జగన్ బయటపడ్డారు....బాబు ఏం చేస్తారో..?

Update: 2018-06-26 15:30 GMT

పార్లమెంటు సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. బడ్జెట్ సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత మరోసారి లోక్సభ,రాజ్యసభ వర్షాకాల సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. దేశఆర్థికానికి దిశానిర్దేశం చేసే బడ్జెట్ సెషన్ నే పక్కా పాలిటిక్స్ తో నింపేసిన రాజకీయపక్షాలు ఈసారి సమావేశాలను నిర్వహించనిస్తాయా? అన్న సందేహం వెన్నాడుతోంది. అనుమానం లేదు అవి మొక్కుబడి సమావేశాలే అంటున్నాయి విపక్షాలు. ఎనిమిది నెలల కాలవ్యవధిలో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి రాజకీయంగా సత్తా చాటుకునేందుకు ఇదో వేదికగా మారే సూచనలున్నాయి. సర్కారు కూడా ఎన్నికలకు సిద్దమయ్యే క్రమంలో అవసరమైన అధికారిక సానుకూలతకు అవసరమైన చట్టాలను గట్టెక్కించేందుకు ఎత్తుగడ వేస్తుంది. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు సంబంధించి కొన్ని చట్టాలను ఆమోదించి తద్వారా ఓటు బ్యాంకును ఖాయం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుందని చెబుతున్నారు. జులై 18 నుంచి సాగే సమావేశాలు తెలుగు రాష్ట్రాలకు పొలిటికల్ గా చాలా కీలకమైనవిగానే చెప్పాల్సి ఉంటుంది. సమావేశాల్లో పార్టీలన్నీ భాగస్వామ్యం వహించడం ద్వారా తమ బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ సభ ఫుల్, బిజినెస్ నిల్ తంతుగానే ముగిసేందుకు అవకాశముందంటున్నారు.

మో‘ఢీ’కొడతారా...

బడ్జెట్ సెషన్ లో ఎనిమిది పార్టీలు మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాయి. స్పీకర్ సహకారంతో కనీసం చర్చకు రాకుండా దీనిని ప్రభుత్వం నిరోధించగలిగింది. 25 లక్షల కోట్ల రూపాయల వ్యయప్రణాళికతో కూడిన బడ్జెట్ ను ఎటువంటి చర్చ లేకుండా ఆమోదింపచేసుకున్నారు. ప్రభుత్వ ఉద్దేశం, అమలు చేసే తీరు ఏదైనా కావొచ్చు. కానీ తాము చేసే వ్యయనివేదికపై సలహాలు, సూచనలు , ప్రతిపక్షం వాదన తెలుసుకోవాల్సిన బాధ్యత సర్కారుకు ఉంటుంది. దానికి కూడా మంగళం పాడేశారు. బడ్జెట్ ను మమ అనిపించేశారు. అసలు ఈ ప్రభుత్వమే మాకొద్దు అంటూ విశ్వాసరాహిత్యం ప్రకటించే రాజకీయ నిర్ణయమూ ప్రతిపక్షాలు ప్రకటించాయి. మొత్తం వ్యవహారంలో ప్రధాని కనిపించకపోవడం విశేషం. ఆయన కనీసం పార్లమెంటులో ప్రసంగించి ఉంటే హుందాగా ఉండేది. కానీ తాను జవాబుదారీ కాదన్నట్లుగా వ్యవహరించారు. ఈసారి సమావేశాల్లో మరింత గందరగోళం సృష్టించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల ఎన్నికలు కూడా నవంబరు, డిసెంబరుల్లో రానున్న నేపథ్యంలో రాజకీయంగా విపక్షాలను ఢీకొట్టడానికి మోఢీ పార్లమెంటులో ప్రతిస్పందిస్తారా ? అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. పార్లమెంటు సమావేశాలు జరిగిన ప్రతిసందర్బంలోనూ ప్రభుత్వం డిఫెన్సులో పడుతూ వస్తోంది.

టీడీపీకి డైలమా...

బడ్జెట్ సెషన్ లో వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. తెలుగుదేశం పార్టీ ఈ తీర్మానం పై మద్దతిచ్చేందుకు అంగీకరించి చివరిక్షణంలో ఉపసంహరించుకుంది. రాజకీయంగా తాము నష్టపోతాం కాబట్టి స్వయంగా టీడీపీయే అవిశ్వాసానికి నోటీసులిచ్చింది. దీనివల్ల ప్రయోజనమే చేకూరింది. రాజకీయంగా వైసీపీ కంటే టీడీపీకి జాతీయంగా బలమైన బంధాలున్నాయి. ప్రతిపక్షాలు చాలావరకూ సహకరించాయి. ఎనిమిది పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. వర్షాకాల సమావేశాల్లో టీడీపీ అదే వ్యూహాన్ని అనుసరిస్తుందో లేదో వేచి చూడాలి. ఇప్పటికే వైసీపీ రాష్ట్రంలో టీడీపీపై ఎదురుదాడి ప్రారంభించింది. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చేశారు. టీడీపీకి సవాల్ విసురుతున్నారు. ఇది రాజకీయంగా కొంత సంకట స్థితే. తెలుగుదేశంపార్టీ మరోసారి మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ బడ్జెట్ సెషన్ వ్యూహాన్నే అమలు చేసి తీర్మానం చర్చకు, ఓటింగుకు రాకుండా జాగ్రత్త పడితే నిరసనగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు వ్యూహరచన చేస్తున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. దీనివల్ల రాజీనామాల విషయంలో వైసీపీ అదనపు రాజకీయ ప్రయోజనం పొందకుండా నిరోధించవచ్చనేది టీడీపీ భావన. అధికారపార్టీగా అంతిమ నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా వైసీపిని వెనకసీటులోకి నెట్టేసే అవకాశం ఉందంటున్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలో ఇదే ఎత్తుగడను టీడీపీ అనుసరించింది.

వైసీపీకి వెసులుబాటు ....

కేంద్రప్రభుత్వ పరంగా వైసీపీకి ఎటువంటి ఇబ్బందులు లేవు. తమ ఎంపీలు రాజీనామా చేసి వచ్చేయడంతో లోక్ సభకు హాజరుకావాల్సిన అవసరం లేదు. మోడీతో తగవు రాదు. గతంలో అవిశ్వాసతీర్మానం పేరిట తొలుత సందడి చేసిన పార్టీ వైసీపీయే. కానీ ఆశించిన స్థాయి ప్రచారం దక్కించుకోలేకపోయింది. అవిశ్వాసంతో సాధించిదేమీ ఉండదంటూ తొలుత కించపరిచింది టీడీపీ. తర్వాత వైఖరిని మార్చుకుని వ్యూహాత్మకంగా ఆ అస్త్రాన్ని తానే అందిపుచ్చుకుంది. ఇతర పార్టీలతో చంద్రబాబునాయుడికి, టీడీపీకి గతం నుంచీ ఉన్న మైత్రి కారణంగా వైసీపీ పొలిటికల్ టూల్ చేజారిపోయింది. ఇప్పుడటువంటి ప్రయత్నంతో అవసరం లేకుండా పోయింది. టీడీపీ పార్లమెంటులో సరైన రీతిలో పోరాటం చేయలేకపోతే దానిని క్షేత్రస్థాయిలో అడ్వాంటేజీగా మార్చుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది. రాజీనామాలు చేసిన ఎంపీలు తమ నియోజకవర్గాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. టీడీపీని ఎండగట్టేందుకే ఈ ప్రచార కార్యక్రమాన్ని ఉద్దేశించారు. ఎలాగూ ఈసారి పార్లమెంటు సమావేశాలు సాఫీగా జరిగే అవకాశాలు అంతంతమాత్రమే. పొలిటికల్ పోరాటంలో ఎవరు సక్సెస్ అవుతారన్నదే వేచి చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News