లోకేష్ ది ఉనికి పోరాటమేనా

తెలుగుదేశం పార్టీకి భావినాయకుడుగా తమ్ముళ్ళు కూడా గుర్తించని పరిస్థితుల్లో నారా లోకేష్ ఉన్నారు. ఆయనకు ఉన్న ఏకైక అర్హత చంద్రబాబు కుమారుడు కావడమే. నిజానికి చంద్రబాబు ఎన్టీయార్ [more]

Update: 2019-11-26 08:00 GMT

తెలుగుదేశం పార్టీకి భావినాయకుడుగా తమ్ముళ్ళు కూడా గుర్తించని పరిస్థితుల్లో నారా లోకేష్ ఉన్నారు. ఆయనకు ఉన్న ఏకైక అర్హత చంద్రబాబు కుమారుడు కావడమే. నిజానికి చంద్రబాబు ఎన్టీయార్ అల్లుడుగా టీడీపీలో చేరేనాటికే ఆయనకంటూ సొంత రాజకీయ అనుభవంతో సామర్ధ్యం నిరూపించుకున్నారు. బాబు కాంగ్రెస్ వంటి మహాసముద్రంలో ఈదుతూ మంత్రి పదవిని సంపాదించారంటేనే ఆయన టాలెంట్ అర్ధమవుతుంది. ఆ తరువాత ఆయన మామ పార్టీలో చక్రం తిప్పారు. ఆయన్ని నాయకుడుగా టీడీపీలో అప్పటికే గుర్తించారు కూడా. ఓ విధంగా ఎన్టీఆర్ వారసుడిగా బాబు ఉండతగినవాడే. అయితే ఆ సమయం వచ్చేంతవరకూ ఆగకుండా తొందరపడి ఎన్టీఆర్ దగ్గర నుంచి అధికారం లాగేసుకున్నాడన్న చెడ్డపేరు తెచ్చుకున్నాడు. దాంతో బాబు నాయకత్వ లక్షణాల కంటే వెన్నుపోటు ఎపిసోడే ముందుకు వచ్చేసింది. ఇక బాబు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ సరిపోతారా అన్నది తమ్ముళ్ళకే కాదు ఒక విధంగా ఆలోచిస్తే బాబుకే సందేహమేమో కూడా.

జగన్ కి పోటీనా….?

నారా లోకేష్ మాట్లాడితే తాను జగన్ కి పోటీ అనుకుంటారు. తెల్లారిలేస్తే ట్విట్టర్ కి పని చెబుతారు. జగన్ ని నానా మాటలు అంటూ అక్కడికి తాను సరిజోడు అనుకుని మురిసిపోతారు. ఇది బాగానే ఉన్నా నారా లోకేష్ ఏ విధంగా జగన్ కి సరితూగుతారన్నది టీడీపీలోనే పెద్ద చర్చగా ఉంది. ట్విట్టర్ ఉన్నది కాబట్టి సవాళ్ళు చేస్తున్నారు కానీ నారా లోకేష్ రాజకీయ జీవితంతో పోల్చుకుంటే నారా లోకేష్ ఎక్కడ ఉంటాడో అందరికీ తెలియనిది కాదు అని కూడా సెటైర్లు పడుతున్నాయి. నారా లోకేష్ తో పోలిస్తే జగన్ రాజకీయ జీవితం పూలపానుపు కాదు, ఆయన ఎంపీ అయిన కొద్ది నెలలకే వైఎస్సార్ కన్ను మూసారు. ఆ తరువాత జగన్ ది పూర్తిగా ఒంటరి పోరుగానే చెప్పుకోవాలి. దేశంలోనే రికార్డ్ స్థాయి మెజారిటీతో జగన్ కడప ఎంపీగా గెలిచారు. ఆ తరువాత తన పార్టీలో చేరిన వారిని అనేకసార్లు గెలిపించుకున్నారు. దశాబ్ద కాలంగా సొంతంగా పార్టీ పెట్టి నడుపుతూ వస్తున్నారు. మరి జగన్ ని అనాలని అంటున్నా కూడా నారా లోకేష్ ఆ స్థాయికి ఎదిగిపోతాడా అని వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు.

రాంగ్ రూటే మరి….

నిజానికి నారా లోకేష్ కి రాజకీయాల పట్ల అభిరుచి ఉన్నప్పుడు రావాల్సింది రాజమార్గంలో కానీ రాంగ్ రూట్లో కాదన్నది అందరి మాటగా ఉంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవకుండా ఎమ్మెల్సీగా వచ్చి దొడ్డితోవన మంత్రి పదవిని పట్టేసాడని నారా లోకేష్ మీద విమర్శలు ఉన్నాయి. అలా తాను బలహీనుణ్ణి అని తొలి అడుగులోనే నారా లోకేష్ చెప్పేసుకున్నారంటారు. ఇక్కడే వ్యూహాత్మకంగా తప్పు చేసిన నారా లోకేష్ పోనీ 2019 ఎన్నికలల్లోనైనా పోటీ చేయకుండా ఉంటే బాగుండేదన్న మాట కూడా ఉంది. పార్టీ కోసం ప్రచారం చేసి ఉంటే ఫలితాలు ఎలా వచ్చినా నారా లోకేష్ మీద ఓటమి ముద్ర ఉండేది కాదన్నది తమ్ముళ్ల నుంచే వస్తున్న మాట.

ఒక్కడిగా ఎదగాలి……

ఇవన్నీ ఇలా ఉంటే తాను మాత్రం జగన్ సాటి నాయకుడినని చెప్పుకోవడానికి ఉబలాటపడుతున్న నారా లోకేష్ ట్విట్టర్లో యుధ్ధం చేస్తే నాయకుడు అయిపోయినట్లేనా అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఏది ఏమైనా నారా లోకేష్ కి ఇప్పటికైనా సమయం మించిపోలేదు, ఒకరితో పోలిక పెట్టుకోకుండా తండ్రి చంద్రబాబు ప్రతిష్ట మీద ఆధారపడకుండా సొంతంగా రాజకీయం చేస్తే బాగుంటుందన్న సూచనలూ అందుతున్నాయి. మరొ చినబాబు రూటేమిటో.

Tags:    

Similar News