మామ సీటే స్వీటు అట ?

తెలుగుదేశం భావి వారసుడు లోకేష్ ని ఈసారి ఎలాగోలా అసెంబ్లీ గేటు ఈసారి దాటించి లోపల కూర్చోబెట్టాలని టీడీపీ పెద్ద, తండ్రి అయిన చంద్రబాబు గట్టిగానే డిసైడ్ [more]

Update: 2020-11-12 12:30 GMT

తెలుగుదేశం భావి వారసుడు లోకేష్ ని ఈసారి ఎలాగోలా అసెంబ్లీ గేటు ఈసారి దాటించి లోపల కూర్చోబెట్టాలని టీడీపీ పెద్ద, తండ్రి అయిన చంద్రబాబు గట్టిగానే డిసైడ్ అయ్యారుట. లోకేష్ ని మంత్రిగా చేయడం తన చేతుల్లో ఉంది, చేశారు, అచ్చంగా అయిదు ఆణిముత్యాల్లాంటి శాఖలు కూడా లోకేష్ కి కట్టబెట్టాడు. ఎమ్మెల్సీ పేరిట మరో కుర్చీ వేశాడు. అంతవరకూ మాత్రమే బాబు చేయగలరు. కానీ మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిపించలేరుగా. ఓట్లు వేయాల్సిన జనం చేత వేయించలేరుగా. అందుకే అదృష్టం అలా అదృశ్యం అయితే లోకేష్ ఎటూ కాకుండా పోయారు.

వన్ ప్లస్ వన్ …

ఇక మరో మూడున్నరేళ్లలో ఎన్నికలు జరగనుండగా ఇప్పటి నుంచే టీడీపీలో లోకేష్ భవిష్యత్తు మీద టీడీపీలో చర్చలు సాగుతున్నాయి. మంగళకరం అనుకుంటూ పోటీ చేస్తే మంగళగిరి గట్టి టోకరా ఇచ్చేసింది. దాంతో ఈసారి పుత్రరత్నాన్ని జాగ్రత్తగా అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి బాబు మార్క్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాట్లుగా చెబుతున్నారు. ఈసారి ఒక సీటు కాదు రెండు చోట్ల నుంచి లోకేష్ ని పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించేశారుట. ఆ రెండు సీట్లు కూడా టీడీపీకి కంచు కోటలుగా ఉన్న వాటినే ఎంపిక చేస్తారుట.

మామకే ఎసరు….?

రెండు సీట్లలో పొటీని ప్రాంతీయ న్యాయం పేరిట కూడా కొత్త నినాదంగా తీసుకువస్తారట. అంటే కోస్తాలో ఒకటి, రాయలసీమలో మరోటి సీటు ఎంచుకుని చినబాబు దివ్యంగా పోటీకి దిగిపోతారన్న మాట. అలా చూసుకుంటే రాయలసీమ అంతా వైసీపీ రాజ్యంగా ఉంది. అక్కడ లోకేష్ బాబు పోటీ చేయాలంటే చాలా హై రిస్క్ చేయాలి. మరి పెద్దగా చూసుకోకుండా పోటీ చేయాలంటే మాత్రం కంచుకోట లాంటి హిందూపురం ఉంది. అనంతపురంలోని ఈ సీటు పాతికేళ్ళుగా టీడీపీ చేతుల్లోనే ఉంది. ఇక్కడ నందమూరి వారసుడు బాలక్రిష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే నారావారి అబ్బాయి పోటీకి దిగితే బాలయ్య సీటు ఖాళీ చేయాల్సిందేనట. అంటే ఆఖరుకు అల్లుడుకు ఎమ్మెల్యే కావాలంటే తాను మాజీ అయి సీటు ఇవ్వాల్సిన పరిస్థితి మేనమామ కూడా అయిన బాలయ్య మీద పడిందన్నమాట.

దానికి మంగళమేనట …?

ఇక రెండవ సీటుగా లోకేష్ గుంటూరు నుంచే పోటీ చేస్తారుట కానీ మంగళగిరి మాత్రం కాదుట. ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నా కూడా సెంటిమెంట్ పరంగా వద్దు అనుకుంటున్నారుట. దాంతో కమ్మల ప్రాబల్యం బాగా ఉన్న చోటు చూసుకుని పోటీకి దిగితే గెలుపు ఖాయమని భావిస్తున్నారుట. మొత్తానికి 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెడతాను అని లోకేష్ భావిస్తున్నారు కానీ జగన్ దెబ్బకు రెండు చోట్ల నుంచి పోటీకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారని వైసీపీ నేతలైతే సెటైర్లు మొదలెట్టేశారు.

Tags:    

Similar News