బాబూ… చిన బాబు చేత ఆ పని చేయించరూ..!!

లీడర్ అంటే ఎన్నికలకు భయపడకూడదు. ప్రజల మనోభావాలను బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ ని రద్దు చేసి [more]

Update: 2020-08-06 06:30 GMT

లీడర్ అంటే ఎన్నికలకు భయపడకూడదు. ప్రజల మనోభావాలను బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ ని రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని జగన్ కు సవాల్ విసిరారు. ఐదు కోట్ల మంది ప్రజలు అమరావతిని కోరుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నారు. అదే సెంటిమెంట్ బలంగా ఉందని చంద్రబాబు ఫీలయితే తన రాజధానికి ఆనుకుని ఉన్న మంగళగిరిలో పోటీ చేసి ఓటమి పాలయిన ఎమ్మెల్సీ లోకేష్ బాబు చేత రాజీనామా చేయించవచ్చు కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

మంగళగిరికి ప్రాతినిధ్యం వహించాలంటే……

నిజానికి అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుండటం పట్ల మంగళగిరి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండాలి. అదే నిజమయితే ఆ ప్రాంతానికి భవిష్యత్ లో ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్న నారా లోకేష్ రాజీనామా ఎందుకు చేయడం లేదన్నది ఇప్పుడు చర్చగా మారింది. కడప జిల్లాలో ఉన్న బీటెక్ రవి అమరావతి రైతుల కోసం తన ఎమ్మెల్సీ పదవి కోసం రాజీనామా చేశారు. కానీ మంగళగిరి నేతగా ఉన్న లోకేష్ మాత్రం రాజీనామాకు వెనకడగు వేస్తున్నారు.

భావి నేతగా…..

లోకేష్ పార్టీకి భావి నాయకుడు. పార్టీని నడిపించాల్సిన నేత. ఇప్పటికీ ఆయన నాయకత్వాన్ని నిరూపించుకోలేకపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లోకేష్ తెలుగుదేశం పార్టీకి వారసుడిగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. పార్టీ క్యాడర్ లోనూ నమ్మకం కలిగించాలి. అయితే అసెంబ్లీ మొత్తాన్ని రద్దు చేయమనడం పలాయన వాదంగానే చూడాల్సి ఉంటుంది. కానీ అమరావతి రైతులపై అపారమైన ప్రేమ కురిపించే లోకేష్ మాత్రం రాజీనామా చేయడానికి ముందుకు రావడం లేదు.

రెండున్నరేళ్ల పదవి కోసం….

నారా లోకేష్ ప్రస్తుతం శాసనమండలి సభ్యుడు. శాసనమండలిని జగన్ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపారు. శాసనమండలి రద్దు అవుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే లోకేష్ పదవి కాలం కూడా మరో రెండున్నరేళ్లు మాత్రమే ఉంటుంది. ఈమాత్రం పదవి కోసం లోకేష్ ఎందుకు వెంపర్లాడుతున్నట్లు అన్న చర్చ పార్టీలోనూ జరుగుతోంది. నిజానికి లోకేష్ రాజీనామా చేసి అమరావతి రైతుల పక్షాన నిలబడితే ఆయనకు మైలైజీ పెరిగే దంటున్నారు. కేవలం మంగళగిరికి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన నాయకత్వం పట్ల రాజీనామాతో పెరిగేదన్న వ్యాఖ్యలు పార్టీలోనే విన్పిస్తుండటం విశేషం. సెంటిమెంట్ బలంగా ఉందని చెబుతున్న చంద్రబాబు ముందు తన కొడుకు చేత రాజీనామా చేయిస్తే బాగుంటుందన్న సూచనలు కూడా విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News