ఊరుకోను…ఉపేక్షించను…!!!

అమరావతి దాదాపు ఖాళీ అవుతుంది. మరో పదిరోజులు ఏ నేత కన్పించరు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నేతలను ఆదేశించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు, నియోజకవర్గ [more]

Update: 2019-01-03 08:00 GMT

అమరావతి దాదాపు ఖాళీ అవుతుంది. మరో పదిరోజులు ఏ నేత కన్పించరు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నేతలను ఆదేశించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు నియోజకవర్గాలను వదిలి రాకూడదని చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇక టిక్కెట్ల కోసం తనకు రావద్దని, అవసరమైతే పార్టీయే అమరావతికి రావాలని కబురు పంపుతుందని ఆయన అందరికీ చెప్పారు. జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఎన్నికలకు సమాయత్తం కావాలని, ఈ ఐదు నెలలు కీలకమని ఆయన నేతలకు ఉద్భోధించారు.

ఇక్కడికి వద్దు….

‘‘ఇప్పటి వరకూ ఎలా చేసినా ఊరుకున్నాను. ఇకపై ఉపేక్షించేది లేదు. అమరావతికి రావాల్సిన పనిలేదు. నియోజకవర్గంలోనే ఉండండి. ప్రతి ఎమ్మెల్యే, పార్టీ ఇన్ ఛార్జి రోజూ ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవాలి. ప్రజలతో మమేకం కావాలి. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించాలి. మరోసారి తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే జరిగే నష్టాన్ని కూడా ప్రజలకు వివరించాలి’’ అని చంద్రబాబు నేతలను కోరారు. టిక్కెట్ల విషయంలో చంద్రబాబు వివిధ విధానాలను పాటిస్తున్నారు. వివిధ సంస్థల ద్వారా సర్వేలు చేయించడమే కాకుండా కార్యకర్తల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారు.

అభ్యర్థుల ఎంపికలో….

జనవరిలోనే తొలి జాబితాను ప్రకటిస్తానన్న చంద్రబాబు అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేశారు. ప్రతి నియోజకవర్గాన్ని చంద్రబాబు కీలకంగా తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో అనేక అంశాలను పరిశీలిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎన్ని ఓట్ల తేడాతో గెలిచింది? ఓటమి పాలయితే ఎన్ని ఓట్ల తేడాతో ఓడింది? అప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు? సామాజిక సమీకరణాల్లో ఏమైనా మార్పులున్నాయా? కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి పట్ల ఏమనుకుంటున్నారు? ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంతవరకూ ఎమ్మెల్యే అమలుపర్చగలిగారు? తదితర అంశాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ప్రచారాన్ని ప్రారంభించాలని.

జనవరి ఆఖరు వారంనుంచే ప్రచారాన్ని టీడీపీ నేతలు షురూ చేయాలని చంద్రబాబు గట్టిగా నేతలకు క్లాస్ పీకినట్లు తెలిసింది. మంత్రులు కూడా అమరావతికి రావద్దని, అవసరమైనప్పుడు, అత్యవసర సమయాల్లో మాత్రమే రావాలని ఆయన ఆదేశించారు. అవసరమైన ఫైళ్లను తమ జిల్లాలకే తెప్పించుకోవాలన్నారు. చంద్రబాబునాయుడు దాదాపు ఐదు నెలలకు ముందునుంచే పార్టీని సమాయత్తం చేస్తున్నారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను దానిని ఎలా తగ్గించుకోవాలో కొన్ని సూచనలు పంపుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఎన్నికలకు పూర్తిగా ఇప్పటి నుంచే సమాయత్తమయ్యారు. జనవరిలో మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News