లోకేష్ వత్తిడితోనే…ఆయన పేరు ప్రకటించలేదా?

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్లమెంటు నియోజకవర్గాల కమిటీలను ప్రకటించారు. నిజానికి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కూడా ఈరోజే జరుగుతుందని ప్రచారం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా [more]

Update: 2020-09-27 13:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్లమెంటు నియోజకవర్గాల కమిటీలను ప్రకటించారు. నిజానికి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కూడా ఈరోజే జరుగుతుందని ప్రచారం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని ఎంపిక చేశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని తెలిసింది. దీనికి ప్రధాన కారణం అచ్చెన్నాయుడి ఎంపికపై కుమారుడు లోకేష్ అభ్యంతరం చెప్పడమే కారణమని తెలుస్తోంది.

అచ్చెన్నాయుడు పేరు ఖరారు….

అచ్చెన్నాయుడు పేరు దాదాపుగా ఖరరాయింది. పార్టీ కార్యాలయం నుంచి లీకులు కూడా వచ్చాయి. మరి నేడు ప్రకటించాల్సిన పేరును చంద్రబాబు ఎందుకు వాయిదా వేసినట్లన్న చర్చ జరుగుతోంది. అయితే దసరా రోజున రాష్ట్ర కమిటీతో పాటు అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారని, అందుకే ఇప్పుడు అధ్యక్షుడి పేరును ప్రకటించలేదని పార్టీ నేతలు చెబుతున్నా, లోపల మాత్రం అచ్చెన్నాయుడు పేరు అకస్మాత్తుగా ఆగిపోవడానికి కారణం లోకేష్ అని అంటున్నారు.

డామినేట్ చేస్తారని…..

నారా లోకేష్ భవిష్యత్ నేత. ఆయన తనకు అనుగుణమైన నేత పార్టీ అధ్యక్షుడిగా ఉండాలనుకుంటారు. తనను డామినేట్ చేసే నేతను లోకేష్ అంగీకరించరు. అచ్చెన్నాయుడు సీనియర్ నేత. ఆయన పార్టీ అధినాయకత్వంతో సంబంధం లేకుండానే నిర్ణయాలు తీసుకునే వీలుంది. తన కంటే రాష్ట్ర అధ్యక్షుడు ధీటుగా, దూకుడుగా ముందుకు వెళితే తన భవిష్యత్ కు ఇబ్బంది అని లోకేష్ భావించారంటున్నారు. అందుకే అచ్చెన్నాయుడి పేరును ఆయన వ్యతిరేకించినట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.

కళా వత్తిడి కూడా…..

ఇక అచ్చెన్నాయుడిని వ్యతిరేకించడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. గతంలో అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావుకు, లోకేష్ కు వయసులో తేడా ఉన్నా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. అచ్చెన్నాయుడు నియామకంపై కళా వెంకట్రావు కూడా లోకేష్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కళా వెంకట్రావు వత్తిడితోనూ లోకేష్ అచ్చెన్నాయుడి నియామకం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణమని కూడా అంటున్నారు. మొత్తం మీద పార్టీ అధ్యక్షుడి పేరు ప్రకటించకపోవడానికి లోకేష్ కారణమని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

Tags:    

Similar News