మామ తగ్గాడు… అన్న నెగ్గాడు

వైఎస్ జగన్ నిర్ణయాలు కొన్ని అలాగే ఉంటాయి. ఆయన మనసులో ఏముంటుందో తెలియదు కానీ బాగా తలంటు అయ్యాక మాత్రమే వెనక్కి తగ్గుతారు. ఈ లోగా పరువు [more]

Update: 2021-06-26 12:30 GMT

వైఎస్ జగన్ నిర్ణయాలు కొన్ని అలాగే ఉంటాయి. ఆయన మనసులో ఏముంటుందో తెలియదు కానీ బాగా తలంటు అయ్యాక మాత్రమే వెనక్కి తగ్గుతారు. ఈ లోగా పరువు అంతా పోతుంది. రెండేళ్ల ఏలుబడిలో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టెన్త్ ఇంటర్ పరీక్షల విషయంలో మాత్రం జగన్ ఫెయిల్ అయిపోయాడు. మామగా తండ్రిగా నేను విద్యార్ధుల బాగోగులు అన్నీ చూసుకుని పరీక్షలు నిర్వహించి తీరుతాను అని చెప్పిన జగన్ సుప్రీం కోర్టు దెబ్బకు రద్దు చేసుకోకతప్పలేదు. గత రెండు నెలలుగా పరీక్షల రద్దు మీద పోరాటం చేస్తున్న లోకేష్ అన్న ఈ విషయంలో ఫస్ట్ క్లాస్ లో నెగ్గేశాడు. బహుశా లోకేష్ పొలిటికల్ కెరీర్ లో ఇది మొదటి విజయంగా భావించాలి.

పంతానికి పోయి ….

రెండు నెలల క్రితమే ఈ పని జగన్ చేసి ఉంటే లోకేష్ కి పొలిటికల్ క్రెడిట్ వచ్చేది కాదు. ఏప్రిల్ లో తొమ్మిదవ తరగతి వరకూ అన్నింటికీ పరీక్షలు రద్దు చేసి ప్రమోట్ చేసిన చేత్తోనే టెన్త్ ఇంటర్ కూడా అంటూ ఒక్క మాట చెప్పి ఉంటే లోకేష్ అన్న క్యారక్టర్ ఎంట్రీ ఉండేది కాదు. కానీ అప్పటికే లోకేష్ ఒక లేఖ రాశాడన్న కారణంతో జగన్ సర్కార్ పట్టుదలకు పోయింది. అంతే కాదు ప్రతీ రెండు రోజులకు ఒక మారు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా ముందుకు వచ్చి పరీక్షలు నిర్వహించి తీరుతామని చెబుతూ విద్యార్ధులను హడల కొట్టేశారు. ఇదంతా ప్రభుత్వం మీద నెగిటివిటీని ఒక్కసారిగా పెంచేసింది.

జూమ్ యాప్ ద్వారా…?

టీడీపీ వాడే ఏ జూమ్ యాప్ నైతే వైసీపీ నేతలు విమర్శలు చేస్తారో అదే జూమ్ యాప్ టీడీపీ యువ నాయకుడు లోకేష్ ని విద్యార్ధులకు దగ్గర చేస్తుంది. లోకేష్ వారితో తరచూ మీటింగ్స్ పెట్టి బాగా సన్నిహితం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు జరగనీయమని లోకేష్ చేసిన ప్రతిన ఈ రోజు నిజం అయింది. ఈ క్రెడిట్ మొత్తం లోకేష్ దే కాకపోయినా ఒక రాజకీయ పార్టీగా ఆయన పోరాటం మాత్రం ఇందులో ఉంది అని ఒప్పుకోకతప్పదు. ఇదిలా ఉంటే లోకేష్ కి ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. థాంక్ యూ లోకేష్ అన్న అంటూ హ్యాష్ ట్యాగ్ కి మంచి ఆదరణ దక్కుతోంది.

విడుపు ఉండాలి…

నిజానికి పొరుగున ఉన్న కేసీయార్ టెన్త్ ఇంటర్ పరీక్షలు రద్దు చేసి పారేశారు. ఆనాడే ఏపీ సర్కార్ కూడా డెసిషన్ తీసుకుని ఉంటే లోకేష్ కి ఇంత ఆయాసం ఉండేది కాదు అన్న మాట వైసీపీలో ఉంది. ఈ రోజు సుప్రీం కోర్టు కూడా ఇప్పటికే లేట్ అయినా మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ సర్కార్ ని అభినందించడాన్ని కూడా ఆలోచించుకోవాలి. జగన్ ఎందుకో తెలిసి కూడా తనకు తానే పరీక్షలు పెట్టుకుంటాడు అన్న మాట అయితే సొంత పార్టీలోనే ఉంది. మొత్తానికి లోకేష్ ని యూత్ లో అన్నను చేసి తాను మేనమామ‌గా ఓడిపోయాడు జగన్ అంటూ కామెంట్స్ వచ్చిపడుతున్నాయి.

Tags:    

Similar News