లోకేష్ మళ్లీ అక్కడేనట

ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ కు మంచిరోజులు వస్తున్నట్లే కనపడుతున్నాయి. ఆయన తొలిసారి ప్రత్యక్ష్య ఎన్నికల్లో బరిలోకి దిగి ఓటమి [more]

Update: 2019-12-29 14:30 GMT

ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ కు మంచిరోజులు వస్తున్నట్లే కనపడుతున్నాయి. ఆయన తొలిసారి ప్రత్యక్ష్య ఎన్నికల్లో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో ఆయన గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కానీ వైసీపీ గాలిలో నారా లోకేష్ సయితం కొట్టుకుపోయారు. దారుణ ఓటమితో నారా లోకేష్ వచ్చే ఎన్నికల నాటికి మరో నియోజకవర్గాన్ని ఎంచుకోక తప్పదన్న సూచనలూ వచ్చాయి.

ఒక దశలో మార్చాలని…

విజయవాడ పరిధిలోని పెనమలూరు నియోజకవర్గం అయితే నారా లోకేష్ కు అనువైనదిగా ఉంటుందని ఓటమి తర్వాత కొందరు నేతలు సూచనలు కూడా చేశారు. అయితే మారుతున్న పరిస్థితులతో నారా లోకేష్ మంగళగిరి కలసి వచ్చేటట్లు కన్పిస్తుంది. రాజధాని అమరావతిని ముఖ్యమంత్రి జగన్ మూడు ముక్కలు చేయడంతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ ప్రాంతానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి సయితం జవాబు చెప్పకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.

ఈసారి గ్యారంటీగా…..

ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో పడుతుందన్న అంచనాలు ఆ పార్టీలో ఏర్పడ్డాయి. నారా లోకేష్ మళ్లీ పోటీ చేసి విజయం సాధించేందుకు మార్గం సుగమమయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తే మంగళగిరి వేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని, మూడు ముక్కలు చేస్తే మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందన్నది ఆ ప్రాంత ప్రజల ఆవేదన. చంద్రబాబు సయితం రాజధాని రైతులకు మద్దతు తెలపడం మంగళగిరిలో టీడీపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు.

సర్వేలో కూడా …..

అందుకే మంగళగిరి ప్రజలు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినా వైసీపీకి వ్యతిరేకంగా ఉంటారన్న అంచనాలో నారా లోకేష్ ఉన్నారు. మల్లీ మంగళగిరిలో పోటీ చేసి గెలిచి విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని నారా లోకేష్ భావిస్తున్నారు. అందుకే ఎక్కువ సమయం మంగళగిరి ప్రాంతంలోనే నారా లోకేష్ గడుపుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత నారా లోకేష్ వ్యక్తిగతంగా సర్వే కూడా చేయించినట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో టీడీపీకి అనుకూలంగా రావడంతో మరోసారి పోటీ చేసి నెగ్గాలని నారాలోకేష్ పట్టుదలగా ఉన్నారు. మరి నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో పరిస్థితులు ఇప్పటి మాదిరిగా ఉంటాయా? అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే.

Tags:    

Similar News