మత్తు దిగిందా....?

Update: 2018-06-12 16:30 GMT

అనుభవం అయితేగాని తత్వం బోధపడదు. ఇది పాత తెలుగు సామెత. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సామెత అధికార భారతీయ జనతాపార్టీకి అతికినట్లు సరిపోతుంది. ఉప ఎన్నికల్లో వరుస పరాజయాలతో తలబొప్పి కట్టిన కమలం పార్టీకి ఇప్పటికి తత్వం తెలిసిపోయింది. మత్తుదిగిపోయింది. అహంకారం, ఆత్మవిశ్వాసం, ధీమా స్థానంలో ఆందోళన మొదలయింది. దీంతో వెంటనే దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ప్రధాని మోదీ ‘‘ఆత్మ’’గా పేరుగాంచిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. దూరమైన మిత్రులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీలోని సీనియర్లను గౌరవించడం మొదలయింది. ప్రాంతాల వారీగా ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఆఖరుకు విభజిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పైనా దృష్టి సారించింది. ఇదంతా ఉప ఎన్నికల మహిమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.

మిత్రులతో సఖ్యతగా.....

పంజాబ్ లోని గురుదాస్ నగర్, యూపీలోని గొరఖ్ పూర్, ఫూల్ పూర్ సిట్టింగ్ లోక్ సభ స్థానాలను కోల్పోయినప్పుడు కూడా కమలం పార్టీ ఇంత కంగారు పడలేదు. కానీ గత నెలాఖరులో జరిగిన కైరానా లోక్ సభ ఉప ఎన్నికల ఫలితం కమలనాధులకు కలవరం కలిగించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికలకు వెళితే విజయం అంత తేలిక కాదన్న సంగతి స్పష్టమైంది. అందుకే పాత మిత్రులను పక్కన పెట్టి చోద్యం చూస్తున్న మోదీ, షా ద్వయం తమ వైఖరిని మార్చకుంది. బీజీపీకి ఆవిర్భావం నుంచి శివసేన, అకాళీదళ్ నమ్మకమైన నేస్తాలు. బాల్ ఠాక్రే బతికి ఉన్నప్పుడు శివసేన-బీజేపీ సంబంధాలు ఉచ్ఛ స్థితిలో ఉండేవి. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం, అనంతరం ఏడాది లోపే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యంతో బీజేపీ కళ్లు పైకి ఎక్కాయి. మిత్రపక్షమైన శివసేనను దూరం పెట్టడం ప్రారంభించింది. అటు మహారాష్ట్ర, ఇటు కేంద్ర సర్కార్ లో సేన భాగస్వామి. అయినప్పటికీ దానిని చిన్న చూపు చూడటం ప్రారంభించారు. ఇటీవల కాలంలో రెండు పార్టీల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.

అవమానాలు దిగమింగి.....

ఉపఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేని కలిసేందుకు ఆయన నివాసమైన మాతృశ్రీకి ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ను వెంటపెట్టుకుని వెళ్లారు. పాత మైత్రిని పునరుద్ధరించేందుకు చేతులు కలిపారు. అయినప్పటికీ ఆగ్రహంతో ఉన్న ఉద్ధవ్ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ను సమావేశానికి అనుమతించలేదు. అవమానాన్ని దిగమింగిన ఫడ్నవిస్ చేసేదేమీలేక బయటే ఉండిపోయారు. అమిత్ షా కూడా ఏమీ చేయలేకపోయారు. పంజాబ్ లో మిత్రపక్షమైన అకాళీదళ్ ను బుజ్జగించేందుకు షా పావులు కదిపారు. స్వయంగా ఛండీగఢ్ వెళ్లి పార్టీ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ను కలిసి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సిక్కు గురుద్వారాల్లో వాడే భోజన పదార్థాలపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసింది. ఇక ఉప ఎన్నికల్లో ఓటమితో బీహార్ లో నితీష్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఇదే రాష్ట్రానికి చెందిన రాష్ట్రీయ లోక్ సమతాపార్టీకి చెందిన కేంద్రమంత్రి ఉపేంద్ర కుశ్వాహ, కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తదితర నేతల మాటల్లో మార్పు వచ్చింది. అంతకు ముందు నమ్రతగా మాట్లాడే ఈ నేతలు ఇప్పుడు స్వరం పెంచుతున్నారు. సీట్ల పంపకం విషయంలో తమ మాటే చెల్లాలని పట్టుపడుతున్నారు. మొండికేస్తే అసలుకే మోసం వస్తుందన్న భయంతో వారిని బుజ్జగించేందుకు అధ్యక్షుడు అమిత్ షా పడరాని పాట్లు పడుతున్నారు.

యూపీలో చెరుకు రైతులకు....

కైరానా ఉప ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న కమలం పార్టీ యూపీపై దృష్టి పెట్టింది. పశ్చిమ యూపీలో విస్తరించిన కైరానా నియోజకవర్గం చెరుకు పంటకు ప్రసిద్ధి. రాజకీయంగా బలమైన, సంపన్న జాట్ వర్గానికి ఈ ప్రాంతంలో పట్టుంది. చెరకు విస్తారంగా పండిస్తారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ స్వస్థలం ఈ ప్రాంతం. తండ్రి వారసత్వాన్ని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్.ఎల్.డి) అధ్యక్షుడు అజిత్ సింగ్ కొనసాగిస్తున్నారు. మొన్నటి కైరానా ఉప ఎన్నికల్లో ఈ పార్టీ విజయం సాధించింది. దీంతో దిమ్మ తిరిగిన కేంద్రం ఈ ప్రాంతంలో విస్తరించిన చక్కెర పరిశ్రమ కోసం ఏకంగా ఏడు వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. 2014 ఎన్నికల్లో చెరుకు రైతులు గంపగుత్తగా బీజేపీకి ఓటేశారు. కొత్త ప్యాకేజీ ద్వారా చెరుకు రైతుల ఆగ్రహాన్ని చల్లార్చవచ్చన్నది అమిత్ షా ఆలోచన. ఇది ఎంతవరకూ ఫలితం ఇస్తుందో వేచి చూడాలి.

ఏపీలో పోలవరానికి.....

ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనందున కూటమి నుంచి వైదొలిగిన ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీకి ఉపశమనం కల్గించే చర్యలను చేపట్టింది కేంద్రం. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణానికి 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన రూ.1400 కోట్లను ఎట్టకేలకు విడుదల చేసింది. వాస్తవానికి ఈనిధులు మార్చి 31వ తేదీ లోపే విడుదల చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాలను సాకుగా చూపి నిధులు నిలిపేసింది. మరో రూ.766 కోట్ల బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. నిధుల విడుదల ద్వారా ఏపీ పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదన్న విషయం చాటుకోవడం కేంద్రం, కమలం పార్టీ లక్ష్యం. ఎన్నికల ఏడాదిలో ఈ నష్ట నివారణ చర్యలు ఎంతమేరకు ఉపకరిస్తాయన్నది ప్రశ్నార్థకమే. ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నాలు తప్ప, ప్యాకేజీలు ఫలితాలు ఇవ్వవన్న సంగతిని కమలనాధులు గుర్తించాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News