చినబాబుకే వాళ్లిద్దరూ సవాల్ గా మారతారా ?

ఇపుడు ఏపీలో రెండు కుటుంబాలు, నలుగురు నాయకులు టీడీపీ రాజకీయాన్ని నడిపిస్తున్నారు. సహజంగా టీడీపీ పెద్ద దిక్కు చంద్రబాబు. ఆయన కుమారుడు లొకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి. [more]

Update: 2020-11-16 13:30 GMT

ఇపుడు ఏపీలో రెండు కుటుంబాలు, నలుగురు నాయకులు టీడీపీ రాజకీయాన్ని నడిపిస్తున్నారు. సహజంగా టీడీపీ పెద్ద దిక్కు చంద్రబాబు. ఆయన కుమారుడు లొకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి. భవిష్యత్తు నేతగా ఉన్నారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయనకు కొడుకు వరస అయిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంటే జాతీయ స్థాయిలో ఆ తండ్రీ కొడుకులు అయితే రాష్ట్ర స్థాయిలో బాబాయ్, అబ్బాయ్ అన్న మాట. మొత్తానికి ఏపీ టీడీపీ కిరీటం నెత్తిన పెట్టడంతో తనకు బాధ్యత పెరిగింది అన్న స్పృహ తో పాటు తమకే పార్టీని గెలిపించే సత్తా ఉందన్న భావన కూడా కింజరాపు కుటుంబంలో ఏర్పడింది అంటున్నారు.

డైరెక్ట్ గానే….

ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే కళా వెంకట రావులా గమ్మున ఉండరు అని అందరికీ తెలుసు. బలమైన నేతగా, అంతకంటే బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అచ్చెన్నాయుడు చంద్రబాబుని సీఎం గా చూడాలన్నది తన కోరిక అంటూనే పార్టీ అధ్యక్షుడిగా తాను కూడా గట్టిగా నిలబడాలని చూస్తున్నారు. తన నాయకత్వాన్ని రాష్ట్ర క్యాడర్ ఆమోదించేలా చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ మధ్య చంద్రబాబు నియమించిన పాతిక మంది పార్లమెంట్ సీట్ల ప్రెసిడెంట్లతో డైరెక్ట్ గా మాట్లాడుతూ సమీక్షలు చేస్తున్నారు.

దూకుడు మీద అబ్బాయి…

ఇక ఇదే వరసలో అబ్బాయి రామ్మోహననాయుడు కూడా దూకుడు పెంచేశారు. తన బాబాయి రాష్ట్ర పార్టీ రధ సారధి కావడంతో ఆయన తన మార్క్ పాలిటిక్స్ ని చూపిస్తున్నారు. బాబాయి మూడు రాజధానుల విషయంలో గట్టిగా నోరు చేస్తే తాను జిల్లాల విషయాన్ని టేకప్ చేశారు. జగన్ సర్కార్ అర్ధం పర్ధం లేకుండా పార్లమెంట్ సీట్లను జిల్లాలుగా చేస్తామని అంటోందని, దీనికి తార్కికత ఉందా అని రామ్మోహన్ ప్రశ్నిస్తున్నారు. రేపటి రోజున కేంద్రం పార్లమెంట్ సీట్లను పెంచితే అపుడు కూడా మరిన్ని కొత్త జిల్లాలు ప్రకటిస్తారా. లేక ఉన్న వాటిని విడగొడతారా అని ఆయన నిలదీస్తున్నారు. శ్రీకాకుళాన్ని ముక్కలు చేస్తే ఊరుకోమని కూడా గర్జిస్తున్నారు.

ఫోకస్ కోసమేనా….?

ఇంతకాలం కేవలం తన జిల్లా సమస్యల మీదనే దృష్టి పెట్టిన అబ్బాయి ఇపుడు రాష్ట్ర సమస్యల మీద కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. ఏకంగా జగన్ సర్కార్ మీద ఘాటైన విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ఏపీకి చేసింది ఏమీ లేదని కూడా ఆయన అంటున్నారు. మొత్తానికి బాబాయ్ కి చేదోడుగా ఉంటూ తన పరపతిని కూడా స్వర్గీయ ఎర్రన్నాయుడు కొడుకుగా రామ్మోహన్ పెంచుకుంటున్నాడు అంటున్నారు. ఏపీలో యువ నాయకుడుగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ఇదే సరైన సమయం అని కూడా అబ్బాయ్ ఆలోచిస్తున్నాట్లుగా చెబుతున్నారు. టీడీపీలో యువ నేతగా ఇప్పటికైతే లోకేష్ ఉన్నారు. అయితే రామ్మోహన్ సబ్జెక్ట్ తో పాటు దూకుడుగా ముందుకు రావడంతో పాటు ఆయనకు ఉన్న బీసీ ట్యాగ్, ఓటమెరుగని ట్రాక్ రికార్డ్ ఇవన్నీ చూస్తే కచ్చితంగా టీడీపీలో బెస్ట్ యువ నేత అవుతారు అంటున్నారు. మరి ఈ దూకుడుని లోకేష్ చూస్తూ ఊరుకుంటారా అన్నదే పార్టీలో మరో చర్చ.

Tags:    

Similar News