టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్‌ ?

గత ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నారా లోకేష్‌ కీలకమైన మంత్రి.రాజకీయ నాయకుల డిక్షనరీలో అర్ధాలు వేరుగా ఉంటాయి. యువ రక్తం అంటే కుమారుడు, మహిళా శక్తి [more]

Update: 2019-06-24 04:41 GMT

గత ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నారా లోకేష్‌ కీలకమైన మంత్రి.రాజకీయ నాయకుల డిక్షనరీలో అర్ధాలు వేరుగా ఉంటాయి. యువ రక్తం అంటే కుమారుడు, మహిళా శక్తి అంటే కూతురో కోడలో ఉంటారు. అలా కుటుంబ సభ్యులే అన్ని పదవులు ఎంచక్కా పంచుకుని ఆయా విభాగాలను అలంకరిస్తారన్నమట. అసలే కుటుంబ పార్టీగా పేరు తెచ్చుకున్న తెలుగుదేశంలో ఈ సదుపాయం మరింత ఎక్కువగా ఉంది. అన్న నందమూరి పార్టీ అధ్యక్షుడు అయితే చిన్నల్లుడు నారా చంద్రబాబు ప్రధాన కార్యదర్శి. పెద్దల్లుడు తెలుగు యువత అధ్యక్షుడు, మరి బాబు గారి చేతిలోకి పార్టీ స్టీరింగ్ వచ్చిన కొత్తల్లో బావమరిది హరిక్రిష్ణ కొన్నాళ్ళు తెలుగు యువత అధ్యక్షుడు అయ్యారు. ఆయన్ని పొగ పెట్టి పంపేశాక బాబు గారే తన మాట వినే మనుషులుతో ఆ పదవులు నింపుకున్నారు. ఇపుడు కొడుకు అందివచ్చాడు. అందువల్ల బాబు జాతీయ అధ్యక్షుడు అయితే కుమార రత్నం జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇలా సాగిన ఫ్యామిలీ పాలనకు దారుణమైన ఎన్నికల ఫలితం శుభం కార్డ్ వేసేంది. అయితేనేమి, ప్రభుత్వ పదవులు పొతే పోయాయి. పార్టీ పదవులు ఉండనే ఉన్నాయిగా.

కొడుకు కోసం కొత్త పదవి :

తెలుగుదేశం పార్టీ చరిత్రలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎపుడూ లేదు. కానీ ఎటూ కుమారుడే భావి వారసుడు అని బాబు అనుకుంటున్నారు కాబట్టి ఆ పదవిని స్రుష్టించి మరీ నారా లోకేష్‌ కి అప్పగిస్తారట. పార్టీ ఎందుకు పరాజయం పాలు అయిందని ఆరా తీస్తే యువత ఓట్లు బాగా తక్కువ పడ్డాయని తేలిందట. అందువల్ల యువత కోసం పార్టీ పగ్గాలు అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేసి మరీ తన కుమారుడిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలన్నది బాబు గారి ప్లాన్ గా కనిపిస్తోంది. మరో వైపు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అని వేరే పదవి కూడా ఉంది. ఆ పదవిలో శ్రీకాకుళం జిల్లా ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడిని కూర్చోబెడితే యూత్ పార్టీ అన్న ఫీలింగ్ వచ్చేస్తుందని బాబు గారు నమ్మకంగా ఉన్నారుట.

తమ్ముళ్ళు సమ్మతిస్తారా :

అసలు పార్టీ పరాజయానికి పెదబాబు, చినబాబు కారణమని తమ్ముళ్లంతా తీర్మానించేశారు. పెదబాబుని ఎటూ కదపలేరు కనుక చినబాబుని పార్టీ పదవులకు దూరం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు పార్టీకి గ్లామర్ కలిగిన ఫేస్ కావాలని కోరుతున్నారు. అది జూనియర్ ఎన్టీయార్ అవాలని కూడా డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు. మరి చంద్రబాబేమో నారా లోకేష్‌ కే పదవులు అంటున్నారు. ఏకంగా మంగళగిరిలో ఓడిపోయిన లోకెష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పేరిట ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నారు. మరి దీన్ని తమ్ముళ్ళు ఎంతవరకూ ఆమోదిస్తారన్నది పెద్ద డౌటే. ఆ పదవే జూనియర్ కి ఇస్తే బాగుంటుందని అంతా అంటున్నా మళ్ళీ నందమూరి చేతిలో పార్టీని పెట్టడానికి ఇష్టపడని చంద్రబాబు నారా లోకేష్‌ కే జై అనమంటున్నారు. తొందరలోనే లోకేష్ ప‌ట్టాభిషేకం ఉంటుందని కూడా సంకేతాలు ఇస్తున్నారు. మరి చూడాలి టీడీపీలో ఈ పరిణామాలతో మరే ముసలం పుడుతుందో

Tags:    

Similar News