అడ్డం తిరిగిందే…?

శివసేన, భారతీయ జనతా పార్టీలు మిత్రపక్షాలు. అయితే వీటి మధ్య నారాయణ రాణే చిచ్చు రేపారా? అంటే అవుననే అంటున్నారు. నారాయణరాణే ఒకప్పుడు శివసేన నేత. బాల్ [more]

Update: 2019-09-03 17:30 GMT

శివసేన, భారతీయ జనతా పార్టీలు మిత్రపక్షాలు. అయితే వీటి మధ్య నారాయణ రాణే చిచ్చు రేపారా? అంటే అవుననే అంటున్నారు. నారాయణరాణే ఒకప్పుడు శివసేన నేత. బాల్ థాక్రే జీవించి ఉన్నప్పుడు నెంబరు 2గా శివసేనలో వ్యవహరించారు. దీంతోనే బాల్ థాక్రే నారాయణ రాణేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేశారు. తర్వాత నారాయణ రాణే బాల్ థాక్రే ను వ్యతిరేకించి 2005లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో…..

అయితే మళ్లీ మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నారాయణరాణే ను శివసేన నమ్మక ద్రోహిగా అభివర్ణిస్తుంది. తమ అధినేత బాల్ థాక్రేను వ్యతిరేకించిన నారాయణ రాణేను చేర్చుకుంటే ఊరుకునేది లేదని కూడా శివసేన హెచ్చరికలు జారీ చేయడం విశేషం. దీంతో భారతీయ జనతా పార్టీ వెనక్కు తగ్గాల్సి వచ్చింది.

పట్టున్న నేత కావడంతో…..

నారాయణరాణే గట్టి పట్టున్న నేత. ముఖ్యంగా కొంకణి ప్రాంతంలో బీజేపీకి పట్టున్న నేత లేరు. దీంతో నారాయణరాణేకు అక్కడ మంచి పట్టు ఉండటంతో ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. బలమైన నేతను చేర్చుకోవడం ద్వారా ఇటు శివసేనకు కూడా భవిష్యత్తులో చెక్ పెట్టవచ్చన్నది బీజేపీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. సీట్ల పంపకం విషయంలో శివసేన ఏదైనా కిరికిరి చేసినా తమకు ఇబ్బంది లేకుండా ఉండాలని నారాయణ రాణే లాంటి నేతలను చేర్చుకోవాలని భావించింది.

సేన అభ్యంతరంతో…..

అయితే శివసేన నుంచి నారాయణ రాణే విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఆయనను చేర్చుకోవడమంటే పాలల్లో ఉప్పును కలపడమేనని శివసేన సీనియర్ నేత దీపక్ కేసర్ కర్ వ్యాఖ్యానించడంతో బీజేపీ వెనక్కు తగ్గింది. నారాయణరాణే పార్టీని బీజేపీలో విలీనం చేసుకునే విషయంపై శివసేన తో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యలతో బీజేపీ వెనక్కు తగ్గినట్లే కన్పిస్తుంది. నారాయణరాణే కాంగ్రెస్ వైపు మళ్లీ చూడకుండా చేయాలనే ఈ ప్రతిపాదనకు తొలుత బీజేపీ అంగీకరించింది. మరి శివసేన అడ్డం తిరగడంతో పునరాలోచనలో పడింది.

Tags:    

Similar News