లోకేష్ దెబ్బకు ఖాళీ అవుతున్నారా ?

టిడిపి లో చంద్రబాబు నాయకత్వం నడిచిన రోజులన్ని ఆ పార్టీకి మంచిగానే సాగాయి. ఎప్పుడైతే అధినేత తనయుడు నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి చాపకింద నీరులా [more]

Update: 2019-06-21 03:19 GMT

టిడిపి లో చంద్రబాబు నాయకత్వం నడిచిన రోజులన్ని ఆ పార్టీకి మంచిగానే సాగాయి. ఎప్పుడైతే అధినేత తనయుడు నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి చాపకింద నీరులా సాగుతున్న అసంతృప్తి వ్యవహారం మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత బయటపడిపోతుంది. తాజాగా నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని పెద్దల సభలో బిజెపి లో విలీనం అని ప్రకటించే స్థాయికి ఇప్పుడు పసుపుకోటకు బీటలు మొదలయ్యాయి. నారా లోకేష్ పార్టీలోనూ పాలన వ్యవహారాల్లో జోక్యం లేనంత వరకు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి బ్యాచ్ కి ఆడింది ఆట పాడింది పాట అధినేత చెంత. చినబాబు అడుగుపెట్టినప్పటినుంచి వీరి పెత్తనానికి గండి పడిపోయింది. పార్టీ అధికారంలో ఉండటంతో చినబాబు పెదబాబు నో చెప్పకపోవడం తో కక్కలేక మింగలేక ఇన్నాళ్లు ఆ బాధలు భరించారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

వెంకటేష్ పలుమార్లు గళమెత్తినా …

టిజి వెంకటేష్ అనేక సందర్భాల్లో బాహాటంగానే లోకేష్ వైఖరిపై ఫైర్ అవుతూ వచ్చేవారు. కర్నూల్ లోకల్ రాజకీయాల్లో నారా లోకేష్ జ్యోక్యం తన వ్యతిరేకులకు ముందే టికెట్ ప్రకటించేయడం వంటి పరిణామాలపై టిజి రోడ్డెక్కి మరీ ఫైట్ చేశారు. నారా లోకేష్ ఎవ్వరు, చంద్రబాబు కదా చెప్పాలిసింది అంటూ డేరింగ్ గానే ధ్వజమెత్తారు. టికెట్ కొనుక్కుని రావడంతో ఆయన ఇలా కుండబద్ధలు కొట్టేస్తున్నారని పసుపుదళంలో అప్పుడే చెవులు కొరుక్కునేవారు. ఇంత బాహాటంగా కీలక నేతల్లో అసంతృప్తులు వున్నా బాబు అవన్నీ చూసి చూడనట్లు వదిలేయడం రాజ్యసభలో నేటి దుస్థితికి కారణం అన్నది విశ్లేషకుల మాట. సుజనా చౌదరి, సిఎం రమేష్ , గరికపాటి వంటివారు టిడిపిలో ఎంపి ఎమ్యెల్యేల టికెట్లు డిసైడ్ చేసే టీం అలాంటి వారికి మొన్నటి ఎన్నికల్లో టికెట్లు కేటాయింపు కాదుకదా ఏ పని లోకేష్ అప్పగించలేదని తెలుస్తుంది. వారి మాటకు కొంత కాలంగా విలువే లేకుండా పోయిందని తమ సన్నిహితుల వద్ద వారు వాపోయారని పార్టీ వర్గాల్లో ప్రచారం. వెరసి ఇవన్నీ ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా కష్టాల్లో వున్న బాబు ను మరింత నిండా ముంచాయన్నది రాజకీయ నిపుణుల అంచనా.

Tags:    

Similar News