విర్రవీగితే…వాత తప్పదా?

యూపీఏ పదేళ్ల పాలనకు చరమగీతం పాడుతూ 2014 లో ఢిల్లీ దర్బార్ లో పాగా వేసిన నరేంద్ర మోదీ తిరుగులేని నాయకుడా? ఆయన నాయకత్వమే దేశానికి శరణ్యమా? [more]

Update: 2019-11-07 16:30 GMT

యూపీఏ పదేళ్ల పాలనకు చరమగీతం పాడుతూ 2014 లో ఢిల్లీ దర్బార్ లో పాగా వేసిన నరేంద్ర మోదీ తిరుగులేని నాయకుడా? ఆయన నాయకత్వమే దేశానికి శరణ్యమా? ప్రతిపక్షాలు ఆయన ధాటికి చిరురుటాకుల్లా వణికిపోతున్నాయా? అన్న ప్రశ్నలకు 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు అవుననే సమాధానం ఇచ్చాయి. కానీ నరేంద్ర మోదీ తిరుగులేని నాయకుడు ఏమీ కాదని, ఆయన నాయకత్వంపై ప్రజల్లో ఆశలు కొరవడుతున్నాయని, విదేశీ పర్యటనలు, శృతి మించిన జాతీయవాదం ప్రజలను సంతృప్తి పర్చలేవని క్రమక్రమంగా అర్థమవుతోంది. మాటల గారడీలు, గంభీర ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టలేవని, ప్రజల దైనందిన సమస్యల పరిష్కారం కోరుకుంటున్నారని, నేల విడిచి సాము చేసే నాయకులకు తామేంటో తెలియజేస్తారని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

దెబ్బతీసినట్లేనా….?

ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. లోక్ సభ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం సాధించిన నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏకు ఈ అసెంబ్లీ ఎన్నికలు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అధికార పార్టీ భారీ అంచనాలే వేసుకుంది. తాము అధికారం చేపట్టడమే తరువాయి అన్న ధోరణిలో మునిగిపోయింది. ఉనికి నిలబెట్టుకుంటే చాలన్న ధోరణిలో విపక్షాలున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అధికార మత్తులో ఉన్న కమలం పార్టీకి, నరేంద్ర మోదీకి కళ్లు తెరిపించాయి. విపక్షాలకు ఊపిరిపోశాయి. ముందు పెద్ద రాష్ట్రమైన మహరాష్ట్ర ఫలితాలను విశ్లేషిస్తే … కమలం పార్టీ, నరేంద్ర మోదీ నాయకత్వానికి పూర్తి మద్దతు ప్రజలు పలకలేదన్న విషయం స్పష్టమవుతుంది. అటుపార్టీ, ఇటు నరేంద్ర మోదీ ప్రజల విశ్వసనీయత కోల్పోతున్నారన్న విష‍ం సాధికారికంగా రుజువవుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ మొత్తం 288 స్థానాలకు గాను 122 సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. సంపూర్ణ మెజారిటీకి 22 సీట్ల దూరంలో ఆగిపోయింది. గత అయిదేళ్లలో నరేంద్ర మోదీ నాయకత్వ పటిమ, చేపట్టిన కార్యక్రమాలు, పథకాలతో తమకు తిరుగులేదన్న ధీమాను దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్ ప్రదర్శించింది. దీనికి తోడు ఈసారి మిత్రపక్షమైన శివసేనతో పొత్తుపెట్టుకుని పోరాడినందున విజయతీరాలను తేలిగ్గా చేరుకోవచ్చన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. దీనికి తోడు అయిదు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 48 లోక్ సభ స్థానాల్లో పొత్తులతో పోటీ చేసి బీజేపీ సొంతంగా 23 స్థానాలను సాధించింది. మహారాష్ట్రలో హిందువుల సంఖ్య ఎక్కువ. 370వ అధికరణంరద్దు, ట్రిపుల్ తలాక్ దర్దు నేపథ్యంలో ఓట్ల వర్షం కురుస్తుందని కమలనాధులు, నరేంద్ర మోదీ ఆశించారు. కానీ ప్రజల అంచనాలు భిన్నంగా ఉన్నాయన్న విషయాన్ని గమనించలేకపోయారు. శివసేనతో పాత్తు లేకుండా బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగితే ఫలితాలు మరింత దారుణంగా ఉండేవన్న వాదనను తోసిపుచ్చలేం.

ఓట్ల శాతాన్ని చూస్తే….

లోక్ సభ ఎన్నికల ఫలితాల పరంగా చూస్తే కమలం పార్టీ ఆరు లక్షల ఓట్లను, 2 శాతం ఓట్లను బీజేపీ కోల్పోయింది. శివసేన 12 లక్షల ఓట్లను, 3 శాతం ఓట్లను నష్టపోయింది. 2014లో కమలం పార్టీ 1.47 కోట్లు, 27.8 శాతం ఓట్లను పొందింది. తాజా ఎన్నికల్లో 1.41 కోట్ల ఓట్లు, 25.6 శాతం ఓట్లకు పరిమితం కావడం గమనార్హం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా 260 స్థానాలకు పోటీ చేసి 122 స్థానాలను, 31.15 శాతం ఓట్లను పొందింది. ఈ దఫా పొత్తులో భాగంగా 164 స్థానాల్లో పోటీ చేసి 105 కు పరిమితమైంది. 25.6 శాతం ఓట్లతోనే సరిపెట్టుకుంది. ఈ పరిణామాలన్నీ కొడిగడుతున్న కమలం పార్టీ ప్రభకు, నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ పరిణామాలు త్వరలో జరగనున్న జార్ఖండ్, వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందన్న ఆందోళనలో కమలం శ్రేణులున్నాయి.

చుక్కలు కన్పించాయి……

ఇక హర్యానా ఫలితాలు కూడా కమలం పార్టీకి, నరేంద్రమోదీకి చుక్కలు చూపించాయి. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 10 స్థానాలను గెలుచుకున్న బీజేపీ మంచి ఊపు మీద ఉంది. మొత్తం 90 స్థానాలకు గాను మిషన్ 75 నినాదంతో ముందుకు వెళ్లిన అమిత్ షా, నరేంద్ర మోదీ, మనోహర్ లాల్ ఖట్టర్ బృందానికి ఓటర్లు కషాయం మింగించారు. గత ఎన్నికల్లో 47 స్థానాలను సాధించిన పార్టీని ఈసారి అధికారానికి ఆరుసీట్ల దూరంలో ఉంచారు. కేవలం 40 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. లోక్ సభ ఎన్నికల్లో 58 శాతం ఓట్లు సాధించిన పార్టీ ఈసారి 36.5 శాతానికే పరమితమవ్వడం క్షీణిస్తున్న పార్టీ ప్రాభవానికి నిదర్శనం. కమలనాధులు ఊహల్లో విహరించకుండా నేలపై నడిస్తే మంచిదన్న సంకేతాలను ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేశాయి. ఓటర్లు అమాయకులు కాదని, వారు పాలకుల పనితీరును ఓ కంట కనిపెడతారని, విర్రవీగితే వాత పెడతారని నిక్కచ్చిగా నిరూపించాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News