లోకేష్‌కు ఈ సారి మంగ‌ళ‌గిరి సేఫేనా ?

టీడీపీ భ‌విష్య ర‌థ‌సార‌ధి, మాజీ మంత్రి నారా లోకేష్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో అధికారం అనుభ‌వించారు. ఎమ్మెల్సీ అయిన మ‌రుస‌టి రోజే మంత్రి అయిన [more]

Update: 2021-02-08 05:00 GMT

టీడీపీ భ‌విష్య ర‌థ‌సార‌ధి, మాజీ మంత్రి నారా లోకేష్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో అధికారం అనుభ‌వించారు. ఎమ్మెల్సీ అయిన మ‌రుస‌టి రోజే మంత్రి అయిన లోకేష్ అధికారం అనుభ‌వించారే త‌ప్పా పార్టీని, ప్రభుత్వాన్ని ఎలా న‌డ‌పాల‌న్న అంశంపై దృష్టి పెట్టలేదు. చివ‌ర‌కు ఓ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకుని అక్కడ వ‌ర్క్ చేసే విష‌యంపై కూడా దృష్టి పెట్టలేదు. ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకున్న ముఖ్యమంత్రి త‌న‌యుడు.. పైగా మంత్రి అయ్యి ఉండి ఓ నియోజ‌క‌వ‌ర్గాన్ని కంచుకోట‌గా కూడా త‌యారు చేసుకోలేని దుస్థితి నారా లోకేష్ కు వ‌చ్చింది. మంగ‌ళ‌గిరి, పెన‌మ‌లూరు, భీమిలి ఇలా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు ప‌రిశీలించి… చివ‌ర‌కు రాజ‌ధాని ప్రభావం గ‌ట్టిగా ఉంటుంద‌ని అంచ‌నాలు వేసి మంగ‌ళ‌గిరిలోనే పోటీ చేశారు.

చాలా మంది సూచించినా…?

వాస్తవంగా మంగ‌ళ‌గిరి పార్టీకి అంత సేఫ్ కాదు. చివ‌రి సారిగా అక్కడ 1994లో మాత్రమే ఆ పార్టీ గెలిచింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా సైకిల్ తిర‌గ‌లేదు. పైగా సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా కూడా నారా లోకేష్ కు ఈ నియోజ‌క‌వ‌ర్గం సేఫ్ కాద‌ని చాలా మంది చెప్పినా.. కేవ‌లం రాజ‌ధాని ఆశ‌ల‌తోనే అక్కడ నారా లోకేష్ పోటీ చేసి గ‌ట్టి పోటీలో ఓడిపోయాడు. ఎన్నిక‌ల్లో ఓడినా ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ మంగ‌ళ‌గిరికి ఇన్‌చార్జ్ హోదాలోనే కొన‌సాగుతున్నారు. క‌రోనా స‌మ‌యంలో హైద‌రాబాద్‌ను దాటి బ‌య‌ట‌కు రాని నారా లోకేష్ ఇప్పుడిప్పుడే నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కేడ‌ర్‌కు అందుబాటులో ఉంటూ తాను మంగ‌ళ‌గిరిని వ‌ద‌ల‌ను అన్న సంకేతాలు పంపుతున్నారు.

ఈ సారి అదే సేఫా ?

నారా లోకేష్ ఈ సారి నియోజ‌క‌వ‌ర్గం మారిపోతార‌న్న ప్రచారం రెండు నెల‌లుగా మ‌ళ్లీ స్టార్ట్ అయ్యింది. ఈ ప్రచారంతో పాటు లోకేష్, చంద్రబాబు మ‌దిలో ఏమున్నా ఈ సారి మాత్రం మంగ‌ళ‌గిరే లోకేష్‌కు సేఫ్ అని టీడీపీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో అమ‌రావ‌తి ఉంద‌ని టీడీపీ ప్రచారం చేసినా జ‌నాలు న‌మ్మలేదు.. అయితే ఈ సారి జ‌గ‌న్ అమరావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లిస్తుండ‌డంతో ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితాలు త‌లకిందుల‌య్యాయి. వైసీపీ ప‌రిస్థితి రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఎలా ఉన్నా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అంత వీజీగా ఉండ‌దు.. అందులోనూ మంగ‌ళ‌గిరి, తాడికొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి తొలి దెబ్బే రేపు స్థానిక ఎన్నిక‌ల్లో త‌గ‌ల‌బోతోంద‌ని ఆ పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు.

వైసీపీకి ఎదురుగాలులు….

పైగా ఇక్కడ ఎమ్మెల్యే ఆర్కేలో జోష్ త‌గ్గిపోవ‌డంతో పాటు ఆయ‌నకు పార్టీలో పెద్ద ప్రాధాన్యత లేక‌పోవ‌డం లాంటి అంశాలు ఈ సారి టీడీపీకి బాగ ప్లస్ అవుతున్నాయి. మంగ‌ళ‌గిరిలో వైసీపీ స‌త్తా ఏంటో రేపు స్థానిక ఎన్నిక‌ల్లోనే తేలిపోనుంది. పంచాయ‌తీలు, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీల‌తో పాటు మంగ‌ళ‌గిరి, తాడేప‌ల్లి మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ చావు దెబ్బ త‌ప్పించుకుంటేనే 2024లో ఇక్కడ ఆ పార్టీ పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎన్నిక‌ల్లో ఫ్యాన్ పార్టీకి ఏ మాత్రం తేడా కొట్టినా టీడీపీకి నెక్ట్స్ సాధార‌ణ ఎన్నిక‌ల్లో తిరుగు ఉండ‌దు.

మరో ఆలోచన కూడా…?

ఈ ప‌రిణామాలు అన్నీ మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ కు సేఫ్ అన్న ఫీలింగ్ క‌లిగిస్తున్నాయి. అయితే అదే స‌మ‌యంలో మంగ‌ళ‌గిరి ప‌క్కనే అమ‌రావ‌తి స్థానం ఉన్న పెద‌కూర‌పాడు నుంచి కూడా లోకేష్‌ను నిల‌బెట్టే ఆలోచ‌న‌లో పార్టీ వ‌ర్గాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం అక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీథ‌ర్ గుంటూరు వెస్ట్ సీటుపై క‌న్నేసి.. అక్కడ పోటీ చేయాల‌న్న ఆలోచ‌న కూడా ఇందులో భాగ‌మే అంటున్నారు. మ‌రి నారా లోకేష్ నెక్ట్స్ రూటు ఎలా ఉంటుందో ? చూడాలి.

Tags:    

Similar News