డైలాగ్స్ ఓకే…యాక్షన్ ఏది లోకేశా ?

ఏ సినిమా హిట్ కావాలన్నా కూడా కేవలం పంచ్ డైలాగులు ఉంటే సరిపోదు, యాక్షన్ పార్ట్ కూడా గట్టిగా దట్టించాలి. అపుడే మాస్ కి పూనకాలు వస్తాయి. [more]

Update: 2021-05-01 08:00 GMT

ఏ సినిమా హిట్ కావాలన్నా కూడా కేవలం పంచ్ డైలాగులు ఉంటే సరిపోదు, యాక్షన్ పార్ట్ కూడా గట్టిగా దట్టించాలి. అపుడే మాస్ కి పూనకాలు వస్తాయి. అది పొలిటికల్ సినిమా అయితే వీర లెవెల్ లో యాక్షన్ సీన్లు ఉండాలి. టీడీపీ భావి వారసుడు లోకేష్ విషయానికి వస్తే ఈ మధ్యన బాగానే డైలాగులు వదులుతున్నాడు. జగన్ రెడ్డీ అంటూ దీర్ఘాలు తీస్తూ సెటైర్లు వేస్తున్నాడు. వైసీపీ సర్కార్ కి డెడ్ లైన్లూ పెడుతున్నాడు. వార్నింగులు ఇస్తూ ఎమోషన్ సీన్లు పండిస్తున్నాడు. కానీ మ్యాటరేంటి అంటే అవన్నీ జూమ్ యాప్ దగ్గరే ఆగిపోతున్నాయి.

అది ఫెయిల్ కాదా….?

అమరావతి రాజధానిని మూడుగా చేస్తానని జగన్ సర్కార్ అన్నపుడు లోకేష్ ఎలాంటి పోరాటం చేయాలి. తన తండ్రి చంద్రబాబు కలల రాజధాని ఏమీ కాకుండా పోతూంటే చినబాబు ఏ రేంజిలో ఊగిపోవాలి. తమ ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చినపుడు వారి పక్షాన నిలిచి ఎంతలా అగ్గి రాజేయాలి. అక్కడే చినబాబు తేలిపోయాడు అంటున్నారు. ఇక తమ పార్టీ నేతలను వరసపెట్టి అరెస్టులు చేస్తూంటే కూడా ట్విట్టర్ లో ట్వీటడం తప్ప కార్యక్షేత్రంలోకి లోకేష్ రాలేదు అన్న విమర్శలు అయితే సొంత పార్టీలోనే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే గత రెండేళ్ళల్లోనూ వైసీపీ సర్కార్ కి ఎదురు నిలిచి దూకుడుగా చేసిన ఉద్యమం ఏదైనా ఉందా అంటే చినబాబు ఫ్యాన్స్ ఏమని బదులిస్తారో.

వీధుల్లోనే తేల్చాలి…

జగన్ ప్రభుత్వం ఫలానా తప్పు చేస్తోంది అని ట్వీట్ చేయడం వేరు, జూమ్ యాప్ లో స్పీచులివ్వడం వేరు. అదే బాధిత జనానికి భరోసాను ఇస్తూ కదం తొక్కడం వేరు. అధికార పార్టీ హడలెత్తేలా రాజకీయ పోరాటాలు చేస్తేనే ఏ నేత అయినా హైలెట్ అవుతారు జనంలోనూ సానుభూతి వస్తుంది. కరోనాకు ముందు చంద్రబాబు ఇసుక మీద పోరాటం చేశారు, మరి కొన్ని సమస్యల మీద వీధుల్లోకి వచ్చారు. ఇపుడు ఆయన రాకపోతే ఆ బాధ్యత భావి నేతగా భాసిల్లుతున్న లోకేష్ తీసుకోవాలి కదా అన్న చర్చ అయితే వస్తోంది.

లేస్తే మనిషిని కానంటూ …?

లోకేష్ జగన్ కి చేస్తున్న హెచ్చరికలు భారీ డైలాగులు అన్నీ కూడా ఆయన ఇంటి గడప దాటడంలేదనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడో పొరుగు రాష్ట్రంలో కూర్చుని రాళ్ళేస్తే పట్టించుకుంటామా అని వైసీపీ నేతలు లైట్ గా తీసుకుంటున్నారు. చినబాబు అయినా అమరావతిలో కాపురం ఉంటూ సర్కార్ మీద గొంతొత్తి మాట్లాడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా అన్న మాట కూడా ఉంది. ఎంతసేపూ లేస్తే మనిషిని కానూ అంటూ గర్జించడం వల్ల పరువు పోవడం తప్ప ఉపయోగం ఏమైనా ఉందా చినబాబూ అన్నదే సొంత పార్టీ నేతల గోల. డెడ్ లైన్లు పెట్టడం కాదు, ఆ తరువాత ఏం చేయాలో యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాకే నోరు విప్పాలి. లేకపొతే ఉడత ఊపులకు జగన్ సర్కార్ భయపడుతుందా. పైగా అక్కడ ఉన్నది జగన్. మరి లోకేష్ సినిమాలో డైలాగులు అదిరిపోతున్నాయి. ఇక యాక్షన్ పార్ట్ ఎపుడు అన్నదే తమ్ముళ్ళ సూటి ప్రశ్న.

Tags:    

Similar News