లోకేష్ సైకిల్ అసెంబ్లీ గేటు దాటుతుందా ?

సైకిల్ గుర్తు అన్న ఎన్టీఆర్ ఏరి కోరి మరీ పెట్టుకున్నారు. ఆయన పార్టీ చిహ్నాలు కూడా పేదల కోసమే. పూరి గుడిసె దానికి అచ్చమైన సంకేతం. ఇక [more]

Update: 2020-07-30 14:30 GMT

సైకిల్ గుర్తు అన్న ఎన్టీఆర్ ఏరి కోరి మరీ పెట్టుకున్నారు. ఆయన పార్టీ చిహ్నాలు కూడా పేదల కోసమే. పూరి గుడిసె దానికి అచ్చమైన సంకేతం. ఇక పసుపు రంగు వెనక కూడా శుభకరమైన సూచన ఉంది. ఇలా టీడీపీని అన్ని వర్గాలు పచ్చగా ఉండాలని ఎన్టీఆర్ తన రాజకీయానికి శ్రీకారం చుట్టారు. ఇక సైకిల్ లేని వారు ఆ రోజుల్లో లేరు కాబట్టి మొత్తం బడుగులంతా టీడీపీ వెంటపడ్డారు. తరువాత రోజుల్లో అంటే చంద్రబాబు జమానాలో పేదలు టీడీపీకి దూరమయ్యారు. పెద్దలు కావాల్సివచ్చారు. దాంతో సైకిల్ కేవలం గుర్తుగా మారిపోయింది. దాంతో అన్న గారు ఎంచుకున్న ఔచిత్యం కూడా మసకబారిపోయింది.

తొక్కేస్తాడట ….

ఎన్టీఆర్ నిజ జీవితం సైకిల్ ప్రయాణంతో మొదలైంది. ఆయన కష్ట జీవి. అలాగే సినీ రాజకీయ రంగంల్లో ఎంతో క్రుషి చేసి ఉన్నత స్థానాలు అందుకున్నారు. ఇక ఆయన వారసుడిగా చంద్రబాబు పేదలతోనే కాదు, జనంతో కూడా అంతలా కనెక్ట్ కాలేదు అంటారు. దాని ఫలితమే టీడీపీ ఈనాటి ఘోర స్థితి. ఇపుడు మూడవ తరం నడుస్తోంది. లోకేష్ భావి వారసుడు అని బాబు అనుకుంటున్నారు. మరి జనం అనుకోవాలంటే ఆయన కూడా ప్రజల వద్దకు రావాలి. దాంతో లోకేష్ ఇపుడు సైకిల్ తొక్కి మరీ ఏపీలోని అయిదు కోట్ల మంది జనాలకు చేరువ అవుతారట.

అదే ముహూర్తం…..

కరోనా ఈ డిసెంబర్ నాటికి తగ్గుముఖం పడుతుందని ఒక అంచనా ఉంది. అదే కనుక జరిగితే మంచి ముహూర్తం చూసుకుని మరీ సైకిలెక్కి ఏపీ అంతా తొక్కేయాలని చినబాబు ఉత్సాహపడుతున్నారట. తండ్రి చంద్రబాబు అరవయ్యేళ్ళ వయసులో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి పీఠం పట్టేశారు. అంతకు ముందు వైఎస్సార్, ఈ మధ్యన జగన్ కూడా పాదయాత్రల ద్వారానే పీఠాలను అధిష్టించారు. ఇపుడు లోకేష్ బాబు వంతు వచ్చింది. అయితే తాను పాదయాత్ర బదులుగా సైకిల్ యాత్ర చేస్తే బాగుంటుందని లోకేష్ అనుకుంటున్నారుట. ఇది భిన్నమైన పోకడగానే ఉండడంతో పాటు పార్టీ గుర్తుని కూడా జనంలోకి తీసుకుపోవచ్చునన్నది కూడా లోకేష్ మాస్టర్ ప్లాన్ గా ఉంది అంటున్నారు.

సక్సెస్ రూటేనా…?

పాదయాత్రలు అన్నీ సక్సెస్. అది కూడా ఏపీలో నూరు శాతం సక్సెస్. ముగ్గురు ముఖ్యమంత్రులను పాదాలే దారి చూపించి తల మీద కిరీటం పెట్టాయి. అంత మాత్రం చేత దేశంలోని అన్ని పాదయాత్రలూ విజయవంతం కాలేదు. నాయకుడి మీద జనంలో నమ్మకం ఉండాలి. లోకేష్ అంటే ఎవరో జనాలకు ఇంతవరకూ తెలియలేదు. అది రుజువు చేసుకునే అవకాశాలు కూడా ఆయన వాడుకోలేదు. ఇపుడు ఆయన సైకిల్ యాత్రలు అంటున్నారు. ఈ విధంగా లోకేష్ కొంతవరకూ జనాలకు తనను తాను పరిచయం చేసుకోవచ్చు. అంతే కాదు, జనాల గురించి ఆయన తెలుసుకోవచ్చు. కానీ కేవలం దాని చేతనే సీఎం సీటు వచ్చి ఒళ్ళో పడుతుంది అనుకుంటే పొరపాటేనని అంటున్నారు విశ్లేషకులు. లోకేష్ కి ఒక నాయకుడుగా రూపాంతరం చెందేందుకు ఈ సైకిల్ యాత్ర ఉపయోగపడుతుందని అంటున్నారు. మరో వైపు చూస్తే యువ ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. ఆయన దూకుడు రాజకీయం తట్టుకుని జనంలో నిలబడ‌డం అంటే అతి పెద్ద సవాల్. కానీ ఎంత పెద్ద ప్రయాణం అయినా తొలి అడుగుతోనే మొదలు కాబట్టి లోకేష్ ప్రయత్నం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. పార్టీని అధికార తీరాలు చేర్చినా కాకపోయినా ఇంతకంటే మెరుగైన పొజిషన్ అటు పార్టీకి, ఇటు లోకేష్ కి దక్కేలా సైకిల్ యాత్ర చేస్తుందనడంలో మాత్రం సందేహం లేదు.

Tags:    

Similar News