లోకేష్ ఎదుగుతున్నాడా..లేక టీడీపీ… ?

మా బాబే, బంగారమే అంటూ చినబాబుకు ఒక వైపు సోషల్ మీడియాలో స్తోత్రపాఠాలు చదివే వారు ఎక్కువయ్యారు. చినబాబు ఏమిటో ఇంకా నిరూపించుకోలేదు అన్న సంగతి తెలిసిందే. [more]

Update: 2021-08-20 14:30 GMT

మా బాబే, బంగారమే అంటూ చినబాబుకు ఒక వైపు సోషల్ మీడియాలో స్తోత్రపాఠాలు చదివే వారు ఎక్కువయ్యారు. చినబాబు ఏమిటో ఇంకా నిరూపించుకోలేదు అన్న సంగతి తెలిసిందే. ఆయన మంత్రి అయినా, ఎమ్మెల్సీ అయినా, లేక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో వెలిగిపోతున్నా కూడా అదంతా చంద్రబాబు దయ వల్లనే అన్నది పూర్తిగా నారా లోకేష్ మరచిపోతున్నారు. చినబాబు కాబోయే సీఎం అని కూడా నినాదాలు ఇస్తున్నారు. ఇలా ఇస్తున్న వారు ఎవరూ అంటే నారా లోకేష్ ప్రత్యేకంగా తయారు చేసుకున్న టీమ్ అన్న మాట వినిపిస్తోంది.

ఎక్కడి ఎన్టీఆర్ …..

తెలుగుదేశం అంటే మేరు శిఖరం లాంటి ఎన్టీయార్ గుర్తుకువస్తారు. ఆయన నాయకత్వం అద్భుతమైనది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన మేటి ఆయన. తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన జన నాయకుడు ఆయన. ఎన్టీయార్ వంటి బిగ్ ఫిగర్ నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్న తరువాత చంద్రబాబు టీడీపీ సింహాసనానికి ఒక మూలన కూర్చున్నట్లుగానే కనిపించేవారు. అంటే ఎన్టీయార్ మిగిల్చిన లోటు ఎంత ఉందో అదే చెబుతోంది. అయితే చంద్రబాబు తరువాత తరం నాయకుడిగా వ్యూహాలను అమలు చేస్తూ టీడీపీకి తానే అనివార్యం అనిపించుకోగలిగారు.

పోలిక ఉందా …?

ఇక మూడవ తరంలో నారా లోకేష్ మా లీడర్ అంటున్నారు. మరి ఎక్కడైనా పోలిక ఉందా. ఎన్టీయార్ నుంచి పరంపర తీసుకుంటే నాయకత్వ ప్రభలు అలా తగ్గుతూ వస్తున్నాయనే విశ్లేషించాలి. చంద్రబాబు తరువాత లోకేష్ అంటే కుమారుడిగా కావచ్చు. కానీ టీడీపీకి ఎలా అన్నదే ప్రశ్న. చంద్రబాబు మార్క్ వ్యూహాలు కూడా నారా లోకేష్ దగ్గర లేవు. కానీ ఆయన తానే పార్టీకి అసలైన పెత్తందారుడిని అంటున్నారు. ఆయన జగన్ మీదనే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అయినా మంత్రుల మీద తన బాణాలు వేస్తున్నారు కానీ నారా లోకేష్ ఎక్కడా ఆ విషయంలో తగ్గడంలేదు. తనకు సరిజోడే జగన్ అంటున్నారు. మరి జనాలు అలా అనుకుంటున్నారా.

గ్రాఫ్ పడిపోయిందిగా…?

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఘనం. ఎన్టీయార్ జమానాలో గడించిన కీర్తి అజరామరం. అయితే తరువాత కాలంలో పార్టీ గ్రాఫ్ అలా పడిపోతూ వస్తోంది. ఇపుడు తెలంగాణాలో టీడీపీ లేదనే చెప్పాలి. ఏపీలో చూసుకుంటే కొన్ని జిల్లాల్లో కూడా ఉనికి పోరాటం చేస్తోంది. ఈ రకమైన పరిస్థితుల్లో టీడీపీకి అధినాయకుడుగా నారా లోకేష్ అని చెప్పుకుంటే ఆయన ఎదిగినట్లు అనుకోవాలా లేక టీడీపీ ప్రభలు మరింతగా తగ్గుతున్నాయనుకోవాలా అన్నదే చర్చ. లోకేష్ నాయకుడుగా ఉండే టీడీపీలో సమర్ధులైన సీనియర్లు కూడా ఉండరనే అంటున్నారు. వారంతా తప్పుకుంటారు. లేక తప్పిస్తారు. ఆ విధంగా చూసుకుంటే నారా లోకేష్ టీడీపీ తాత వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందా అంటే జవాబు చెప్పడం సులువే మరి.

Tags:    

Similar News