ఇక లోకేష్ అన్న… ?

రాజకీయాల్లో బంధాలకు పెద్దగా విలువ లేదు అంటారు. కానీ అది పార్టీల నేతల విషయంలోనే. టోటల్ జనాలకు కనెక్ట్ అవాలి అంటే అన్న గానో అక్కగానో అనుబంధం [more]

Update: 2021-06-07 14:30 GMT

రాజకీయాల్లో బంధాలకు పెద్దగా విలువ లేదు అంటారు. కానీ అది పార్టీల నేతల విషయంలోనే. టోటల్ జనాలకు కనెక్ట్ అవాలి అంటే అన్న గానో అక్కగానో అనుబంధం గట్టిగా పెన వేసుకోవడమే. సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వస్తూనే ఎన్టీయార్ తెలుగు జాతి మొత్తానికి ఉమ్మడి అన్నగా నిలిచారు. ఆ తరువాత పవర్ లోకి వచ్చిన చంద్రబాబు కూడా ఇదేదో బాగుందని చంద్రన్నగా మారిపోయారు. ఇపుడు జగనన్న రాజ్యం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు లోకేష్ అందలాలు ఎక్కాలని భావిస్తున్నారు. దాంతో ఆయన సైతం కరెక్ట్ రిలేషన్ షిప్ తోనే జనాలకు దగ్గర కావాలనుకుంటున్నారుట.

అన్నగా ఉంటా …?

లోకేష్ టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయమని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ పరీక్షలు పూర్తిగా రద్దు చేసేవరకూ తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తాను ప్రతీ విద్యార్ధికీ అన్నగా ఉంటానని, వారి తరఫున ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకుంటానని చెప్పారు. సరే ఆయన ఎంచుకున్న అంశం పక్కన పెడితే ఒక అన్నగా మీ కోసం ఉంటాను అని లోకేష్ చెప్పడాన్ని మాత్రం కొత్తగానే చూడాలి మరి. లోకేష్ ఇప్పటిదాకా ఎక్కడా ఇలాంటి రిలేషన్స్ పెట్టుకోలేదు. ఫస్ట్ టైమ్ ఆయన నోటి వెంట ఈ మాట రావడం అంటే రాజకీయ రూట్ బాగానే గుర్తించారు అన్న మాటేగా.

యూత్ కోసమే…?

ఇవాళ టీనేజర్లే రేపటి ఓటర్లు. అందుకే లోకేష్ తెలివిగా ఈ కొత్త సెక్షన్ మీద కన్ను వేస్తున్నాడు అనుకోవాలి. అప్పట్లో జగన్ కూడా యువ నేతగా బాగా ప్రమోట్ చేసుకున్నారు. ఆయన కూడా యువ భేరీలు వంటివి పెట్టి విద్యార్ధి లోకంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ ఓట్లు కూడా ఆయనకు ఎన్నికల్లో బాగా కలసివచ్చాయి. దాంతో ఇపుడు మక్కీకి మక్కీ లోకేష్ బాబు కూడా జగన్ మాదిరిగానే అన్నగా అవతరించాలని ఉబలాటపడుతున్నారు. రానున్న రోజుల్లో ఆయన యువతకు సంబంధించి మరిన్ని కొత్త సమస్యలను టార్గెట్ చేస్తూ జనాల్లోకి వస్తారట.

క్లిక్ అయితే కష్టమే…?

జగన్ వయసు ఇపుడు 49 ఏళ్ళు. ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఫిఫ్టీ ప్లస్ లో ఉంటారు. ఇక అప్పటికి లోకేష్ ఫార్టీ ప్లస్ లో ఉంటారు. ఆ విధంగా ఆలోచిస్తే లోకేష్ వైపే యువత ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. జగన్ యూత్ అని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా పెద్దగా అవకాశం ఉండదు. దాంతోనే లోకేష్ తెలివిగా పావులు కదుపుతున్నారు అంటున్నారు. అయిదేళ్ళ కోసారి జరిగే ఎన్నికల్లో కొత్త ఓటర్లు కచ్చితంగా ప్రభావం చూపుతారు. అదే విధంగా ఒక అన్నగా తమ్ముడిగా బిడ్డగా అంటూ మిగిలిన వర్గాలను కూడా కలుపుకుని ముందుకు పోతే రాజకీయం బాగా పండుతుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ని కూడా మిక్స్ చేస్తూ రాజకీయ చిత్రాన్ని సూపర్ హిట్ చేసుకోవచ్చు. మొత్తానికి చంద్రబాబు డైరెక్ట్ చేశారా లేక లోకేష్ కే ఈ ఆలోచన పుట్టిందా తెలియదు కానీ ఇక పైన మాత్రం ఆయన చినబాబు మాత్రం కాదు, లోకేష్ అన్న. అంతే.

Tags:    

Similar News