నమ్మ వచ్చా..నిజమేనా?

Update: 2018-08-19 15:30 GMT

కొన్ని మీడియా సంస్థలు ఇటీవల నిర్వహించిన సర్వేల్లో బీజేపీకి , మోడీకి ఆదరణ తగ్గిపోతోందని గణాంకాల సహా వెల్లడించాయి. ప్రతి ఏడాది జులై , జనవరి మాసాల్లో ఇండియాటుడే ఆయా వివరాలను వెల్లడిస్తూ వస్తోంది. తాజా వివరాలు కమలనాథులను గంగవెర్రులెత్తిస్తున్నాయి. కాంగ్రెసులో ఆశలు నింపుతున్నాయి. వీటిని పూర్తిగానమ్మవచ్చా? వీటికుండే క్రెడిబిలిటీ ఏమిటనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. సొమ్ములు పోసి తమకు అనుకూలమైన సర్వేలు చేయించుకుని వాటిని ప్రజల ముందు పెట్టి న్యూట్రల్ ఓటర్లను ఆకట్టుకునే ఎత్తుగడలు కూడా ఉంటాయి. అందుకనే మీడియా సంస్థలు , పరిశోధన సంస్థలు వెల్లడించే గణాంకాలు నానాటికీ పరపతి కోల్పోతున్నాయి. ప్రజల్ని మభ్యపుచ్చడానికి పార్టీలు చేయించుకుంటున్న సర్వేల కంటే మీడియాకు కొంత విశ్వసనీయత ఉంటుంది. ఎందుకంటే తనకు సంబంధించి పాఠకుల్లో పరపతి కోల్పోవడానికి ప్రధాన స్రవంతిలోని మీడియా ఇష్టపడదు. కానీ ఆర్థిక వనరుల లేమితో తాజాగా మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం పక్కదారి పడుతూ ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్న ఘట్టాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. అందుకనే ప్రజలు సర్వేలను సాపేక్షికంగా చూస్తున్నారే తప్ప సత్యమని నమ్మడం లేదు.

ఇందిర కు భరోసా ...

1977లో ఇందిరాగాంధీ ఘోరపరాజయం తర్వాత ఇక కాంగ్రెసు శకం ముగిసినట్లేనని అందరూ భావించారు. అంతకుముందు నీరాజనాలు అందుకున్న రాష్ట్రాల్లో సైతం అడుగు పెడితే పలకరించే నాయకులు కరవు అయ్యారు. ఈ స్థితిలో ఆమెను సొంతం చేసుకునేందుకు ఏ మీడియా సంస్థ ముందుకురాలేదు. అంతకుముందు మీడియాను నియంత్రించేందుకు ఇందిర ప్రభుత్వం అనుసరించిన విధానాలతో విసిగిపోయారు. అందువల్ల ఆమె శాశ్వతంగా పవర్ లోకి రాకూడదని మనసావాచాకర్మణా మీడియా యాజమాన్యాలు భావించాయి. జనతాప్రభుత్వం హయాంలో ఇందిర దేశవ్యాప్తంగా చేసే పర్యటనలకు సైతం పెద్దగా ప్రచారం లభించేది కాదు. కానీ ఇండియా టుడే ఒక్కటే ఆమె తిరిగి అధికారంలోకి రాబోతోందని ఊహించింది. ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ ఒక ఎన్నికల గణాంకకునిగా రూపుదాల్చింది అప్పుడే. తెలుగు బిడ్డ ఎస్.వెంకటనారాయణ ఆ పత్రికకు సంపాదకత్వం వహించేవారు. ఇండియా టుడే ఇందిర ప్రభంజనం రాబోతోందని కచ్చితంగా కనిపెట్టింది. అది ఆమెకు నైతిక స్థైర్యాన్నిచ్చింది. ఆ తర్వాత అంచనాలకు అనుగుణంగా ఇందిర తిరిగి పగ్గాలు చేపట్టగలిగారు. అయితే ఆతర్వాత అనేక సందర్బాల్లో ఇదే మీడియా సంస్థ తప్పులో కాలేసింది. కానీ విశ్వసనీయతలో కొంచెం పై మెట్టుపైనే నిలిచింది.

రఫేల్ రఫ్ ఆడిస్తుందా?

రఫెల్ విమానాల కొనుగోళ్ల డీల్ ను ఎన్నికల అస్త్రంగా మలచుకోవాలని కాంగ్రెసు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ ప్రతి సమావేశంలోనూ దానినే ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెసు రాష్ట్రకమిటీల అధ్యక్షులు, శాసనసభా పక్షం నాయకులతో తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ దీనిపైనే ఫోకస్ పెట్టారు. దాదాపు 41 వేల కోట్ల రూపాయల అధికమొత్తం చెల్లించి ఈ విమానాలు కొనుగోలు చేయడంలో ప్రధాని పాత్ర ఉందని అభియోగాలు మోపుతున్నారు.. 1980లలో బోఫోర్సు కుంభకోణం కాంగ్రెసును దెబ్బతీసింది. అదే విధంగా ప్రస్తుతం రఫేల్ డీల్ బీజేపీపై పనిచేస్తుందని నమ్ముతోంది. అయితే అప్పటికి, ఇప్పటికి జనరేషనల్ షిప్ట్ జరిగిపోయింది. అవినీతి, అక్రమాలపై ప్రజల్లో అప్పుడున్న ఆందోళన ప్రస్తుత తరంలో కనిపించడం లేదు. సబ్జెక్టు కూడా చాలా ఘాటైనది . అందువల్ల సులభంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కాంగ్రెసు సర్కిళ్లలోనే తప్ప ఇంకా సాధారణప్రజానీకంలో రఫేల్ గురించి చర్చిస్తున్న దాఖలాలు కనబడటం లేదు. అప్పట్లో బోఫోర్సు మాత్రం ప్రతి ఒక్కరి నోటిపైనా నానింది. ప్రధాన ప్రచారాస్త్రంగా కాంగ్రెసు అధినేత పెద్దగా ఉపయోగం లేని అంశాన్ని ఎన్నుకున్నాడనే వాదన సైతం వినిపిస్తోంది. పైపెచ్చు ప్రధాని మోడీని అవినీతి పరుడని దేశప్రజలు నమ్మడం లేదు.

కాంగ్రెసు కూటమి కడితే ...

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ తో కూడిన ఎన్డీఏ కూటమి బొటాబొటి మెజార్టీ సాధించగలుగుతుందని సర్వే లో తేలింది. అయితే బీజేపీ సొంతంగా విజయం సాధించలేదు. దాని బలం 224 కే పరిమితమవుతుందనేది మీడియా అంచనా. మిత్రపక్షాలపై ఆధారపడితే వాటి సంఖ్యతో కలిపి 280 పైచిలుకు సీట్లు వస్తాయని బేరీజు వేసింది. సమాజ్ వాదీ, బహుజనసమాజ్, త్రుణమూల్, తెలుగుదేశం వంటి పార్టీలతో కాంగ్రెసు పార్టీ జట్టుకడితే అధికారానికి అవసరమైన సంఖ్యకు చేరువ అవుతుంది. బీజేపీ రెండువందల లోపు సీట్లకు ఇతర మిత్రపక్షాలతో కలిపి 230 లోపునకు పరిమితమవుతుందని లెక్కలు కట్టింది. అప్పుడు కాంగ్రెసు కూటమి, బీజేపీ కూటముల మధ్య అంతరం కేవలం అయిదుసీట్లు మాత్రమే ఉంటుందనేది అంచనా. ఒకవేళ పొత్తు కట్టకపోతే ఇండివిడ్యుయల్ గా కాంగ్రెసు వంద సీట్ల దరిదాపునకు చేరుకుంటుంది. బీజేపీ రెండు వందల సీట్ల వరకూ సాధిస్తుందని లెక్క. కమలం పార్టీ ఎదురీదుతున్న దారుణమైన పరిస్థితుల్లో సైతం బీజేపీ బలంలో కాంగ్రెసుసగానికే పరిమితమవుతుందన్నమాట. అయితే ఆరునెలల క్రితం నిర్వహించిన ఇండియాటుడే సర్వేలో బీజేపీ బలం 309 వరకూ రావచ్చని అంచనా కట్టారు. ఇప్పుడు 224 కి పడిపోయింది. అంటే రోజులు గడిచే కొద్దీ బీజేపీ ప్రాబల్యం కోల్పోతున్నట్లు క్షేత్రస్థాయి వాస్తవాలు వెల్లడిస్తున్నాయి. మరో 30,40 సీట్లను ఆరునెలల కాలవ్యవధిలో బీజేపీ కోల్పోవడం ఖాయమని కాంగ్రెసు పార్టీ అనుకుంటున్నది. అందుకే బలమైన కూటమి దిశలో అడుగులు వేస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News