అంతా లోకేష్ వల్లేనట …?

టిడిపి కాపు నేతలు ఇటీవల కూటమి పెట్టి కలవరం రేపారు. తమ భవిష్యత్తు కార్యాచరణ ఓటమికి దారితీసిన పరిస్థితులపై కాకినాడలో రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు [more]

Update: 2019-07-06 09:30 GMT

టిడిపి కాపు నేతలు ఇటీవల కూటమి పెట్టి కలవరం రేపారు. తమ భవిష్యత్తు కార్యాచరణ ఓటమికి దారితీసిన పరిస్థితులపై కాకినాడలో రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో ఈ కూటమి సాగింది. వీరంతా బిజెపి గూటికి చేరుతారనే ప్రచారం పసుపు దళంలో ఆందోళన నింపింది. ఆ సమావేశం తరువాత కూడా కొందరు కాపునేతలు హైదరాబాద్ లో రహస్య భేటీలు కొనసాగించారు. వీరి అసంతృప్తి తమ కొంప ముంచుతుందన్న ఆందోళనతో అధినేత చంద్రబాబు తనతో చర్చించాలని కాపునేతలను కోరడం వారు వెళ్ళి మూడు గంటలకు పైగా సుదీర్ఘ మంతనాలు సాగించడం చర్చనీయంగా మారింది. ఈ భేటీ తరువాత నెమ్మది నెమ్మదిగా అంతర్గత సమావేశ అంశాలు లీక్ అవుతూ రాజకీయ వర్గాల్లో మరో చర్చకు తెరలేపుతున్నాయి.

అక్కడి నుంచి సహాకారం లేదు ….

పేరుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలో వున్నా టిడిపి చక్రం మొత్తం ఆయన కుమారుడు నారా లోకేష్ తిప్పేవారన్నది అందరికి తెలిసిందే. లోకేష్ వ్యవరశైలి, తమకు ఎలాంటి సహకారం అందించకపోవడం తమ ఓటమికి ప్రధాన కారణంగా కాపు నేతలు అధినేత దృష్టికి తెచ్చారంటున్నారు. టికెట్ దక్కించుకోవడం దగ్గర నుంచి ఎన్నికల వరకు లోకేష్ ఆయన కార్యాలయం ఎలా వ్యవహరించింది పూస గుచ్చినట్లు నేతలు చెప్పడంతో బాబు షాక్ కి గురయ్యారంటున్నారు. ఈ విషయాలు ముందే తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆయన వారిని ప్రశ్నించారట. అయిందేదో అయ్యింది ఇక నుంచి నేరుగా తనతోనే అన్ని విషయాలు చర్చించాలని పూర్తిస్థాయిలో అందరికి అందుబాటులో ఉంటానని పార్టీకోసం ఐక్యంగా పనిచేయాలని బాబు వారిని సముదాయించడంతో కాపు నేతలు మెత్తబడినట్లు తెలుస్తుంది.

డబ్బుల అంశంలోనూ …

ఎన్నికల్లో అభ్యర్థులకు డబ్బు పంపిణీలో లోకేష్ ఒక్కోచోట ఒకోలా తీసుకున్న నిర్ణయాలను చెప్పినప్పుడు చంద్రబాబు ఆ విషయాలను ఖండించినట్లు చెబుతున్నారు. డబ్బు బాగా ఖర్చు పెట్టి ఘోరపరాజయాలు పొందిన అభ్యర్థుల లిస్ట్ బయటపెట్టి దాని కారణంగానే గెలవలేమని చెప్పినట్లు తెలుస్తుంది. నిత్యం ప్రజల్లో ఉండటం, పార్టీ క్యాడర్ తో ఉత్సహంగా పనిచేయించే నాయకత్వ లక్షణాలు కొనసాగించాలని బాబు క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలు వుంటాయని కూడా ఆయన విశ్లేషించారని తెలుస్తుంది.

ఫిరాయింపులు ప్రోత్సహించకుండా ఉండి ఉంటే ….

వైసిపిలో గెలిచిన వారిని టిడిపి లోకి రప్పించకుండా ఉండి ఉంటే ప్రజల్లో కొంత ఇమేజ్ పార్టీకి ఉండేదని జగ్గంపేట మాజీ ఎమ్యెల్యే జ్యోతుల నెహ్రు చంద్రబాబుతో అన్నారని అంటున్నారు. అయితే నెహ్రు వైసిపిలో గెలిచి టిడిపి లోకి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు, ఆర్ధిక ఇబ్బందులు కోసం వెళ్ళారన్నది విశ్లేషకుల అంచనా. ఆయనే ఇప్పుడు పార్టీ ఘోరఓటమితో పాటు తన నియోజకవర్గంలో పరాజయం నెహ్రూను పశ్చాత్తాపానికి గురిచేయడం గమనార్హం.

ముద్రగడ వ్యవహారంలో తప్పటడుగులు ….

కాపు రిజర్వేషన్ కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం వ్యవహారం డీల్ చేయడంలో బాబు సర్కార్ తప్పటడుగులు వేసిందని ఎక్కువమంది కాపు నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. సున్నితమైన ఈ అంశంలో ముద్రగడపై నిరవధిక నిర్బంధం ఆంక్షలు గోదావరి జిల్లాల్లో టిడిపి పట్ల కాపుల్లో ఒకరకమైన వ్యతిరేక భావనకు దారితీశాయని వారంతా జనసేన, వైసిపి వైపు మొగ్గు చూపడంతో తమ భవిష్యత్తు తలక్రిందులైనట్లు అభిప్రాయపడ్డారు అని టాక్.

జనసేన విషయంలో తప్పు చేసాం ….

ఇక పవన్ జనసేన విషయంలోనూ తప్పు చేశామని కాపు నేతలు అన్నారని తెలుస్తుంది. ఆ పార్టీ తో పొత్తుకు ప్రయత్నం చేసి ఉంటే మరీ ఇంత ఘోర పరాజయం వచ్చి ఉండేది కాదని టిడిపి, జనసేనలు గోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలిచి ఉండేవని చంద్రబాబు కు కాపు నేతలు నివేదించారు. తమ మనసులో వున్న అన్ని అంశాలను అధినేత ముందు కాపునేతలు కుండబద్ధలు కొట్టడంతో జరిగిన వాటి నుంచి బయటపడి బలమైన కాపు సామాజిక ఓటు బ్యాంక్ టిడిపి వైపు తిరిగి చూసేలా పటిష్ట కార్యాచరణ రూపొందించాలని బాబు వారిని కోరినట్లు చెబుతున్నారు. తామంతా పార్టీ మారే యోచన లేదని జరిగిన తప్పులు చర్చించుకునేందుకే సమావేశాలు పెట్టుకున్నట్లు చెప్పడంతో బాబు ఊపిరి పీల్చుకున్నారని వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చి పుత్రరత్నం పాత్రను కీలక అంశాల్లో పార్టీలో తగ్గిస్తా అని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Tags:    

Similar News