అలా చేస్తే ‘‘బాబు’’ ఎందుకవుతారు….?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎదుట రెండు అతిపెద్ద సవాళ్లున్నాయి. ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీని తిరిగి పవర్ లోకి రాకుండా చేయడం, మరొకటి తాను మరోసారి [more]

Update: 2019-01-06 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎదుట రెండు అతిపెద్ద సవాళ్లున్నాయి. ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీని తిరిగి పవర్ లోకి రాకుండా చేయడం, మరొకటి తాను మరోసారి అధికారంలోకి రావడం. ఈ రెండు లక్ష్యాలను సాధిస్తేనే రాజకీయ మనుగడ సాధ్యమవుతుంది. ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా తిరిగి ఇబ్బందులు తప్పవు. అందుకే చంద్రబాబు ఆచితూచి అడుగులేస్తారా? చెప్పినట్లే తాను చేస్తారా? అన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. సంక్రాంతి తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తానని చంద్రబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సాధ్యాసాధ్యాలను గురించి పార్టీ సీనియర్ నేతలు సయితం చర్చించుకుంటుండటం విశేషం.

ముందుగానే ప్రకటిస్తారా?

ఇదివరికటిలా అయితే చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభిస్తారు. నామినేషన్ తుది గడువు వరకూ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూనే ఉంటారు. అయితే ఈసారి తన పద్ధతిని మార్చుకుంటానని ఆయనే చెప్పారు. కాని ఇది సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. ఎమ్మెల్యేలపై వస్తున్న తీవ్ర వ్యతిరేకత ఆయనను కొంత వెనకడుగువేసేలా కన్పిస్తుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ముందుగానే 105 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు వెళ్లి సక్సెస్ అయ్యారు. తనను చూసి ఓటేస్తారన్న నమ్మకమే కేసీఆర్ చేత ఆ పని చేయించిందన్నది వాస్తవం.

పరిస్థితులు అలా లేవే…..

కానీ ఏపీలో ఆ పరిస్థితులు లేవు. బలమైన ప్రతిపక్షం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లోనే తృటిలో అధికారాన్ని కోల్పోయింది. మరోవైపు ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన అయితే వేరే చెప్పనవసరం లేదు. ఏ జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న లెక్కలు బాబు వద్ద ఉన్నాయి. వివిధ సర్వేల ద్వారా, పార్టీ ద్వారా తెప్పించుకున్న నివేదికలతో దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలను మార్చాల్సి ఉంటుందంటున్నారు. మరి చంద్రబాబు ఈ సాహసం చేయగలరా? ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నలభై మందిని రెబల్స్ గా మార్చుకుంటే జరిగే పరిణామాలేంటో? బాబుకు తెలియవా? అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం.

సాధ్యంకాదంటున్న సీనియర్లు…..

అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత, సామాజిక సమీకరరణ ఆధారంగానే బాబు అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. తొలిజాబితాలో నలభై నుంచి యాభై మంది వరకూ అభ్యర్థులను ప్రకటించి మిగిలిన వాటిని ఎన్నికల సమయానికి విడుదల చేస్తారన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. కొంత ముందుగా ప్రకటిస్తే జనంలోకి వెళతారన్న సీనియర్ నేతల వాదననూ చంద్రబాబు కొట్టిపారేసినట్లు తెలిసింది. ‘‘ఎన్నికలు వస్తేనే జనంలోకి వెళతారా? లేకుంటే వెళ్లరా..? జన్మభూమి కార్కక్రమాన్ని ప్రచారంగా మలుచుకోండి’ అని చంద్రబాబు స్పందించినట్లు తెలిసింది. దీన్ని బట్టి తొలి జాబితా కూడా సంక్రాంతి తర్వాత విడుదలయ్యే అవకాశం తక్కువగానే కన్పిస్తున్నాయన్నది పసుపు పార్టీ వర్గాల టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News