అచ్చెన్న మాటే కాదట.. “దేశ”మంతా లోకేష్….?

నిజమే.. తెలుగుదేశం పార్టీలో చాలా మంది నేతలు అనుకుంటున్నది ఇదే. అచ్చెన్నాయుడు వీడియో వైరల్ అవ్వడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో విస్తృత చర్చ జరుగుతుంది. నారా లోకేష్ [more]

Update: 2021-04-14 06:30 GMT

నిజమే.. తెలుగుదేశం పార్టీలో చాలా మంది నేతలు అనుకుంటున్నది ఇదే. అచ్చెన్నాయుడు వీడియో వైరల్ అవ్వడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో విస్తృత చర్చ జరుగుతుంది. నారా లోకేష్ సక్రమంగా ఉంటే పార్టీకి ఈ పరిస్థిితి ఎందుకు వచ్చేది? అన్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సరే.. అచ్చెన్నాయుడు చెబుతున్నట్లు ఆ వీడియోను మార్పింగ్ చేశారనుకుందాం. సంభాషణలను వక్రీకరించారని అనుకుందాం. కానీ అచ్చెన్నాయుడు స్పందించిన తీరే మరింత అనుమానాలకు తావిస్తుంది.

మనసులో మాటనే…..

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. ఎంతో కాలం మనసులో ఉన్న మాటనే అచ్చెన్నాయుడు బయటపెట్టారు. నారా లోకేష్ నిజంగా కిందిస్థాయి నుంచి వచ్చిన నేత కాదు. ఆయన చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా రాణించలేకపోవడానికి కారణం నేతల పట్ల ఆయన బిహేవియర్ అని చెప్పక తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక మంది సీనియర్ నేతలు కూడా లోకేష్ విషయంలో ఏమీ అనలేక తలలు పట్టుకున్న సందర్భాలున్నాయి.

గతంలో సీనియర్ నేతలు…..

అప్పట్లో ఉప ముఖ్యమంత్రి గా ఉన్న కేఈ కృష్ణమూర్తి సయితం లోకేష్ విషయంలో అసంతృప్తికి గురయ్యారు. యనమల రామకృష్ణుడు సయితం ఇబ్బందులుపడ్డారన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. ఇక వల్లభనేని వంశీ వంటి నేతలు పార్టీ నుంచి బయటకువచ్చాక చేసిన విమర్శలకు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా ఆయన టార్గెట్ లోకేష్ మాత్రమే అయ్యారు. పార్టీని వీడుతున్న నేతలందరూ లోకేష్ వ్యవహార శైలినే తప్పుపట్టారు.

చంద్రబాబు తొందర ప్రయత్నం…..

ఇప్పుడు అచ్చెన్నాయుడు కూడా అదే మాట అన్నారు. ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈపరిస్థితి దాపురించేది కాదని అచ్చెన్నాయుడు అన్న వ్యాఖ్యలు టీడీపీలోని చాలామంది నేతల మనసులో ఉందేనంటున్నారు. లోకేష్ ను అర్జంట్ గా పార్టీ కి ఫ్యూచర్ నేతగా మలచాలన్న చంద్రబాబు ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పాలి. నేతలను కలుపుకుని పోవడంలో, వారికి గౌరవం ఇవ్వడంలోనూ లోకేష్ పట్టించుకోవడం లేదన్నది ఇప్పటికీ పార్టీలో విన్పిస్తున్న విమర్శ. వైరల్ వీడియోకు అచ్చెన్నాయుడు నుంచి ఖండన వచ్చింది కానీ లోకేష్ నుంచి రెస్పాన్స్ రాకపోవడానికి అదే కారణమంటున్నారు.

Tags:    

Similar News