లోకేష్ పదునెక్కినట్లే… జగన్ లాగానే?

ఓదార్పుకు కూడా యాత్ర ఉంటుందని, అలా నెలల తరబడి చేయవచ్చునని నిరూపించిన రాజకీయ నేత జగన్. అసలు జగన్ రాజకీయం మొదలైందే ఓదార్పు యాత్రలతో. అలా తన [more]

Update: 2020-07-01 00:30 GMT

ఓదార్పుకు కూడా యాత్ర ఉంటుందని, అలా నెలల తరబడి చేయవచ్చునని నిరూపించిన రాజకీయ నేత జగన్. అసలు జగన్ రాజకీయం మొదలైందే ఓదార్పు యాత్రలతో. అలా తన బలమేంటో, జనం అభిమానం ఏపాటితో ఒక లెక్కకు రావడానికి వ్యూహాత్మకంగానే జగన్ ఈ యాత్రలు చేపట్టాడని అంటారు. సరే అది పొలిటికల్ గా కూడా చాలా బాగా క్లిక్ అయింది, జనం తండోపతండాలుగా వచ్చారు, అప్పటికే చాలా బాధాకరంగా ఈ లోకాన్ని వీడిపోయిన వైఎస్సార్ లో జగన్ ని చూసుకున్నారు. జగన్ కి కూడా తన తండ్రి వారసుడిని తానే అవుతానన్న ధైర్యం అలా వచ్చిందని అంటారు. మొత్తానికి జగన్ ఓదార్పు యాత్రలు ఆయన రాజకీయ జీవితాన్నే కాదు, నాటి ఉమ్మడి ఏపీని కూడా ఒక కీలకమైన మలుపు తిప్పాయి.

అదే బాటలో……

సీన్ కట్ చేస్తే పదేళ్ళు అవుతోంది జగన్ ఓదార్పు యాత్రలకు. నాడు చినబాబుకు టీడీపీలో ఎంత అనుబంధంలో కూడా ఎవరికీ తెలియదు, ఇపుడు చూస్తే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రెండేళ్ళు మంత్రి పదవి చేపట్టారు, మూడేళ్ళుగా ఎమ్మెల్సీగా ఉన్నారు. వెనకాల రాజకీయ చాణక్యుడు చంద్రబాబు అండదండలు కూడా ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా లోకేష్ కి తన సామర్ధ్యం నిరూపించుకునే పరిస్థితి రావడమే అసలైన రాజకీయ విషాదం. సరే ఇపుడు లోకేష్ కూడా ముందు పార్టీ జనంలోకే వస్తున్నారు. ఈయన కూడా ఓదార్పు యాత్రలే చేపడుతున్నారు. జగన్ ఏలుబడిలో ఒక్కో కీలకనేతా జైలు పాలు అవుతూంటే వారి కుటుంబాలను పరామర్శించే పేరిట చినబాబు టూర్లు వేస్తున్నారు.

డైలాగుల దాకా ….

ఇక లోకేష‌ మాటల్లో పదును పెంచారు. గతంలో తడబాటు ఉండేది. ఇపుడు ప్రాక్టీస్ పుణ్యమాని అది పోయినట్లుంది. జగన్ మీద నేరుగా మాటల బాణాలు వేస్తున్నారు. ట్విట్టర్ ట్వీట్ల నుంచి డైలాగుల దాకా లోకేష్ బాబు బాగానే ఇంప్రూవ్ అయ్యారు. అయితే మాటలు తడబాటు లేకున్నా అందులో లాజిక్కే మిస్ అవుతున్నారు. తప్పంతా ఎదుటివారిదేనని చంద్రబాబు ఒడుపుగా తోసేసేవారు. చినబాబు మాత్రం బోల్డ్ గా మాట్లాడుతూ అడ్డంగా దొరికేస్తున్నారు. అయినా సరే తాను ఒంటరిగా వస్తే పార్టీ జనాల్లో ఆదరణ ఏమాత్రం ఉంటుందో బేరీజు వేసుకోవడానికి ఈ యాత్రలు బాగా ఉపయోగపడుతున్నాయని అంటున్నారు.

సేమ్ టు సేమ్ …..

ఇక లోకేష్ తన మాటల్లో పదే పదే అరాచక పాలన అంటున్నారు. అంతు చూస్తామని గర్జిస్తున్నారు. పైన దేవుడున్నాడు. అన్నీ చూస్తున్నాడు జగన్, మీ తప్పులకు సరైన గుణపాఠం చెప్పే రోజు వస్తుంది అని కూడా అంటున్నాడు ఇది సేమ్ టు సేమ్ జగన్ డైలాగే. ఆయన కూడా తన ప్రసంగాల్లో దేవుడు ఉన్నాడు, చల్లగా చూస్తాడు, చంద్రబాబు చేసే తప్పులకు మొట్టికాయలు వేస్తాడు అంటూ చెప్పుకొచ్చేవారు. మొత్తానికి జగన్ రూట్లొ వెళ్తూ పార్టీకి ఓదార్పు ఇస్తున్న లోకేష్ కు ముందుగా పార్టీ జనం నుంచి ఎంత ఓదార్పు వస్తుందో చూడాలి. ఏది ఏమైనా లోకేష్ అడుగు వేయడమే ఇప్పటికైతే గొప్ప అని తమ్ముళ్ళు అంటున్నారుట.

Tags:    

Similar News