకబారడం రాష్ట్ర స్థాయిలో రమణ్ సింగ్ తప్ప మరో నాయకుడు లేకపోవడం పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి. మొత్తం మీద మూడు రాష్ట్రాల ఫలితాల సర్వేలు హస్తం పార్టీలో భవిష్యత్ పై ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో కమలం పార్టీని కంగారు పుట్టిస్తున్నాయి. ఈ మూడు నెలల్లో ఓటర్ల అభిప్రాయాలు పెద్దగా మారే పరిస్థితి కనపడటం లేదు. ఇది కమలం పార్టీకి ఖచ్చితంగా మింగుడుపడని పరిణామం.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News