లోకేష్ బాధ్యతను జగన్ తీసుకున్నారా…?

తెలుగుదేశం భావి వారసుడు లోకేష్ అన్నది అందరికీ తెలిసిందే. చంద్రబాబు తరువాత పార్టీకి ఆయనే అని కూడా అంటారు. ఒక విధంగా ఉత్తరాధికారి అన్న మాట. అయితే [more]

Update: 2021-05-11 14:30 GMT

తెలుగుదేశం భావి వారసుడు లోకేష్ అన్నది అందరికీ తెలిసిందే. చంద్రబాబు తరువాత పార్టీకి ఆయనే అని కూడా అంటారు. ఒక విధంగా ఉత్తరాధికారి అన్న మాట. అయితే ఇది తమ్ముళ్లకు ఇతర పార్టీ నేతలకు ఎంత వరకూ ఇష్టం అన్నది పక్కన పెడితే పార్టీలో చంద్రబాబు బలవంతుడు కాబట్టి ఆయన చెప్పిందే వేదం కాబట్టి లోకేష్ విషయంలో ఎవరూ కిక్కురుమనలేరు. ఇక తమ్ముళ్లకు జూనియర్ ఎన్టీయార్ వస్తే పార్టీ బాగుపడుతుంది అన్న ఆశ ఉంది. కానీ బాబు మాత్రం అదేం కుదరదు అని క్లారిటీగా చెప్పేస్తున్నారు. అందుకే లోకేష్ ని ఆయనే స్వయంగా మరింత ముందుకు తోస్తున్నారు.

అది లాభమేనా…?

లోకేష్ టీడీపీకి నాయకత్వం వహిస్తే ఎవరికి లాభం అంటే కచ్చితంగా వైసీపీకే అన్న మాట ఉంది. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఎపుడూ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తూంటాయి. బాబుకు అన్ని వ్యవస్థలలో ఉన్న విస్తృతమైన పరిచయాలు, ఆయన చాణక్య రాజకీయమే ఇప్పటిదాకా టీడీపీని కాపాడుకుంటూ వస్తోంది. టీడీపీకి ఏకైన చరిష్మాటిక్ లీడర్ అన్న ఎన్టీయార్ మాత్రమే. ఆయన దివంగతులు అయ్యాక పాతికేళ్లుగా పార్టీని బాబు లాక్కువచ్చారూ అంటేనే ఆయన రాజకీయం ఎంత పదునైనదో అర్ధమవుతుంది. ఇక లోకేష్ ని బాబుతో ఏ విధంగానూ పోల్చడానికి లేదు. తండ్రి చాటు బిడ్డగానే ఆయన ఇప్పటికీ ఉంటారని పేరు.

సవాళ్లకు జవాబు….

ఇక లోకేష్ చేసే సవాళ్ళను ఇన్నాళ్ళూ వైసీపీ సీరియస్ గా తీసుకోలేదు. జూనియర్ అంటూ పక్కన పెట్టేసింది. కానీ తిరుపతి ఉప ఎన్నిక నుంచీ ఒక వ్యూహం ప్రకారం వైసీపీ మంత్రులు లోకేష్ కి కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. చంద్రబాబుకు ఏ విధంగా జవాబు చెబుతారో అదే విధంగా లోకేష్ కి విపక్ష హోదాను ఇస్తూ వైసీపీ ఆడుతున్న ఈ గేమ్ వెనక పెద్ద రాజకీయమే ఉందని అంటున్నారు. టీడీపీలో లోకేష్ పొడ గిట్టని వారు రాష్ట్ర స్థాయి నాయకుల దాకా ఎక్కువగానే ఉన్నారు. అటువంటి వేళ లోకేష్ ని ఆ పార్టీలో పెంచితే ఒక విధంగా తమకే అది కలసి వస్తుంది అన్న స్ట్రాటజీతో వైసీపీ ఉంది అంటున్నారు.

అంగుష్టమాత్రంగా…..

లోకేష్ మాత్రమే టీడీపీకి నాయకుడిగా ఉండాలని బాబు కోరుకుంటున్నారు. ఆయనే ఉండాలని ఇపుడు వైసీపీ కూడా కోరుకుంటోందా అన్న డౌట్లు వస్తున్నాయి. లోకేష్ మాటకు మరో మాట అంటూ పొలిటికల్ గా అగ్గి రాజేస్తున్న వైసీపీ ఆయన మీద బాగానే ఫోకస్ పెట్టింది అంటున్నారు. దాంతో టీడీపీలో లోకేష్ సహజంగానే పెద్ద నాయకుడిగా ఎక్స్ పోజ్ అవుతారు. ఆ మీదట నచ్చినా నచ్చకపోయినా మిగిలిన వారు అంతా లోకేష్ కీర్తనలు అందుకోవాల్సిందే. ఇక లోకేష్ సారధ్యంలో టీడీపీ అంగుష్టమాత్రంగానే మిగిలిపోతుంది అన్న లెక్కలు కూడా వైసీపీకి ఉన్నాయట. మొత్తానికి శత్రు శిబిరంలో ఎవరు ఉండాలో ఒకనాడు బాబు నిర్ణయించేవారు. ఇపుడు అదే వ్యూహాన్ని జగన్ కూడా అనుసరిస్తున్నారు అంటున్నారు. లోకేష్ టీడీపీలో ఎంత ఎదిగితే అది వైసీపీకి, జగన్ కి అంత మేలు చేసేదే అన్న మాట అయితే ఇపుడు ఉంది.

Tags:    

Similar News