ప్రమోట్ చేస్తేనే ముఖ్యమంత్రి అవుతారా?

తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఆ పార్టీని గట్టెక్కించడానికి చంద్రబాబుతో సహా ఇప్పుడున్న నేతల శక్తియుక్తులు సరిపోవు. వైసీపీ మీద సహజంగా వ్యతిరేకత వస్తే తప్ప [more]

Update: 2021-07-17 14:30 GMT

తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఆ పార్టీని గట్టెక్కించడానికి చంద్రబాబుతో సహా ఇప్పుడున్న నేతల శక్తియుక్తులు సరిపోవు. వైసీపీ మీద సహజంగా వ్యతిరేకత వస్తే తప్ప తెలుగుదేశం పార్టీ కోలుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మూడు ప్రాంతాల్లో ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. అయితే ఈ పరిస్థితుల్లో చంద్రబాబు లోకేష్ ను హైలెట్ చేస్తుండటం పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుందన్నది విశ్లేషకుల అంచనా.

ప్రమోట్ చేయాలన్న ప్రయత్నం….

చంద్రబాబుకు వయసు పెరిగిపోతుంది. అందుకే లోకేష్ ను ప్రమోట్ చేయాలని చంద్రబాబు తెగ ఆరాటపడుతున్నారు. ఆయన దగ్గరుండి లోకేష్ ను పర్యటనలకు పంపుతున్నారు. లోకేష్ కూడా తాను పంచ్ డైలాగ్ లతో ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అది వికటిస్తుంది. చంద్రబాబు లోకేష్ ను భావి ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. కానీ లోకేష్ మాత్రం ఆ స్థాయికి చేరుకోవడం లేదు. చిన్న విషయాల్లోనూ అనవసర కామెంట్లు చేస్తూ పలచన అయిపోతున్నారు.

స్థాయి మరచి….

కర్నూలులో వాడిన భాషతో లోకేష్ స్థాయి రాజకీయంగా మరింత దిగజారింది. పరీక్షల రద్దు తన విజయమంటూ చెప్పుకోవడానికి ఆయన అనుచరులు చేసిన ప్రయత్నాలూ వికటించాయి. లోకేష్ కు పాలాభిషేకాలు చేయడాన్ని కూడా పార్టీలో సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. లోకేష్ మరికొంత కాలం రాజకీయాల్లో నలగాలన్నది సీనియర్ నేతల అభిప్రాయం. ఇప్పుడిప్పుడే భావి ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తే నష్టమంటున్నారు.

భావి ముఖ్యమంత్రిగా…..

కానీ పరీక్షల రద్దుతర్వాత టీడీపీ సోషల్ మీడియాలో లోకేష్ ను భావి ముఖ్యమంత్రిగా పోస్టింగ్ లు పెడుతూ హల్ చల్ చేశారు. నిజానికి లోకేష్ మంగళగిరిలో ఓటమితోనే సీఎం స్థాయి కోల్పోయారు. తిరిగి ఆ స్థాయికి రావాలంటే లోకేష్ మరింత శ్రమించాల్సి ఉంటుంది. భాషపై పట్టు పెంచుకోవాల్సి ఉంటుంది. అంశాలపై అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సీనియర్ నేతల అభిప్రాయాలే. అప్పటి వరకూ లోకేష్ ను ముఖ్యమంత్రిగా ఊహించుకోవడానికే పార్టీ నేతలు కూడా ఇష్పపడరన్నది వాస్తవం.

Tags:    

Similar News