పసుపు శిబిరానికి ఇక పరవశమేనటగా?

తెలుగుదేశం పార్టీ గత ఏడాదిగా పడకేసింది. అందులో రెండవ మాటకు తావు లేదు. కరోనా భయంలో చంద్రబాబు పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయితే ట్విట్టర్ పిట్టగా [more]

Update: 2021-01-05 08:00 GMT

తెలుగుదేశం పార్టీ గత ఏడాదిగా పడకేసింది. అందులో రెండవ మాటకు తావు లేదు. కరోనా భయంలో చంద్రబాబు పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయితే ట్విట్టర్ పిట్టగా నారా లోకేష్ పేరు తెచ్చుకున్నారు. ఇక ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ గానీ సొంతంగా లేని బీజేపీ ఈ మధ్యకాలంలో హడావుడి చేస్తోంది కానీ టీడీపీ నుంచి నాధుడు కానీ నాయకుడు కానీ బయటకు రాక తమ్ముళ్ళు పూర్తిగా సైడ్ తీసేసుకున్నారు. కొత్త ఏడాదితోనే జనంలోకి రావాలని నారా లోకేష్ నిర్ణయించుకున్నట్లుగా వస్తున్న వార్తలు ఇపుడు పసుపు శిబిరానికి పరవశాన్ని కలుగచేసేవే అంటున్నారు.

రైతుల పేరిట బాసట….

రైతులు ఎపుడూ రాజకీయ పరమపధ సోపానానికి దగ్గర మార్గాలే. నాడు వైఎస్సార్ పాదయాత్ర నుంచి చంద్రబాబు, జగన్ పాదయాత్ర వరకూ కూడా మూల ఆదరువు, ఇంధనం కూడా రైతులే. రైతు సమస్యల పైనే ఏ నాయకుడు అయినా ఫోకస్ పెట్టి జనంలోకి వచ్చేది. అలా వచ్చిన నేతలు కూడా ఇంతవరకూ హిట్ అవుతున్నారు తప్ప ఎక్కడా ఫెయిల్ కాలేదు. దాంతో రైతులకు పరామర్శ పేరిట ఏపీలోని పదమూడు జిల్లాలను కలియతిరిగేయాలని నారా లోకేష్ నిర్ణయించుకున్నారట. దానికి డేట్ టైం ఫిక్స్ చేసి బరిలోకి దూకడమే తరువాయి అని అంటున్నారు.

జోరు పెంచాల్సిందే …?

ఇంత అర్జంటుగా నారా లోకేష్ బయటకు రావడం వెనక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. సినిమాలలో ఓ వైపు బిజీగా ఉంటున్నా కూడా పవన్ కళ్యాణ్ జనసేన తరఫున అపుడపుడు కనిపిస్తున్నారు. బీజేపీ నేతలు అయితే గట్టిగానే సౌండ్ చేస్తున్నారు. ఇక టీడీపీలో చూస్తే ఏపీ టీడీపీకి కొత్త కామందుగా బాధ్యతలు తీసుకున్న అచ్చెన్నాయుడు కూడా జోరు పెంచేశారు అంటున్నారు. ఎటూ తండ్రీ కొడుకులు హైదరాబాద్ లో ఉంటే తాను పార్టీలో ఫుల్ ఫోకస్ అయ్యేలా అచ్చెన్న రెడీ చేసి పెట్టుకున్న ప్లాన్ తో తమ్ముళ్ళకు మరీ దగ్గర అవుతున్నారు. దాంతో నారా లోకేష్ రంగంలోకి దిగకతప్పలేదట.

కీలకమైన వేళ….

అచ్చెన్నాయుడు పదమూడు జిల్లాల పార్టీ ఇంచార్జిలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. టీడీపీ మీద ఆయన బాగానే విమర్శలు చేస్తున్నారు. బీసీ నాయకుడిగా నోరున్న నేతగా అచ్చెన్న మీద మీడియా ఫోకస్ కూడా బాగానే ఉంది. దాంతో చినబాబు సైకిల్ హ్యాండిల్ ని తన వైపు తిప్పుకుని పరుగులు పెట్టించాలని చూస్తున్నారుట. మరి పెదబాబు చంద్రబాబు నుంచి కూడా వచ్చిన డైరెక్షన్ కూడా ఇది కావచ్చు. అందుకే నారా లోకేష్ జనం బాట పడుతున్నారు అంటున్నారు. ఇక 2021 లో ఏపీలో వరస ఎన్నికలు ఉన్నాయి. ముందుగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఉంది. దీని తరువాత స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి. వీటిలో గెలవడం టీడీపీకి చాలా ముఖ్యం. అందుకే నారా లోకేష్ ట్విట్టర్ ని వదిలి బయటకు వస్తున్నాడు అన్న విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News