ఈ ఇద్దరు...?

Update: 2018-07-11 15:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి వాతావరణం. రాజకీయవారసుల్లో సుహృద్భావ శుభకామనలు. యువతరం ప్రతినిధుల్లో కలిసి పనిచేయాలన్న బలమైన కాంక్ష. అదే సమయంలో పట్టు విడుచుకోనట్టి పోటీ తత్వం. మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సులభవ్యాపార నిర్వహణలో దేశంలో తొలి రెండు స్థానాలు సాధించిన సందర్బంగా టీడీపీ, టీఆర్ఎస్ యువతరం ప్రతినిధుల్లో వెల్లివిరిసిన ట్వీట్లు ఆ పార్టీల్లో సంబరాన్ని నింపుతున్నాయి. కేవలం వారసత్వమే ప్రాతిపదికగా కాకుండా తమ పనితీరును నిరూపించుకోవడానికి వారిరువురూ పడుతున్న కష్టం కూడా గుర్తించదగిందేనని చెప్పుకోవాలి. అనుభవం తక్కువే అయినప్పటికీ మంత్రి పదవి లభించడం వారసత్వం కారణంగానే వచ్చిందనేది నిర్వివాదాంశం. దానిని నిలబెట్టుకోవడానికి మాత్రం శాయశక్తులా కష్టపడుతున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో విధానాల రూపకల్పన మొదలు అమలు వరకూ వీరిద్దరూ గట్టి పట్టుదల కనబరిచారనేది అధికారుల ప్రశంస. ఎలాగూ ముఖ్యమంత్రుల కుమారులు కాబట్టి సహజంగానే వారి ఆలోచనలకు యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందువల్ల వాటిని ఆచరణలోకి తేవడం సులభసాధ్యమవుతోంది.

పోటా పోటీ...

తెలంగాణలో పరిశ్రమలకు సంబంధించి కేటీఆర్ స్వయంగా నేతృత్వం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో లోకేశ్ పరిశ్రమల మంత్రి కాకపోయినప్పటికీ అన్నీ తానై పర్యవేక్షిస్తున్నారు. ఉపాధి కల్పనకు పెట్టుబడులు, సులభతరవ్యాపార నిర్వహణ అత్యవసరం. అందులోనూ విభజన తర్వాత నవ్యాంధ్రలో ప్రజావిశ్వాసం పెంచాలంటే పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించాలి. అందుకే లోకేశ్ తక్కువ పెట్టుబడితో సేవారంగంగా అత్యధికంగా ఉపాధి చేకూర్చే సాఫ్ట్ వేర్, బిజినెస్ అవుట్ సోర్సింగులపై దృష్టి పెట్టారు. ఈమేరకు విదేశీ పర్యటనల్లో, దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాలా వరకూ ఆయన పర్యటనలు విజయవంతమైనట్లుగానే చెప్పుకోవాలి. ఇక కేటీఆర్ ప్రపంచ సదస్సు మొదలు అమెరికా పర్యటనల వరకూ అంతా తానై వ్యవహరిస్తున్నారు. అనేక అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాదు చుట్టుపక్కలకు ఈ నాలుగేళ్ల కాలంలో తేగలిగారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో కొడుకు లోకేశ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి గట్టి మద్దతు, సహకారం లభిస్తోంది. పెట్టుబడుల విషయంలో ప్రపంచానికి చంద్రబాబునాయుడి నాయకత్వమే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. సర్వంసహా కేటీఆర్ కే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది.

రాజకీయాల్లో ఎవరు మేటి ?

రాజకీయ నాయకత్వాన్ని అందిపుచ్చుకునే క్రమంలో సైతం కేటీఆర్, లోకేశ్ లు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో సీనియర్ మంత్రులు చాలామంది ఉన్నారు. ఎన్టీరామారావు కాలంనుంచి పనిచేసిన నాయకత్వం ఉంది. అయినప్పటికీ చాలా విషయాల్లో లోకేశ్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు మంత్రులు మినహా అంతా తమ చిన్న బాస్ గా లోకేశ్ ను గుర్తిస్తున్నారు. ఆయన చెబితే అధినేత చెప్పినట్లుగానే ఆచరిస్తున్నారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకూ యువ రాజకీయ నాయకత్వాన్ని తయారు చేసుకునే పనిలో పడ్డారు లోకేశ్. ఎనిమిదో దశకంలో రాజకీయాల్లోకి వచ్చిన సీనియర్ నేతల పిల్లలను ప్రోత్సహించాలనే దిశలో కార్యాచరణ సిద్దం చేసుకున్నారు. 2019లో కొన్ని సీట్లను వారసులకు కేటాయించేందుకు ఇప్పటికే ఒక జాబితాను లోకేశ్ తయారు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. లోకేశ్ తో పోలిస్తే కేటీఆర్ కు పార్టీలో అంత స్వేచ్ఛ లేదనే చెప్పాలి. సొంత అనుచర వర్గాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా తయారుచేసుకునేంత వెసులుబాటు కేటీఆర్ కు ఇంకా లభించలేదు. కేసీఆర్ అనుమతి లేకుండా పార్టీ పరమైన వ్యవహారాలు నిర్వహించలేకపోతున్నారు. అయితే ప్రజల్లోకి వెళ్లి కార్యక్రమాలు నిర్వహించే విషయంలో లోకేశ్ కంటే కేటీఆర్ కే అగ్రస్థానం లభిస్తోంది. మాటతీరు, ఆకట్టుకునే ప్రసంగాలు, సందర్భోచితమైన నాయకత్వ లక్షణాలు కలగలిసి కేటీఆర్ ప్రజల్లో ఇమేజ్ సాధించగలుగుతున్నారు. లోకేశ్ కు ఇంకా ఈ లక్షణాలు అలవడలేదనేది పరిశీలకుల అంచనా.

వారసత్వ పోటీ....

తెలంగాణ రాష్ట్రసమితిలోని నాయకులు భవిష్యత్ బాస్ విషయంలో కొంత సందిగ్ధతలోనే ఉన్నట్లుగా చెప్పుకోవాలి. ఏపీలో పోటీలేదు. లోకేశ్ మాత్రమే చంద్రబాబు నాయుడి స్థానాన్ని భర్తీ చేస్తారనే విషయంలో రెండో మాటకు తావు లేదు. కానీ తెలంగాణలో ఉద్యమ ప్రారంభం నుంచి చురుకైన పాత్ర పోషించింది హరీశ్ రావు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లోనూ, ద్వితీయశ్రేణి నాయకత్వంలోనూ హరీశ్ ముద్ర చెరిపివేయలేనిది. అంతగా అల్లుకుపోయాడు. యూనియన్ల నాయకునిగా, ఉద్యమ నేతగా తనదైన శైలి, పంథా ఆయనకుంది. కేటీఆర్ కు ఈ విషయంలో కొంత తక్కువ మార్కులే పడతాయి. తిరుగులేని వారసునిగా నిలవాలంటే తండ్రి కేసీఆర్ మద్దతు ఇస్తే మాత్రమే సాధ్యమవుతుంది. నగరీకరణ పోకడ కనబరిచే కేటీఆర్ కు కార్యకర్తలు, ప్రజల్లో ఒకడిగా కలిసిపోయే హరీశ్ కు మధ్య అంతరం నెలకొని ఉంది. ఈ గ్యాప్ ను భర్తీ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు కేటీఆర్. హరీశ్ ను లోక్ సభకు పంపితే కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కు లైన్ క్లియర్ చేసినట్లే. దీనిపైనే టీఆర్ఎస్ లో సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. మొత్తమ్మీద రాజకీయ వారసులు కేవలం తండ్రుల సామర్థ్యం మీద మాత్రమే ఆధారపడకుండా తమను తాము నాయకులుగా నిరూపించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తమ రాష్ట్రాలు, ప్రజల పట్ల వారు చూపుతున్న చిత్తశుద్ధికి వారి కార్యాచరణ అద్దం పడుతోందంటున్నారు పరిశీలకులు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News